Exercise for Longevity: వ్యాయామంతోనే ఆయుష్షు: బరువులు ఎత్తే అలవాటుతో అకాల మరణాల ముప్పునకు బ్రేక్..!
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి కారణంగా గుండెజబ్బులు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులు చిన్న వయసులోనే ప్రాణాలను హరిస్తున్నాయి. అయితే, శారీరక దృఢత్వాన్ని పెంచే వ్యాయామాల ద్వారా ఈ ముప్పును సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చని అంతర్జాతీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా వారానికి కనీసం ఒకటిన్నర నుంచి రెండు గంటల పాటు బరువులు ఎత్తే వ్యాయామాలు (Weight Lifting / Strength Training) చేయడం వల్ల ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ప్రముఖ అంతర్జాతీయ వైద్య జర్నల్ ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం ప్రకారం.. దాదాపు 30 సంవత్సరాల పాటు 1.47 లక్షల మందికి పైగా వ్యక్తుల జీవనశైలి, ఆరోగ్య రికార్డులను పరిశీలించి ఈ విషయాలను నిర్ధారించారు. కేవలం నడక, రన్నింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలే కాకుండా, కండరాలకు బలాన్నిచ్చే వెయిట్ ట్రెయినింగ్ కూడా దీర్ఘకాలిక ఆరోగ్యానికి అత్యంత కీలకమని ఈ పరిశోధన తేల్చిచెప్పింది.
పరిశోధనలో తేలిన ఆసక్తికర అంశాలు..
అకాల మరణాల ముప్పునకు చెక్..వారానికి 90 నిమిషాల నుంచి 2 గంటల పాటు బరువులు ఎత్తే వ్యాయామాలు చేసే వారిలో, ఏ కారణం చేతనైనా సంభవించే అకాల మరణాల ముప్పు సాధారణ వ్యక్తుల కంటే 13 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది.
గుండె జబ్బుల నివారణ..
గుండెపోటు (Heart Attack), పక్షవాతం (Stroke) వంటి హృదయ సంబంధిత వ్యాధుల వల్ల వచ్చే మరణాల సంఖ్య ఈ వ్యాయామాల ద్వారా 19 శాతం మేర తగ్గుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
మెదడు ఆరోగ్యానికి రక్షణ.. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (Dementia) మరియు ఇతర నరాల సంబంధిత వ్యాధుల (Neurological Diseases) వల్ల వచ్చే మరణాల ముప్పు ఏకంగా 27 శాతం తగ్గినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
రెండు రెట్ల ప్రయోజనం.. ఏరోబిక్ వ్యాయామాలతో (రన్నింగ్, సైక్లింగ్) పాటు బరువులు ఎత్తే వ్యాయామాలను కూడా క్రమం తప్పకుండా చేసే అత్యంత చురుకైన వ్యక్తుల్లో అకాల మరణాల ముప్పు దాదాపు 58 శాతం వరకు తగ్గుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అయితే, వారానికి రెండు గంటల కంటే ఎక్కువ సేపు బరువులు ఎత్తడం వల్ల అదనపు ప్రయోజనాలేవీ ఉండవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
మహిళలకు ఇదొక సంజీవని..!
ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బరువులు ఎత్తే వ్యాయామాలు కేవలం పురుషులకే కాదు, మహిళల ఆరోగ్యానికి సైతం ఎంతో అవసరం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ మహిళల్లో వచ్చే కీళ్ల నొప్పులు, నీరసం, జీవక్రియలు (Metabolism) మందగించడం, బరువు పెరగడం వంటి సమస్యలను అదుపు చేయడానికి స్ట్రెంత్ ట్రెయినింగ్ అద్భుతంగా పని చేస్తుంది.
ఎముకల దృఢత్వం.. స్త్రీలలో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే ఎముకల బలహీనతను నివారించి, ఎముకలను పటిష్ఠం చేస్తుంది. చక్కెర స్థాయిల నియంత్రణ..రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడం ద్వారా టైప్-2 డయాబెటిస్ ముప్పును తగ్గిస్తుంది.మానసిక ఉల్లాసం.. మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని,ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.
వృద్ధాప్యంలోనూ ఎవరిపైనా ఆధారపడకుండా, స్వతంత్రంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆశించే ప్రతి ఒక్కరికీ శక్తి ఆధారిత శారీరక శ్రమ (Strength Training) ఒక శక్తివంతమైన సాధనం. అయితే, వీటిని ప్రారంభించే ముందు నిపుణులైన శిక్షకుల (Fitness Trainers) పర్యవేక్షణలో, వయసు, శారీరక సామర్థ్యాన్ని బట్టి సరైన పద్ధతిలో నేర్చుకోవడం ఎంతో శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
