లంకణం పరమౌషధం.. పరిశోధనల్లో వెల్లడి..
సాక్షి లైఫ్: లంకణం పరమౌషధమని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇదే విషయాన్ని పరిశోధకులు తమ రీసెర్చ్ ద్వారా మరోసారి నిరూపించారు. అమెరికాలోని మౌంట్ సినాయ్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు లంకణం ఆరోగ్యానికి ప్రయోజనకరమని ప్రయోగాత్మకంగా రుజువు చేశారు.
పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం.. ఉపవాసం శరీరంలో మంట, వాపు తగ్గిస్తుందట. రోగ నిరోధక వ్యవస్థపై ఏమాత్రం ప్రభావం చూపకుండానే.. మంట, వాపులను నయం చేయగలదని తేలింది. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ చేసే మొట్టమొదటి పని మంట, వాపు సృష్టించడం.
ఈ సమస్యలు ఎక్కువ కాలం ఉంటే గుండెజబ్బులు, మధుమేహం, కేన్సర్ వంటి అనేక జబ్బులు తలెత్తుతాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మిరియం మెరాడ్ ఆధ్వర్యంలోని శాస్త్రవే త్తల బృందం మానవ,ఎలుకల రోగనిరోధక వ్యవస్థ కణాలపై అధ్యయనం నిర్వహించింది.
ఉపవాసం ఉన్నప్పుడు మంట, వాపులకు కారణమయ్యే మోనోసైట్స్ ఉపవాసంలో నిద్రాణ స్థితికి చేరుకుంటాయని చెబుతున్నారు. మరిన్ని పరిశో ధనలతో మంట, వాపులకు మెరుగైన చికిత్స సాధ్యమవుతుందని, ప్రాణాంతక వ్యాధులను నివారించడం సాధ్యమవుతుందని వివరించారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
