Anemia Control : అనీమియాపై ఐసీఎంఆర్ అండ్ ఎన్ ఐ ఎన్ విజయం..! ఇలా చేయడంతో 80% వరకు తగ్గుదల.. తాజా అధ్యయనంలో వెల్లడి..
సాక్షి లైఫ్ : దేశంలో ఐదేళ్లలోపు చిన్నారులను వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య 'రక్తహీనత' (Anemia) నివారణపై హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్-జాతీయ పోషకాహార సంస్థ (NIN) శాస్త్రవేత్తల పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పిల్లల్లో రక్తహీనతను ప్రాథమిక దశలోనే గుర్తించి, క్రమం తప్పకుండా 'ఐరన్-ఫోలిక్ యాసిడ్' (IFA) సప్లిమెంట్లు అందించడం ద్వారా ఈ సమస్యను 77 నుంచి 80 శాతం వరకు అదుపు చేయవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన 'యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
మురికివాడల్లో ముమ్మర పరిశోధన..
హైదరాబాద్ నగరంలోని పలు పట్టణ మురికివాడల్లో నివసించే ఐదేళ్లలోపు చిన్నారులపై శాస్త్రవేత్తలు ఈ క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. 825 మంది పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహించగా 13 నుంచి 57 నెలల వయసున్న 248 మంది చిన్నారుల్లో రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. 90 రోజుల పాటు నిరంతర పర్యవేక్షణలో ఈ పరిశోధన సాగింది. ఈ అధ్యయనంలో పిల్లలకు ఐరన్-ఫోలిక్ యాసిడ్ ఇవ్వడంతో పాటు, మరికొందరికి అదనంగా 'లాక్టోబాసిల్లస్ ప్లాంటారం' అనే ప్రోబయోటిక్‌ను కూడా అందించి ఫలితాలను విశ్లేషించారు.
ఫలితాలు అద్భుతం..
90 రోజుల పాటు నేరుగా పర్యవేక్షిస్తూ అందించిన ఈ చికిత్స ద్వారా చిన్నారుల ఆరోగ్యంలో విప్లవాత్మక మార్పులు కనిపించాయి.
హిమోగ్లోబిన్ వృద్ధి: చిన్నారుల్లో హిమోగ్లోబిన్ స్థాయి సగటున 2 గ్రాములు/డెసిలీటర్ (2 g/dL) పెరిగింది.
రక్తహీనతకు బ్రేక్.. రక్తహీనత తీవ్రత ఏకంగా 77 శాతం తగ్గింది. శరీరంలో ఐరన్ లోపం 98 శాతం తగ్గడమే కాకుండా.. ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా (Iron Deficiency Anaemia) 100 శాతం పూర్తిగా నయమైంది.
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'అనీమియా ముక్త్ భారత్' (AMB) కార్యక్రమం ఎంతటి అద్భుత ఫలితాలను ఇస్తుందో ఈ అధ్యయనం మరోసారి శాస్త్రీయంగా నిరూపించింది.
ప్రోబయోటిక్స్‌తో అదనపు ప్రయోజనం లేదు..!
ఐరన్ శోషణను పెంచడానికి లేదా పేగుల ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి ప్రోబయోటిక్స్ ఏమైనా తోడ్పడతాయా..? అన్న కోణంలోనూ శాస్త్రవేత్తలు పరిశీలించారు. అయితే, ఐరన్‌తో పాటు ప్రోబయోటిక్స్ వాడిన పిల్లల్లో హిమోగ్లోబిన్ స్థాయిల్లో కానీ, ఐరన్ నిల్వల్లో కానీ ఎలాంటి అదనపు మార్పులు కనిపించలేదు. సాధారణ బాల్య వ్యాధుల తీవ్రత తగ్గడంలోనూ దీని వల్ల ప్రత్యేక ప్రయోజనమేమీ లేదని పరిశోధన తేల్చింది.
స్క్రీన్ అండ్ ట్రీట్ విధానమే రక్ష..
దేశవ్యాప్తంగా అమలువుతున్న 'స్క్రీన్ అండ్ ట్రీట్' (గుర్తించడం-చికిత్స అందించడం) విధానానికి ఈ అధ్యయనం బలమైన శాస్త్రీయ ఆధారాన్ని ఇచ్చింది. ముందస్తు స్క్రీనింగ్, సకాలంలో ఐఎఫ్‌ఏ చికిత్స ద్వారా పిల్లల్లో అనీమియా భారాన్ని తగ్గించవచ్చు. సాధారణ చికిత్సకు అదనంగా ప్రోబయోటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టమైందని ఐసీఎంఆర్ అండ్ ఎన్ ఐ ఎన్ డైరెక్టర్, డా.భారతి కులకర్ణి తెలిపారు.
ప్రధాన పరిశోధకులు డాక్టర్ టీనా దాసి, డాక్టర్ రవీంద్రనాథ్ పాలిక మాట్లాడుతూ.."అనీమియా ముక్త్ భారత్ మార్గదర్శకాల ప్రకారం సప్లిమెంట్లను వాడితే చిన్నారుల్లో రక్తహీనతను పూర్తిగా నిర్మూలించవచ్చు. మందులు వాడేటప్పుడు తల్లిదండ్రులు చూపే శ్రద్ధ, పిల్లల సహకారం (Compliance) ఇక్కడ అత్యంత కీలకం" అని అన్నారు.
తల్లిదండ్రులు గమనించాల్సింది..
చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు రక్తహీనత పెద్ద శాపం. దీని నుంచి పిల్లలను రక్షించాలంటే.. ప్రాథమిక దశలోనే పిల్లలకు రక్తపరీక్షలు చేయించాలి. ప్రభుత్వ వైద్యుల సూచనల మేరకు ఐరన్-ఫోలిక్ యాసిడ్ సిరప్ లేదా మాత్రలు వాడాలి. కోర్సు పూర్తయ్యే వరకు నిర్లక్ష్యం చేయకుండా మందులు వేయాలి.
