Blood Sugar : ఉదయాన్నే బ్లడ్ షుగర్ పెరుగుతోందా..? ఐతే మీ డైట్‌లో ఈ 5 చేర్చుకోండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మధుమేహ బాధితులను తరచుగా వేధించే సమస్య.. ఉదయం నిద్రలేవగానే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా నమోదు కావడం. రాత్రంతా ఏమీ తినకపోయినా ఉదయం షుగర్ లెవల్స్ అమాంతం పెరిగితే, దాన్ని వైద్య పరిభాషలో 'డాన్ ఫెనామినన్' (Dawn Phenomenon) అంటారు. నిద్రలేమి, ఒత్తిడి, రాత్రి భోజనం చేసే సమయం, మందులు వాడే విధానం లాంటివి దీనికి కారణం కావచ్చు.కేవలం తీపి పదార్థాలకు దూరంగా ఉండటమే కాకుండా.. పీచు పదార్థాలు (fiber), ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని ఉదయం పూట తీసుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. మీ ఉదయం డైట్‌లో చేర్చుకోవాల్సిన ఆ 5 ముఖ్యమైన పదార్థాలు ఏంటో చూద్దాం..

 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

షుగర్‌ను నియంత్రించే అద్భుతమైన ఆహారాలు..

1. మెంతులు (Fenugreek Seeds)..

 మెంతులలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను, గ్లూకోజ్ రక్తంలో కలిసే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. రాత్రి పూట గుప్పెడు నీళ్లలో కొద్దిగా మెంతులు నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే, క్రమం తప్పకుండా మందులు వాడేవారు వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవాలి.

2. ఓట్స్ (Oats)..

ఉదయం అల్పాహారంలో స్వీట్ కార్న్‌ఫ్లేక్స్, మైదాతో చేసిన పదార్థాలకు బదులుగా చక్కెర లేని ఓట్స్ తీసుకోవడం ఉత్తమం. ఇందులోని కరిగే ఫైబర్ (Soluble fiber) భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటుంది. ఓట్స్‌లో తాజా కూరగాయలు, కొద్దిగా నట్స్ కలుపుకుంటే మరింత పోషకభరితంగా ఉంటుంది.

3. బాదం, వాల్‌నట్స్ (Almonds & Walnuts)..

 వీటిలో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు మెండుగా ఉంటాయి. ఉదయాన్నే నానబెట్టిన బాదం లేదా కొన్ని వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. తద్వారా పదేపదే అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. గమనిక: వీటిని తేనె లేదా చక్కెరతో కలిపి తీసుకోకూడదు.

4. చియా సీడ్స్ (Chia Seeds)..

 ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులకు చియా సీడ్స్ కేరాఫ్ అడ్రస్. వీటిని నీళ్లలో, చక్కెర లేని పెరుగులో లేదా సలాడ్లలో కలుపుకుని తినవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఈ గింజలు గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసి షుగర్ స్పైక్స్‌ను అడ్డుకుంటాయి. అయితే, ఇవి తీసుకున్నప్పుడు రోజంతా తగినంత నీరు తాగడం ముఖ్యం.

5. పిండిపదార్థాలు లేని కూరగాయలు (Non-Starchy Veggies)..

 పాలకూర, సొరకాయ, బెండకాయ, బీరకాయ, బ్రొకోలీ, కీరదోస వంటివి మధుమేహులకు చాలా మేలు చేస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని పప్పు, పన్నీర్ వంటి ప్రొటీన్ ఉన్న ఆహారంతో కలిపి తీసుకుంటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఉదయం పూట బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే కేవలం ఏదో ఒక ఆహారంపైనే ఆధారపడకూడదు. రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడం, నిద్రలేమి, ఒత్తిడి, మందులు సమయానికి వేసుకోకపోవడం కూడా షుగర్ పెరగడానికి కారణాలే. కాబట్టి మీ జీవనశైలిని మార్చుకోవడంతో పాటు, క్రమం తప్పకుండా షుగర్ రీడింగ్స్ నమోదు చేస్తూ మీ వైద్యుడి సలహాలను పాటించడం అత్యంత ముఖ్యం.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.