ఫిష్ పెడిక్యూర్ గురించి తెలుసా..?
సాక్షి లైఫ్ : అందాన్ని పెంచుకోవడానికి బ్యూటీ ఇండస్ట్రీలో అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి పెడిక్యూర్. ముఖ్యంగా మహిళలు స్పా లేదా సెలూన్‌కి వెళ్లి వివిధ రకాల పెడిక్యూర్‌లు చేయించుకుంటారు. అటువంటి వాటిలో ఫిష్ పెడిక్యూర్ కూడా ఒకటి. ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఈ విధానంలో పాదాలపై ఉన్న డెడ్ స్కిన్‌ని చేపలు తింటాయి. ఇది సరియైనది కాదని ఇప్పటికే చాలా దేశాల్లో దీనిని నిషేధించారు. కానీ భారతదేశంలో అనేక చిన్న,పెద్ద నగరాల్లో ఫిష్ పెడిక్యూర్ అందుబాటులో ఉంది. అసలు ఫిష్ పెడిక్యూర్ ఎంత సురక్షితమైనది..? దీనివల్ల ఆరోగ్యానికి లాభమా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
చికిత్స ఎలా చేస్తారు..?
చర్మం మృదువుగా ఉండాలంటే మృతకణాలు లేకుండా ఉండాలి. అందుకోసం చర్మంపై ఉండే డెడ్ స్కిన్ ను తొలగించాలి. స్క్రబ్స్,బ్లీచ్‌లు వంటి వాటితో ముఖంపై ఉండే డెడ్ స్కిన్‌ను తొలగిస్తారు.
ఐతే పాదాలపై ఉండే డెడ్ స్కిన్ ను తొలగించడానికి పాదాలకు చిన్న చేపలతో చేసే చికిత్సను "ఫిష్ పెడిక్యూర్" అంటారు. మహిళలు అందమైన, మృదువైన పాదాల కోసం ఫిష్ పెడిక్యూర్‌పై ఆధార పడుతున్నారు. దీంతో ఈ ఫిష్ పెడిక్యూర్ కి క్రేజ్ మరింతగా పెరిగింది. పాదాలకు చేసే చికిత్స ఖరీదు కాస్త తక్కువగా ఉండడంతో చాలా మంది మహిళలు దీనిని చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మృతకణాలు పోయి..
ఫిష్ పెడిక్యూర్ లో భాగంగా కొంత సమయం పాటు నీటితో నిండిన టబ్‌లో చిన్న చేపలను వేసి పాదాలను అందులో ఉంచుతారు. అప్పుడు నీటిలో ఉండే చిన్న గర్రా రుఫా చేపలు పాదాలపై ఉన్న డెడ్ స్కిన్‌ను తింటాయి. దీని వల్ల పాదాలపై ఉన్న మృతకణాలు పోయి చర్మం మృదువుగా మారుతుంది. అయితే ఈ ప్రక్రియలో చేపలు మృతకణాలతోపాటు మంచిగా ఉన్న చర్మాన్ని కూడా తినే అవకాశం ఉంటుంది.
పలు అనారోగ్య సమస్యలు..
ఫిష్ పెడిక్యూర్ వల్ల కొన్ని సందర్భాల్లో పాదాలపై గాయాలు కూడా అయ్యే ప్రమాదం ఉంది. ఈ గాయాల కారణంగా కొంతమందిలో పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తడమేకాకుండా క్యాన్సర్ వంటి వ్యాధుల బారీన పడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించడంతో పలు దేశాలు సైతం అక్కడ ఫిష్ పెడిక్యూర్ ను నిషేధించాయి. ఈ చికిత్స మొదట టర్కీలో ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
ఇది కూడా చదవండి.. మూర్ఛ లక్షణాలు..? ప్రధాన కారణాలు..?
గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
