Dangerous Watermelon : పుచ్చకాయ ప్రాణాంతకమా..? నిపుణులు ఏమంటున్నారు..? వైరల్ వార్తల వెనుక అసలు నిజాలివే..!
సాక్షి లైఫ్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లో పుచ్చకాయల సందడి మొదలవుతుంది. శరీరానికి చలవ చేయడంతో పాటు డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడే ఈ అమృత ఫలంపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కొన్ని భయానక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముంబై, గోరఖ్పూర్ పరిసర ప్రాంతాల్లో పుచ్చకాయ తిని కొందరు మృతి చెందారనే వార్తలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలు పుచ్చకాయ మృత్యు ఫలంగా మారడం నిజమేనా? దీనిపై వైద్య నిపుణులు, పరిశోధకులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..?
ఆ రెండు ఘటనల వెనుక అసలు నిజం ఏంటి..?
ఇటీవల వెలుగులోకి వచ్చిన రెండు కేసులను పరిశీలిస్తే, మరణాలకు పుచ్చకాయ నేరుగా కారణం కాదని స్పష్టమవుతోంది.
ముంబై ఘటనలో..
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రాత్రి పుచ్చకాయ తిన్న తర్వాత మరణించడంతో మొదట పండుపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఫోరెన్సిక్ నివేదికల్లో వారి శరీరంలో 'జింక్ ఫాస్ఫైడ్' అంటే ఎలుకల నివారణకు వాడే తీవ్రమైన విషం.. ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గోరఖ్పూర్ ఘటనలో..
ఒకే కుటుంబంలో 11 మంది అస్వస్థతకు గురైన ఘటనలో.. వారు మ్యాగీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నట్లు తేలింది. వైద్యుల ప్రాథమిక అంచనా ప్రకారం ఇది తీవ్రమైన 'ఫుడ్ పాయిజనింగ్' వల్ల జరిగినట్లు తెలుస్తోంది.
పుచ్చకాయ ప్రాణాంతకమా..? నిపుణులు ఏమంటున్నారు..?
పోషకాహార నిపుణుల ప్రకారం.. పుచ్చకాయ అత్యంత సురక్షితమైన, ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. దీనివల్ల నేరుగా ప్రాణాపాయం సంభవించే అవకాశం లేదు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నట్లు పుచ్చకాయ లోపలి భాగం ఎర్రగా మారడానికి ఇంజెక్షన్లు ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదు. ఎందుకంటే పుచ్చకాయపై ఉండే గట్టి తొక్క లోపలి భాగాన్ని బాహ్య రసాయనాల నుంచి రక్షిస్తుంది. అయితే, కొన్ని రకాల రసాయనాలు ఉపయోగించి పళ్లను కృత్రిమంగా పండించడం వల్ల దీర్ఘకాలంలో కాలేయం, మూత్రపిండా లపై ప్రభావం పడవచ్చు కానీ, తక్షణ మరణాలు సంభవించవు.
ప్రమాదం ఎక్కడ పొంచి ఉంది..?
పుచ్చకాయ వల్ల కాకుండా, మనం దానిని తినే విధానం వల్లే కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
బ్యాక్టీరియా చేరడం..
పుచ్చకాయను కోసిన తర్వాత ఎక్కువసేపు బయట వదిలేస్తే.. వేసవి వేడికి దానిపై సాల్మొనెల్లా, ఇ.కోలి, లిస్టేరియా వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు వేగంగా వృద్ధి చెందుతాయి.
తీవ్ర ఫుడ్ పాయిజనింగ్..
ఇలా ముక్కలు కోసి ఎక్కువ సమయం నిల్వ ఉంచిన పండ్లను తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం వంటి లక్షణాలతో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. బలహీన నిరోధక శక్తి.. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది.
పుచ్చకాయ తినేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు..
పుచ్చకాయను కోయడానికి ముందే ప్రవహించే నీటి కింద పెట్టి తొక్కను శుభ్రంగా కడగాలి. దీనివల్ల తొక్కపై ఉండే బ్యాక్టీరియా లోపలికి చేరకుండా ఉంటుంది. పండును కోసిన వెంటనే తినేయడం మంచిది. మార్కెట్లలో రోడ్డు పక్కన ముందుగానే కోసి, ఈగలు వాలుతూ విక్రయించే ముక్కలను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనవద్దు. పాత్రల పరిశుభ్రత..పండును కోయడానికి ఉపయోగించే కత్తి, బోర్డు, నిల్వ చేసే పాత్రలు పూర్తిగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరిగా మార్పు గమనించండి..కోసి ఉంచిన పుచ్చకాయ ముక్కల రంగు మారినా, జిగటగా అనిపించినా లేదా బ్యాడ్ స్మెల్ వస్తున్నా వాటిని తినకుండా పారేయడమే ఉత్తమమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
