గుండెపై థైరాయిడ్ ప్రభావం..?  

షేర్ చేయండి:
గుండెపై థైరాయిడ్ ప్రభావం..?  

సాక్షి లైఫ్: పిట్ట కొంచెం.. కూతఘనం అన్న సామెత మీరూ వినే ఉంటారు. శరీరం విషయానికి వస్తే మన గొంతు ప్రాంతంలో ఉండే థైరాయిడ్‌ కూడా పిట్ట వంటిదే. చేసే పనులు మాత్రం బోలెడన్ని! జీవక్రియలతోపాటు గుండె కొట్టుకునే వేగం, శరీర ఉష్ణోగ్రతలను కూడా నియంత్రించే అద్భుతమైన శక్తి ఈ చిన్న గ్రంధి సొంతం. అయితే శరీర అవసరాలకు తగినంత హార్మోన్‌ను ఉత్పత్తి చేసినా, చేయకున్నా కూడా మనకు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. 

ఈ అంశాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే లక్ష్యంతో ‘ద అమెరికన్‌ థైరాయిడ్‌ అసోసియేషన్‌’ ఏటా జనవరి నెలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. థైరాయిడ్‌ గ్రంధి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం, హైపో (హార్మోన్ల ఉత్పత్తి తగ్గితే), హైపర్‌ (హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువగా జరిగితే) థైరాయిడిజమ్‌ల వల్ల వచ్చే సమస్యలు.. వాటి లక్షణాలు, పరిష్కారాలేమిటో చూసేద్దాం!

థైరాయిడ్ అనేది మన గొంతు ప్రాంతంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. శరీరానికి చాలా అవసరమైన థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందుగా చెప్పుకున్నట్లు ఈ గ్రంధి ఉత్పత్తి చేసే హార్మోన్‌ తక్కువైనా, ఎక్కువైనా కూడా ప్రమాదమే. థైరాయిడ్‌ హార్మోన్‌ గుండె శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే శక్తి, వేగాలను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు.. రక్తపోటు, రక్తంలోని కొలెస్ట్రాల్‌ మోతాదులపై కూడా ఈ హార్మోన్‌ ప్రభావం ఉంటుంది. ఫలితంగా థైరాయిడ్‌ గ్రంధి సక్రమంగా పనిచేయకపోతే గుండె జబ్బులను పోలిన లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. గుండెజబ్బు ఉన్న వారి ఆరోగ్య స్థితి మరింత దిగజారుతుంది. 

గుండెపై భారం.. 

హార్వర్డ్‌ యూనివర్శిటీ ‍ప్రచురించిన ఒక కథనం ప్రకారం..  హైపోథైరాయిడిజమ్‌ వల్ల గుండె రక్తాన్ని సరఫరా చేసే శక్తి తగ్గడమే కాకుండా.. కొలెస్ట్రాల్‌, రక్తపోటులను పెంచుతుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడం, రక్తనాళాల సాగే లక్షణం తగ్గుతుంది. ఫలితంగా శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండెపై భారం ఎక్కువ పడి రక్తపోటు పెరుగుతుంది.కొలెస్ట్రాల్‌ ఎక్కువ కావడం వల్ల రక్తనాళాలు సన్నబడిపోతాయి. హైపర్‌ థైరాయిడిజమ్‌ ఉంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. తద్వారా గుండె పనిచేయకుండా ఆగిపోయే ‍ప్రమాదం ఎక్కువ అవుతుంది. రక్త నాళాల గోడలపై గార లాంటి పదార్థం పేరుకుపోయే సమస్యను పెంచుతుంది, ఈ గార లాంటి పదార్థం రక్తనాళాలలో గడ్డ కట్టడం వల్ల రక్త ప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది.

హైపోథైరాయిడిజం లక్షణాలు.. 


బరువు పెరుగుతోంది
ఆయాసం. 
చల్లగా అనిపిస్తుంది
జ్ఞాపకశక్తి తగ్గుతుంది
హార్ట్ రేట్ తగ్గుతుంది
కండరాల నొప్పి
కండరాలు బలహీన పడతాయి

హైపర్ థైరాయిడిజం లక్షణాలు.. 

బరువు తగ్గడం
ఆకలి ఎక్కువగా అనిపించడం
హార్ట్ అరిథ్మియా (గుండె కొట్టుకునే వేగంలో మార్పులు)
అధికంగా చెమట పట్టడం
క్రమరహిత రుతుస్రావం
కండరాల బలహీనత
నిద్ర లేమి 

థైరాయిడ్‌ సమస్యను ఇలా తెలుసుకోండి...

1. గ్లాసెడు నీళ్లు... చేత్లో పట్టుకోగల ఒక అద్దం దగ్గరుంచుకోండి.
2. గొంతు కింది భాగంపై దృష్టి పెట్టండి. స్వరపేటికకు దిగువన, మన కాలర్‌బోన్‌కు పై భాగం అన్నమాట.
3. థైరాయిడ్‌ గ్రంధి ఉండే భాగం ఇదే.
4. తల కొంచెం వెనక్కు వాల్చి గ్లాసులోని నీళ్లు గుటక వేయండి.
5. గుటక పడే సమయంలో థైరాయిడ్‌ గ్రంధి ఉన్న ప్రాంతాన్ని అద్దంలో గమనించండి.
6. బయటకు పొడచుకువచ్చినట్లు, వాపులాంటివి ఏవైనా కనిపిస్తే వైద్యులను సంప్రదించండి.
7. థైరాయిడ్‌ గ్రంధి వాపు సమస్య మీకు ఉండే అవకాశం ఉంది. వైద్యులు మరిన్ని పరీక్షలు చేసి ధ్రువీకరిస్తారు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.