India Intensifies Ebola Surveillance : భారత్‌లో ఎబోలాపై ప్రత్యేక నిఘా.. ఆఫ్రికా దేశాలకు అండగా ఇండియా..!

షేర్ చేయండి:
India Intensifies Ebola Surveillance : భారత్‌లో ఎబోలాపై ప్రత్యేక నిఘా.. ఆఫ్రికా దేశాలకు అండగా ఇండియా..!

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో భారతదేశం అప్రమత్తమైంది. బెంగళూరు, గుజరాత్‌లలో రెండు అనుమానిత కేసులు వెలుగుచూడటంతో కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖలు నిఘాను ముమ్మరం చేశాయి. మరోవైపు, ఈ క్లిష్ట సమయంలో ఎబోలా ప్రభావిత ఆఫ్రికా దేశాలకు వైద్య సహాయం అందించి, భారత్ అంతర్జాతీయంగా మరోసారి ప్రశంసలు అందుకుంటోంది.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలోని కాంగో, ఉగాండా దేశాలలో ఎబోలా తీవ్రత పెరుగుతోంది. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC) గణాంకాల ప్రకారం.. ఈ రెండు దేశాల్లో ఇప్పటివరకు 1,198 కేసులు (128 నిర్ధారిత, 1,077 అనుమానిత) నమోదు కాగా, సుమారు 228 మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. కాగా, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉగాండా దేశం కాంగోతో ఉన్న తన సరిహద్దులను తాత్కాలికంగా మూసివేసింది.

అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 'హై అలర్ట్'..

అంతర్జాతీయ ప్రయాణాల నేపథ్యంలో భారత్‌కు ఈ వైరస్ వ్యాపించకుండా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్, ప్రయాణికుల పర్యవేక్షణ, క్వారంటైన్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులలో స్వల్ప తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నా సరే.. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఐసోలేషన్‌కు తరలిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

భారత్‌లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి..?

దేశంలో ఇప్పటివరకు ఎబోలా సంక్రమణకు సంబంధించి ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ఇటీవల వెలుగుచూసిన రెండు అనుమానిత కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. 

బెంగళూరు కేసు విషయంలో.. 

ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళకు ఎబోలా లక్షణాలు ఉండటంతో బెంగళూరులో ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే, ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో నెగటివ్ గా నిర్ధారణ కావడంతో ఊరట లభించింది.

గుజరాత్ కేసు విషయంలో..  

ఆఫ్రికా, బంగ్లాదేశ్ మీదుగా ముంబై చేరుకున్న 37 ఏళ్ల వ్యక్తిలో వైరస్ లక్షణాలు కనిపించడంతో గుజరాత్‌లో ఐసోలేట్ చేశారు. ఇతని రక్త నమూనాలను పుణెలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ' (NIV)కి తరలించారు. ఈ ఫలితాలు రావలసి ఉంది.

చరిత్రలో ఒకే ఒక్క కేసు.. అది కూడా క్వారంటైన్‌లోనే..!

భారత వైద్య చరిత్రలో ఇప్పటివరకు స్థానికంగా ఎబోలా వ్యాప్తి చెందలేదు. గతంలో 2014 పశ్చిమ ఆఫ్రికా సంక్షోభ సమయంలో.. లైబీరియా నుంచి తిరిగి వచ్చిన ఒక 26 ఏళ్ల భారత పౌరుడికి విమానాశ్రయ స్క్రీనింగ్‌లో పాజిటివ్‌గా తేలింది. అయితే, అధికారుల అప్రమత్తతతో అతడిని ఎయిర్‌పోర్టులోనే ఐసోలేట్ చేసి, విజయవంతంగా నయం చేశారు.

'ప్రపంచ ఫార్మసీ'గా భారత్ ఉదారత.. 

గతంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు, మందులు అందించి ఆదుకున్న భారత్.. ఇప్పుడు ఎబోలా సంక్షోభంలోనూ తన ఉదారతను చాటుకుంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు అత్యవసర మందులు, రోగ నిర్ధారణ పరికరాలు, ఇన్‌ఫెక్షన్ నియంత్రణ సామగ్రిని భారత్ సరఫరా చేసింది. ఈ సాయంపై 'ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' (ఆఫ్రికా CDC) భారతదేశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. భారత్ పంపిన సామగ్రి వల్ల అక్కడ సకాలంలో పరీక్షలు నిర్వహించి, వైరస్‌ను గుర్తించడం సులువవుతుందని పేర్కొంది.

రేసులోకి రష్యా టీకా..!

ప్రస్తుతం ఆఫ్రికాలో ఆందోళన కలిగిస్తున్న ఎబోలా 'బండిబుగ్యో స్ట్రెయిన్' (Bundibugyo strain) నివారణకు ఖచ్చితమైన మందులు లేవు. ఈ తరుణంలో రష్యా శాస్త్రవేత్తలు ఎబోలా కొత్త రకానికి వ్యతిరేకంగా సరికొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. గమలేయా పరిశోధనా సంస్థ రూపొందించిన ఈ వెక్టర్-ఆధారిత టీకా (GamEvac-Combi / GamEvac-Lyo), ప్రస్తుతం ఉన్న ఎబోలా రకాలపై 60 నుంచి 70 శాతం వరకు సమర్థవంతమైన రక్షణ కల్పిస్తుందని రష్యా వర్గాలు వెల్లడించాయి.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.