New Rules : నకిలీ మందుల ఆటకు చెక్.. ఔషధ సరఫరాపై కేంద్రం పక్కా నిఘా..!
సాక్షి లైఫ్ : దేశంలో నకిలీ, నాసిరకం మందుల విక్రయాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఔషధ పంపిణీ వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇకపై మందులను తయారు చేయడంతోనే ఫార్మా కంపెనీల బాధ్యత తీరిపోదు. ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి గోదాముల్లో నిల్వ చేయడం, రవాణా, చివరకు రోగి చేతికి అందే వరకు ప్రతి దశలోనూ వాటి నాణ్యతపై పక్కా పర్యవేక్షణ ఉండనుంది. ఇందుకోసం ‘గుడ్ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాక్టీసెస్’ (GSDP) నిబంధనలను ‘డ్రగ్స్ రూల్స్, 1945’లో చేర్చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ప్రతి దశకూ పక్కా రికార్డులు తప్పనిసరి..!
ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం.. మందుల కొనుగోలు, నిల్వ, రవాణా, పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను రికార్డుల రూపంలో భద్రపరచాల్సి ఉంటుంది. ఔషధాలను వాటి స్వభావానికి తగిన ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితుల్లోనే నిల్వ చేసి, రవాణా చేయాలి.
నిల్వ, రవాణా సమయాల్లో మందులు పాడైపోవడం, కల్తీ జరగడం, ఇన్ఫెక్షన్లకు గురికావడం, అసలు మందుల స్థానంలో నకిలీవి మార్చడం వంటి అక్రమాలను అరికట్టేందుకు ఈ నిబంధనలు దోహదపడతాయి.
లోపం జరిగితే మూలం పట్టేయొచ్చు..!
ఈ కొత్త విధానం వల్ల ఔషధాల కదలికలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మార్కెట్లో ఏదైనా బ్యాచ్ మందుల్లో నాణ్యతా లోపం బయటపడితే, ఆ మొత్తం సప్లై చైన్ ను సులభంగా గుర్తించవచ్చు. ఆ మందు ఏ కంపెనీ లేదా దిగుమతిదారు నుంచి వచ్చింది, ఏ పంపిణీదారు, స్టాకిస్ట్ ద్వారా ఎక్కడికి చేరింది అనే వివరాలన్నీ క్షణాల్లో తేలిపోతాయి.
తనిఖీలకు మరింత బలం..
కేవలం తయారీ సమయంలో పరీక్షలు నిర్వహించినంత మాత్రాన మందుల నాణ్యతకు భరోసా లభించదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. తయారీ తర్వాత నిల్వ, రవాణాలో నిర్లక్ష్యం వహించినా ఔషధాల సామర్థ్యం, ప్రభావం దెబ్బతింటాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే.. కేంద్ర, రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగాల అధికారులు పంపిణీ వ్యవస్థను క్షుణ్నంగా తనిఖీ చేయడానికి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి బలమైన చట్టపరమైన ఆధారం లభిస్తుంది. ఫలితంగా సామాన్యులకు సురక్షితమైన, నాణ్యమైన మందులు అందే అవకాశం మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
