Super Fungus Scaring India : ఇండియాను వణికిస్తోన్న ‘సూపర్ ఫంగస్’.. చాపకింద నీరులా వ్యాపిస్తోన్న డిసీజ్..

షేర్ చేయండి:
Super Fungus Scaring India : ఇండియాను వణికిస్తోన్న ‘సూపర్ ఫంగస్’.. చాపకింద నీరులా వ్యాపిస్తోన్న డిసీజ్..

సాక్షి లైఫ్ : భారతదేశంలో సాధారణంగా కనిపించే తామర అంటే "రింగ్‌వార్మ్ డిసీజ్" ఇప్పుడు రూపాంతరం చెంది తీవ్రమైన సవాలుగా మారుతోంది. గతంలో లాగా కాకుండా, అత్యంత ప్రమాదకరమైన ఒక కొత్త ఫంగస్ రకం దేశవ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తూ, సాధారణ యాంటీఫంగల్ మందులకు కూడా లొంగకుండా మొండిగా మారుతోన్న ఈ వ్యాధి తీవ్రతను, దాని నివారణోపాయాలను తాజా నివేదికల ఆధారంగా ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

సూపర్ ఫంగస్..?

వైద్య పరిభాషలో దీనిని ‘ట్రైకోఫైటాన్ ఇండోటినేయ్’ (Trichophyton indotineae) అని పిలుస్తున్నారు. 2020లో భారతదేశంలో వెలుగుచూసిన ఈ కొత్త రకం రింగ్‌వార్మ్ స్ట్రెయిన్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాలకు విస్తరించింది. సాధారణంగా తామర నివారణకు వాడే ప్రాథమిక మందులు, క్రీములను ఉదాహరణకు టెర్బినాఫిన్ ఇది సమర్థవంతంగా ఎదుర్కొని తట్టుకోగలదు. తీవ్రమైన యాంటీఫంగల్ రెసిస్టెన్స్ కలిగి ఉండటమే దీని ప్రత్యేకత. ఒక ఇంట్లో ఒకరికి వస్తే, అత్యంత వేగంగా కుటుంబ సభ్యులందరికీ వ్యాపిస్తూ ఇన్ఫెక్షన్ల చక్రాన్ని సృష్టిస్తోంది.

తీవ్రతకు ప్రధాన కారణాలు..

ఈ వ్యాధి ఇంతలా విజృంభించడానికి మన దైనందిన అలవాట్లలోని రెండు ప్రధాన లోపాలు కారణమవుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.

సబ్బులు, తువ్వాళ్ల షేరింగ్..


 భారతీయ కుటుంబాలలో ఒకరు వాడిన సబ్బులు, తువ్వాళ్లను మరొకరు వాడటం సర్వసాధారణం. ఒక అధ్యయనం ప్రకారం.. ఈ ఇన్ఫెక్షన్ సోకిన రోగులలో దాదాపు 50శాతం  మంది కుటుంబ సభ్యులు ఇప్పటికే దీని బారిన పడ్డారు. ఇరుకైన గృహ వాతావరణం, వస్తువులను పంచుకోవడం వల్ల ఈ ఫంగస్ సులభంగా ఇతరులకు వ్యాపిస్తోంది.

సుమారు 54శాతం మంది రోగులు నిరంతరం దడ్డుగా ఉండే డెనిమ్ జీన్స్ లేదా సింథటిక్ లెగ్గింగ్స్ ధరిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇవి తల చర్మం, శరీర మడతలలో చంకలు, తొడల సందులు చెమటను, తేమను బంధించి ఉంచుతాయి. తేమతో కూడిన వాతావరణంలో ఈ ఫంగస్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది. చర్మానికి గాలి సరిగా తగలనప్పుడు ఇన్ఫెక్షన్ తీవ్రత పెరుగుతుంది.

చాలా మంది చర్మంపై కాస్త దురద లేదా మచ్చ కనిపించగానే వైద్యుడిని సంప్రదించకుండా.. స్థానిక మెడికల్ షాపులకు వెళ్లి కెమిస్ట్ సూచించిన క్రీములను వాడుతుంటారు. ఇటువంటి ఓవర్-ది-కౌంటర్ (OTC) క్రీములలో స్టెరాయిడ్లు ఉంటాయి. ఇవి వాడిన వెంటనే దురదను తగ్గించి తాత్కాలికంగా నయం అయినట్లు భ్రమింపజేస్తాయి. ఇవి చర్మం సహజ రోగనిరోధక శక్తిని పూర్తిగా దెబ్బతీస్తాయి. దీనివల్ల ఫంగస్ మరింత బలంగా మారి, చర్మం లోపలి పొరల్లోకి చొచ్చుకుపోతుంది. ఫలితంగా శాశ్వత మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది.

ఇన్ఫెక్షన్ చక్రాన్ని ఎలా తెంచాలి..?

ఈ మొండి ఫంగస్ బారి నుంచి బయటపడటానికి వైద్య నిపుణులు ఐదు ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.

1. ప్రత్యేక లాండ్రీ..

ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి దుస్తులు, తువ్వాళ్లు, బెడ్‌షీట్లను ఇంట్లోని ఇతరుల బట్టలతో కలపకుండా విడిగా.. వేడి నీటిలో ఉతకాలి.

2. వస్తువులను పంచుకోవద్దు..

వ్యాధి తగ్గే వరకు సబ్బులు, టవల్స్, మంచం లేదా పరుపులను ఇతరులతో పంచుకోకూడదు.

3. వదులైన కాటన్ దుస్తులు..

 గాలి ఆడేలా ఉండే వదులైన కాటన్ దుస్తులను ధరించాలి. జీన్స్, లెగ్గింగ్స్, జిమ్ వేర్‌లను పూర్తిగా పక్కన పెట్టాలి.

4. పొడిగా ఉంచడం..

స్నానం చేసిన తర్వాత చర్మపు మడతలు అంటే చంకలు, వేళ్ల సందులు పూర్తిగా పొడిగా మారిన తర్వాతే దుస్తులు ధరించాలి.

5. కోర్సు పూర్తి చేయడం..

మచ్చలు తగ్గిపోయి చర్మం సాధారణ స్థితికి వచ్చినట్లు కనిపించినా.. వైద్యులు సూచించిన గడువు ముగిసే వరకు మందులను వాడటం ఆపకూడదు. సగం లోనే ఆపేస్తే.. మిగిలి ఉన్న బలమైన ఫంగస్ కణాలు మళ్లీ విజృంభిస్తాయి. ఈ సూపర్ ఫంగస్ కేవలం ఒక మంచి క్రీము రాస్తే తగ్గిపోయేది కాదు. దీనికి సమగ్రమైన పరిశుభ్రత అలవాట్లు, సరైన వైద్య పర్యవేక్షణ అవసరం. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో చర్మవ్యాధి సేవలు ఉచితంగా లభిస్తాయి కాబట్టి, సొంత వైద్యాలు మానుకుని అర్హత కలిగిన డెర్మటాలజిస్ట్ ను సంప్రదించడమే సురక్షితమైన మార్గం.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.