New COVID Variant ‘Cicada’ : కోవిడ్ కొత్త వేరియంట్ 'సికాడా' కలకలం..22 దేశాల్లో వ్యాప్తి..
సాక్షి లైఫ్ : గతంలో ప్రపంచవ్యాప్తంగా వణికించిన మహమ్మారి కరోనా మరోసారి విజృంభిస్తోంది. తాజాగా 'సికాడా' (BA.3.2) అనే కొత్త కోవిడ్ వేరియంట్ వెలుగుచూడటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అమెరికాతో పాటు సుమారు 22 దేశాల్లో ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ న్యూ వేరియంట్ స్వభావం, లక్షణాలపై ప్రత్యేక కథనం మీకోసం..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఏమిటీ 'సికాడా' వేరియంట్..?
BA.3.2 గా పిలిచే ఈ వైరస్, ఒమిక్రాన్ కుటుంబానికి చెందినది. 2022లో దాదాపు కనుమరుగైపోయిన ఈ పాత జాతి, ఇప్పుడు మళ్ళీ రూపాంతరం చెంది పుట్టుకొచ్చింది. ఏళ్ల తరబడి భూగర్భంలో ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చే 'సికాడా' అనే కీటకం పేరును దీనికి సంకేతంగా పెట్టారు. తొలుత 2024 చివరలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్, ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల్లో విస్తరిస్తోంది.
ఎందుకు అప్రమత్తంగా ఉండాలి..?
సాధారణ కోవిడ్ వేరియంట్ల కంటే ఇది భిన్నంగా ఉండటమే శాస్త్రవేత్తల ఆందోళనకు ప్రధాన కారణం. దీని స్పైక్ ప్రోటీన్‌లో దాదాపు 70కి పైగా మార్పులు (Mutations) సంభవించాయి. గతంలో వచ్చిన వ్యాక్సిన్లు లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా మన శరీరంలో ఏర్పడిన యాంటీబాడీలను ఇది సులభంగా తప్పించుకునే అవకాశం ఉంది. పాత ఒమిక్రాన్ రకాలతో పోలిస్తే ఇది అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నట్లు ప్రాథమిక అంచనా.
గమనించాల్సిన ప్రధాన లక్షణాలు..
ప్రస్తుతం ఈ వేరియంట్ సోకిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్వరంతోపాటు చలి.. శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరగడం, కండరాల నొప్పులు, తీవ్రమైన అలసట. నిరంతరాయంగా దగ్గు రావడం, ముక్కు కారడం. వికారం, వాంతులు లేదా విరేచనాలు కూడా ఉండవచ్చు.
పాత వేరియంట్ల కంటే..
ఈ వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రస్తుతం 'పర్యవేక్షణలో ఉన్న వేరియంట్' Variants Under Monitoring (VUM) జాబితాలో చేర్చింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, పాత వేరియంట్ల కంటే ఎక్కువ ప్రాణాంతకమని చెప్పడానికి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో నమోదైన ప్రాథమిక బాధితులందరూ కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ద్వారా ఈ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
