New ‘National School Mental Health Policy’ : పాఠశాలల్లో ఇక ‘మానసిక ఆరోగ్యం’పై ప్రత్యేక శ్రద్ధ..! జూన్ 1 నుంచి నూతన 'నేషనల్ స్కూల్ మెంటల్ హెల్త్ పాలసీ'..
సాక్షి లైఫ్ : విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వారి శ్రేయస్సు కోసం దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు రాబోతున్నాయి. జూన్ 1 నుంచి నూతన 'జాతీయ పాఠశాల మానసిక ఆరోగ్య విధానం' (National School Mental Health Policy) అమల్లోకి రానుంది. కేంద్ర విద్యాశాఖ తీసుకురానున్న ఈ విధానం ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు చట్టబద్ధమైన నిబంధనలను అమలు చేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా రూపొందించిన ఈ పాలసీ పాఠశాలల పనితీరులో కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇప్పటివరకు చాలా పాఠశాలల్లో ఏదైనా ఘోరం లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆత్మహత్యాయత్నం వంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే యాజమాన్యాలు స్పందించే పరిస్థితి ఉండేది. కానీ ఇకపై అలా కుదరదు. శారీరక ఆరోగ్యంలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా రోజువారీగా గమనించాల్సిన అంశంగా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యతగా పాఠశాలలు గుర్తించాల్సి ఉంటుంది. కేవలం సలహాలు ఇవ్వడానికే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన నిబంధనలను అమలు చేయనున్నారు.
కొత్త పాలసీలోని ముఖ్యాంశాలు..
హైస్కూల్ తరగతుల్లో ప్రతి 500 మంది విద్యార్థులకు కనీసం ఒక కౌన్సెలర్ 1:500 నిష్పత్తి ప్రకారం ఉండటం ఇకపై తప్పనిసరి. విద్యార్థుల కెరీర్ గైడెన్స్ అంటే ఉపాధి మార్గాలు, కోర్సుల ఎంపిక కోసం ఇచ్చే అకడమిక్ కౌన్సెలింగ్, అలాగే వారి వ్యక్తిగత ఒత్తిళ్లు, ఆందోళనలను తగ్గించే సోషియో ఎమోషనల్ కౌన్సెలింగ్ బాధ్యతలను వేర్వేరు నిపుణులకు అప్పగించాలి.
సిబ్బందికి శిక్షణ..
పాఠశాలలోని టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి ఏడాదికి కనీసం రెండుసార్లు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని 'సైకలాజికల్ ఫస్ట్ రెస్పాండర్స్' (తొలి స్పందనదారులు)గా సర్టిఫై చేయాలి.
మార్కులకే కాదు..
ప్రగతికే ప్రాధాన్యం: ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల సమావేశాల్లో (PTM) కేవలం మార్కుల గురించే కాకుండా, విద్యార్థి యొక్క సమగ్ర వికాసంపై చర్చించాలి. పిల్లల్లో కనిపించే అకాల ఒత్తిడి, ప్రవర్తనలో మార్పులు, ఒంటరిగా ఉండటం వంటి లక్షణాలను ముందస్తుగా గుర్తించి వారికి 'టెలి-మానస్' (Tele-MANAS) వంటి ప్రభుత్వ హెల్ప్‌లైన్ల ద్వారా సహాయం అందించాలి.
హబ్ అండ్ స్పోక్ మోడల్..
ప్రభుత్వ పాఠశాలల్లో తగినంత మంది స్వతంత్ర కౌన్సెలర్లను నియమించడం సవాలుతో కూడుకున్నది కాబట్టి, ఈ పాలసీలో 'హబ్ అండ్ స్పోక్' (Hub and Spoke) విధానాన్ని తీసుకువస్తున్నారు. దీని ప్రకారం వనరులు ఎక్కువగా ఉన్న పెద్ద ప్రభుత్వ పాఠశాలలు 'వెల్‌నెస్ హబ్'లుగా పనిచేస్తాయి. ఇక్కడి సర్టిఫైడ్ కౌన్సెలర్లు సమీపంలోని గ్రామీణ లేదా సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఉండే చిన్న పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమైన మానసిక ఆరోగ్య కిట్‌లను అందిస్తూ తోడ్పాటునందిస్తారు.
సైబర్ వేధింపులకు అడ్డుకట్ట..
ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ బుల్లీయింగ్, ఆన్‌లైన్ వేధింపులపై ఈ విధానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విద్యార్థులు తమకు ఎదురవుతున్న సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా పాఠశాలల్లో రహస్య ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు చేసిన విద్యార్థుల వివరాలను బయటపెట్టకుండా, వారికి తోటి విద్యార్థుల నుంచి లేదా విద్యాపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా రక్షణ కల్పించాల్సిన పూర్తి బాధ్యత పాఠశాల యాజమాన్యాలదేనని ఈ నూతన పాలసీ స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
