Dangerous Virus : ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైంది నిఫా వైరస్.. ఎందుకంటే..?

షేర్ చేయండి:
Dangerous Virus : ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైంది నిఫా వైరస్.. ఎందుకంటే..?

సాక్షి లైఫ్ : నిఫా వైరస్ మన శరీర రక్షణ వ్యవస్థ అయిన రోగనిరోధక శక్తిని మనకు శత్రువుగా మార్చే 'మాయదారి' మహమ్మారిగా మారుతోందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. వైరస్‌లలో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే 'నిఫా' (Nipah), మనిషి ప్రాణాలను తీయడమే కాకుండా, శరీరంలోని సహజ రోగనిరోధక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా ఏదైనా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక శక్తి దానిపై పోరాడుతుంది. కానీ నిఫా వైరస్ విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంటోంది. ఇది శరీర రక్షణ కవచాన్ని అడ్డుకోవడమే కాకుండా, ఆ వ్యవస్థనే శరీరంపై దాడి చేసేలా ప్రేరేపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే.. 

శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే మన కణాలు 'ఇంటర్ఫెరాన్' అనే ప్రోటీన్ల ద్వారా హెచ్చరికలు పంపుతాయి. నిఫా వైరస్ అత్యంత తెలివిగా ఈ హెచ్చరిక వ్యవస్థను మొద్దుబారుస్తుంది. ఫలితంగా, మన రోగనిరోధక వ్యవస్థ మేల్కొనేలోపే వైరస్ శరీరమంతా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తనాళాల లోపలి పొరలపై (Endothelial cells) ఈ వైరస్ దాడి చేయడం వల్ల శరీరమంతా తీవ్రమైన వాపు (Inflammation) వస్తుంది.

 ప్రాణాలకే ముప్పు..

నిఫా వైరస్‌ను ఎదుర్కోవడంలో మన రోగనిరోధక వ్యవస్థ విఫలమవ్వడమే కాకుండా, అది అదుపులేకుండా స్పందిస్తుంది. దీనివల్ల శరీరంలో 'సైటోకైన్ తుఫాను' (Cytokine Storm) లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వైరస్‌ను చంపే కంటే ఆరోగ్యకరమైన కణజాలాన్ని, ఊపిరితిత్తులను, మెదడును ఎక్కువగా దెబ్బతీస్తుంది.

రక్తనాళాల వాపు వల్ల ఇతర అవయవాలకు వైరస్ సులభంగా చేరుతుంది. రోగనిరోధక కణాలు అతిగా శ్రమించి, చివరికి పని చేయడం మానేస్తాయి (Immune Exhaustion). నిఫా వైరస్ 'బ్లడ్-బ్రెయిన్ బారియర్'ను దాటి మెదడులోకి ప్రవేశించి ప్రాణాంతకమైన 'ఎన్సెఫాలిటిస్' అంటే మెదడు వాపు వ్యాధికి దారితీస్తుంది.

యాంటీబాడీలు..

సాధారణంగా ఒక వైరస్‌పై పోరాడటానికి శరీరం యాంటీబాడీలను తయారు చేస్తుంది. కానీ నిఫా విషయంలో ఈ యాంటీబాడీలు తయారయ్యే సమయానికే వైరస్ మెదడు, ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందుకే ఈ వ్యాధి సోకిన వారిలో మరణాల రేటు 40 నుంచి 75 శాతం వరకు ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి నిఫా వైరస్‌కు కచ్చితమైన టీకా లేదా మందులు అందుబాటులో లేవు. కాబట్టి మనమే అప్రమతంగా ఉండాలి.. ఈ వైరస్ సోకినప్పుడు  లక్షణాలు ఎలా ఉంటాయంటే..? తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ముందుగా గుర్తించడం, బాధితులను ఐసోలేషన్‌లో ఉంచడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారానే ఈ మహమ్మారి నుంచి బయట పడడానికి అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.