The Plastic Threat to Your Health : ఆరోగ్యాన్ని హరిస్తున్న 'ప్లాస్టిక్' భూతం: మన శరీరంలోకి ఎలా చేరుతోంది..? నివారణ ఎలా..?
సాక్షి లైఫ్ : మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం... ఇవేవి ఇప్పుడు పూర్తి సురక్షితం కాదని మీకు తెలుసా? కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ( microplastics) మన దేహంలోకి చాపకింద నీరులా ప్రవేశిస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం పర్యావరణానికే కాదు, మన ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పుగా పరిణమించిందని వైద్య నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి ఎలా వెళ్తున్నాయి..? వాటి వల్ల వచ్చే రోగాలేంటి..? ఈ ముప్పు నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
శరీరమంతా ప్లాస్టిక్ మయమే..!
ప్లాస్టిక్ ఎప్పటికీ నశించదు. కాలక్రమంలో అది చిన్నచిన్న కణాలుగా విడిపోయి మట్టి, నీరు, గాలిలో కలిసిపోయి చివరకు మన ఆహారపు గొలుసులో భాగమవుతుంది. ఇవి ఎంత ప్రమాదకర స్థాయికి చేరాయంటే.. మనిషి రక్తం, ఊపిరితిత్తులు, మెదడు కణజాలం, గర్భిణుల మాయ (placenta), చివరకు తల్లిపాలలో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి..?
ప్రధానంగా మూడు మార్గాల ద్వారా ఈ సూక్ష్మ కణాలు దేహంలోకి వెళ్తున్నాయి.
ఆహారం ,నీరు..ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, సముద్రపు ఆహారం (seafood), ప్యాక్ చేసిన స్నాక్స్, చివరకు మనం రోజూ వాడే ఉప్పు ద్వారా కూడా ఇవి కడుపులోకి వెళ్తున్నాయి.
శ్వాస ద్వారా..గాలిలో కలిసిపోయిన అత్యంత సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు (nanoplastics) మనం శ్వాస పీల్చుకున్నప్పుడు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి.
పొంచి ఉన్న ఆరోగ్య ముప్పులు..
సాధారణ స్థాయి ప్లాస్టిక్ వల్ల ఏ నిర్దిష్ట వ్యాధి వస్తుందో శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా నిర్ధారించకపోయినా, దేహంలో వాటి ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుందని కనుగొన్నారు.
గుండెకు చేటు..
ఇటీవల గుండెపోటుకు గురైన చాలా మంది రోగుల రక్తంలో మైక్రో, నానో ప్లాస్టిక్ కణాలు అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇవి గుండె ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతున్నాయి.
కణాల నాశనం..
మొహాలీకి చెందిన 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ' శాస్త్రవేత్తల ప్రకారం... సింగిల్ యూజ్ పెట్ (PET) బాటిళ్ల నుంచి విడుదలయ్యే నానో ప్లాస్టిక్స్ దేహంలోని ముఖ్యమైన వ్యవస్థలను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా పేగుల్లోని మేలు చేసే బ్యాక్టీరియాను, రక్త కణాలను నాశనం చేస్తాయి.
ఇతర సమస్యలు..
శరీరంలో వాపు (inflammation), ఆక్సీకరణ ఒత్తిడి (oxidative stress), హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి తలెత్తుతాయి.
ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి..?
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ల సూచనల ప్రకారం, మన దైనందిన జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ మైక్రోప్లాస్టిక్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు.
టిన్ ఫుడ్స్,క్యాన్డ్ ఫుడ్స్‌కు దూరం..
డబ్బాల్లో నిల్వ ఉంచే ఆహార పదార్థాలు, పానీయాలను పూర్తిగా మానుకోవాలి. డబ్బా లోపలి పొరల నుంచి 'బిస్ఫెనాల్-ఏ' (BPA) లాంటి ప్రమాదకర ప్లాస్టిక్ రసాయనాలు నేరుగా ఆహారంలో కలుస్తాయి.
ప్రాసెస్డ్ ఫుడ్ వద్దు..
ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి వచ్చే చిప్స్, స్నాక్స్, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి జీర్ణవ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా, ప్యాకేజింగ్ లోని రసాయనాలను శరీరంలోకి పంపుతాయి.
ప్యాకేజింగ్ వెంటనే తొలగించండి..
కూరగాయలు, పండ్లు, ఇతర తాజా పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో తెచ్చినప్పటికీ, ఇంటికి రాగానే వాటిని కవర్లలో నుంచి తీసి వేరే పాత్రల్లో భద్రపరుచుకోవాలి. ప్లాస్టిక్ కవర్లలో అలాగే ఉంచడం వల్ల వాటిపైకి సూక్ష్మ కణాలు చేరే అవకాశం ఉంటుంది. పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని, ముఖ్యంగా 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్' వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడమే ఉత్తమ మార్గం.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
