Reduce the Risk of Colon Cancer : పెద్దపేగు క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించే సూపర్ ఫుడ్స్
సాక్షి లైఫ్ : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో క్యాన్సర్ మహమ్మారి రకరకాల రూపాల్లో పంజా విసురుతోంది. వీటిలో మరీ ముఖ్యంగా 'కొలొరెక్టల్ క్యాన్సర్' (colorectal cancer) కేసులు ఇటీవలి కాలంలో యువతలోనూ ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా వంశపారంపర్యంగా లేదా వయసు పైబడిన వారిలోనే ఈ వ్యాధి వస్తుందని అనుకుంటాం. కానీ, మనకు తెలియని కొన్ని చిన్న చిన్న మార్పుల ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి..?
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి.. తినే సమయంలో నీళ్లు తాగకూడదా..? ఏమౌతుంది..?
1. పెరుగుతో 'ప్రోబయోటిక్' రక్షణ..
చాలామందికి పెరుగు కేవలం భోజనం చివరలో తినే పదార్థం మాత్రమే. కానీ, రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ ముప్పు 7 శాతం వరకు తగ్గుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పెరుగులోని 'లాక్టోబాసిల్లస్' వంటి మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) పేగుల్లోని వాపును (Inflammation) తగ్గించి, క్యాన్సర్ కారక కణాలను అడ్డుకుంటుంది.
2. యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త..!
చిన్నపాటి జలుబు, జ్వరం రాగానే వెంటనే యాంటీబయోటిక్స్ వాడే అలవాటు ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త! అనవసరంగా లేదా సుదీర్ఘకాలం పాటు యాంటీబయోటిక్స్ వాడటం వల్ల పేగుల్లోని సహజసిద్ధమైన మైక్రోబయోమ్ దెబ్బతింటుంది. ఇది భవిష్యత్తులో క్యాన్సర్‌కు దారితీసే 'పాలిప్స్' ఏర్పడటానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
3. 'మెగ్నీషియం'తో చెక్ పెట్టండి..
మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాల్లో మెగ్నీషియం ఒకటి. ఆకుకూరలు, బాదం, జీడిపప్పు, తృణధాన్యాల ద్వారా లభించే మెగ్నీషియం పేగు గోడలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో తగినంత మెగ్నీషియం స్థాయిలు ఉండటం వల్ల పెద్దపేగులో కణితులు ఏర్పడే ముప్పు తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.
4. కాల్చిన మాంసం.. శాపంగా మారుతుందా..?
నేటి తరం ఎంతో ఇష్టపడే 'బార్బెక్యూ' లేదా నిప్పుల మీద నేరుగా కాల్చిన మాంసం (Charred meat) ఆరోగ్యానికి చేటు చేయవచ్చు. అధిక ఉష్ణోగ్రత వద్ద మాంసాన్ని కాల్చినప్పుడు అందులో 'హెటెరోసైక్లిక్ అమైన్స్' వంటి క్యాన్సర్ కారక రసాయనాలు విడుదలవుతాయి. మాంసాన్ని నేరుగా మంటపై కాకుండా, వండుకుని తినడమే శ్రేయస్కరం.
5. ఆల్కహాల్ ఆధారిత మౌత్ వాష్‌లు వద్దు..
ఇది చాలా వింతగా అనిపించినా నిజం! మనం వాడే కొన్ని రకాల మౌత్ వాష్‌లలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది నోటిలోని బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీయడమే కాకుండా, పరోక్షంగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపి పెద్దపేగు క్యాన్సర్ ముప్పును పెంచే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆల్కహాల్ లేని సహజసిద్ధమైన మౌత్ వాష్‌లను ఎంచుకోవడం ఉత్తమం.
వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కంటే, రాకముందే మేల్కొనడం ఉత్తమం. పీచు పదార్థం (Fiber) అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం, 45 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా 'కొలొనోస్కోపీ' వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
