Which Doctor, Which Disease : ఏ వ్యాధికి ఏ డాక్టర్‌ను కలవాలి..? ముందే తెలుసుకుంటే ఆసుపత్రుల చుట్టూ తిరిగే తిప్పలుండవు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అనారోగ్యం బారిన పడినప్పుడు చాలామందికి వచ్చే మొదటి సందేహం..'ఏ డాక్టర్‌ను కలవాలి..?' అని. అవగాహన లేక తప్పు విభాగానికి వెళ్లి సమయం, డబ్బు వృథా చేసుకునే వారు ఎందరో. వైద్యశాస్త్రంలో శరీరంలోని ప్రతి అవయవానికి, ప్రతి ప్రత్యేక సమస్యకూ వేర్వేరు నిపుణులు ఉంటారు. అత్యవసర సమయంలో కంగారు పడకుండా ఉండాలంటే.. ఏ డాక్టర్‌ను ఏమని పిలుస్తారో, వారు ఏ సమస్యలకు చికిత్స అందిస్తారో తెలుసుకోవడం చాలా అవసరం. ఆయా వైద్య నిపుణుల గురించి సంక్షిప్త సమాచారం మీకోసం..

1. కార్డియాలజిస్ట్ (Cardiologist - గుండె నిపుణులు)..

గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు వీరు చికిత్స అందిస్తారు. ఛాతీలో నొప్పి, గుండె దడ, అధిక రక్తపోటు (bp), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి.

2. డెర్మటాలజిస్ట్ (Dermatologist - చర్మ వ్యాధుల నిపుణులు)..


చర్మం, జుట్టు, గోళ్లకు సంబంధించిన సమస్యలను వీరు చూస్తారు. మొటిమలు, చర్మంపై దద్దుర్లు, దురద, ఎలర్జీలు, విపరీతంగా జుట్టు రాలడం లాంటి సమస్యలకు డెర్మటాలజిస్ట్‌ను కలవాలి.

 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

3. ఆప్తాల్మాలజిస్ట్ (Ophthalmologist - కంటి వైద్యులు)..

కంటికి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు వీరు వైద్యం చేస్తారు. చూపు మందగించడం, కళ్లలో నొప్పులు, శుక్లాలు (cataracts), గ్లకోమా లాంటి సమస్యలకు వీరిని సంప్రదించాలి.

4. పీడియాట్రిషియన్ (Pediatrician - చిన్నపిల్లల వైద్యులు)..

అప్పుడే పుట్టిన పసికందుల నుంచి కౌమార దశ వరకు పిల్లల అనారోగ్య సమస్యలను వీరు పర్యవేక్షిస్తారు. పిల్లల్లో జ్వరం, ఇన్ఫెక్షన్లు, ఎదుగుదల లోపాలు, పోషకాహార సమస్యలు, టీకాలు వేయించడానికి పీడియాట్రిషియన్‌ను కలవాలి.

5. గైనకాలజిస్ట్ (Gynecologist - స్త్రీ సంబంధిత వ్యాధుల నిపుణులు)..

మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు వీరు చికిత్స అందిస్తారు. నెలసరి సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, గర్భధారణ, ప్రసవం సంబంధిత సమస్యలకు గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.

6. ఆర్థోపెడిక్ (Orthopedic - ఎముకల వైద్యులు)..

ఎముకలు, కీళ్లు, కండరాలు, కణజాలాలకు సంబంధించిన సమస్యలకు వీరు నిపుణులు. ఎముకలు విరగడం, తీవ్రమైన నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, క్రీడల్లో తగిలే గాయాలకు వీరు చికిత్స చేస్తారు.

7. ఈఎన్టీ స్పెషలిస్ట్(ENT Specialist - చెవి, ముక్కు, గొంతు నిపుణులు)..

పేరులోనే ఉన్నట్లుగా చెవి (Ear), ముక్కు (Nose), గొంతు (Throat) సమస్యలకు వీరు వైద్యం చేస్తారు. వినికిడి లోపం, గొంతు నొప్పి, మాట బొంగురుపోవడం, సైనస్ సమస్యలు ఉంటే ఈఎన్టీ డాక్టర్‌ను కలవాలి.

8. డెంటిస్ట్ (Dentist - దంత వైద్యులు)..

పళ్లు, చిగుళ్ల సమస్యలకు వీరు చికిత్స చేస్తారు. పంటి నొప్పి, పుచ్చు పళ్లు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, పళ్ల అమరిక, నోటి శుభ్రతకు డెంటిస్ట్‌ను కలవాలి.

9. సైకియాట్రిస్ట్ (Psychiatrist - మానసిక ఆరోగ్య నిపుణులు)..

మానసిక సమస్యలు, మెదడుకు సంబంధించిన భావోద్వేగ రుగ్మతలకు వీరు చికిత్స అందిస్తారు. తీవ్రమైన ఒత్తిడి, కుంగుబాటు (depression), నిద్రలేమి, ఆందోళన (insomnia and anxiety) వంటి సమస్యలకు సైకియాట్రిస్ట్‌(psychiatrist)ను సంప్రదించాలి.

10. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ (Gastroenterologist - జీర్ణకోశ నిపుణులు)..

కడుపు, పేగులు, కాలేయం (liver), జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు వీరు నిపుణులు. దీర్ఘకాలిక కడుపు నొప్పి, అజీర్తి, అల్సర్లు, గ్యాస్ సమస్యలు, లివర్ ఇన్ఫెక్షన్లు ఉంటే వీరిని కలవాలి.

 

ఇది కూడాచదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.