భారతీయ మహిళల్లో 90 శాతం మందికి విటమిన్ -డీ లోపాలు..!
సాక్షి లైఫ్ : ‘‘అబ్బా.. ఒళ్లంతా ఒకటే నొప్పులు’’.. ఏదో ఒక సందర్భంలో మనలో చాలామంది ఈ వాక్యాన్ని వాడే ఉంటారు. పురుషుల మాట ఎలా ఉన్నా.. మహిళల నోటి నుంచి ఈ మాట వస్తే మాత్రం కొంచెం జాగ్రత్త పడాలండోయ్! ఎందుకంటారా? దేశంలోని దాదపు 90 శాతం మంది మహిళలు విటమిన్-డీ లోపంతో బాధపడుతున్నారు మరి.
ఈ లోపం ఉంటే..
ఈ లోపమున్నప్పుడు కనిపించే లక్షణాల్లో ఒంటి నొప్పులు కూడా ఒకటి. అందుకే ఆ క్షణానికి ఒంటినొప్పులు తగ్గించే మందులు లేదా లేపనాలేవో వాడేసి మరచిపోరాదని.. విటమిన్-డీ లోపాలను గుర్తించి సరి చేసుకోవడం అవసరమనీ వైద్య నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు...
మహిళల్లో విటమిన్-డీ లోపాలపై అవగాహన చాలా తక్కువ. తాత్కాలిక ఉపశమనాలపై ఆధారపడటం ఎక్కువ.
ఇది కూడా చదవండి.. కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?
నగర ప్రాంతాల్లో..
ఈ విషయం తాజాగా జరిగిన ఒక అధ్యయనంలోనూ స్పష్టమైంది. నగర ప్రాంతాల్లోని దాదాపు 52,754 మంది మహిళల నుంచి వివరాలు సేకరించగా 80 శాతం మంది విటమిన్-డీ లోపాలతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. రక్తంలో కనీసం ప్రతి మిల్లీలీటర్‌కు 30 నానోగ్రాముల స్థాయిలో విటమిన్ -డీ అవసరం. ఇంతకంటే తక్కువైతే ఒంటి నొప్పులు మరీ ముఖ్యంగా ఎముకల నొప్పులు వస్తాయి. పైగా ఎముకలు పెళుసుబారతాయి.
అధ్యయనం ప్రకారం..
ఫలితంగా సులువుగా విరిగిపోతాయన్నమాట. విటమిన్-డీ లోపాలున్నా.. వాటివల్ల ఒంటి నొప్పులు వస్తున్నా సరే.. భారతీయ మహిళల్లో అధికులు మూలకారణం ఏమిటన్న దానిపై ఆలోచన చేయరని, గత ఏడాది అపోలో డయాగ్నాస్టిక్స్, హార్లిక్స్ విమెన్స్ ప్లస్ నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. 2023లోనే జరిగిన ఇంకో అధ్యయనం ప్రకారం ఒంటినొప్పులతో బాధపడే మహిళల్లో 87 శాతం మంది తాత్కాలిక ఉపశమన మార్గాలతోనే సరిపెట్టుకుంటున్నారు.
భారతీయ మహిళలు..
‘‘ప్రతి రోజూ కనీసం ఇరవై నిమిషాలపాటు ఎండలో నిలబడితే చాలు. విటమిన్-డీ లోపం ఏర్పడదు. కానీ భారతీయ మహిళలు చాలామంది ఇంత సమయం కూడా ఎండలో ఉండటం లేదు. ఫలితంగా వచ్చే ఒంటి నొప్పులను నొప్పి నివారణ ముందులు వాడి తట్టుకుంటున్నారు.’’ అని అపోలో క్లినిక్ కన్సల్టెంట్ ఆర్థోపెడీషియన్ డాక్టర్ సిద్దార్ట్ పొట్లూరి తెలిపారు.
ఎముకల దృఢత్వం కోసం..
ఎముకల దృఢత్వం కాపాడుకునేందుకు ఒంటి నొప్పులను నివారించుకు నేందుకు పోషకాలను తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. చేపలు, ఫిష్ లివర్ ఆయిల్, కొన్ని రకాల పుట్టగొడుగులు, కోడి గుడ్లలో కొంత మోతాదు మేరకు విటమిన్-డీ ఉంటుందని వివరించారు. ఆహారం ద్వారా లేదా పోషకాల సాయంతో లోపాలను భర్తీ చేసుకోవడంతో పాటు తరచూ ఎండలో గడపడం, వ్యాయామం చేయడం కూడా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమని తెలిపారు.
ఇది కూడా చదవండి.. గ్లకోమాను ఎలా నివారించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
