Ways to Manage Cortisol Naturally : ఎప్పుడూ ఒత్తిడితో సతమతమవుతున్నారా..? 'కార్టిసోల్'ను కట్టడి చేసే సులభమైన మార్గాలివే..!
సాక్షి లైఫ్ : ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి (Stress) అనేది పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి దినచర్యలో భాగమైపోయింది. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యకరమైన జీవనశైలి మన శరీరంతో పాటు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలాంటి మానసిక ఒత్తిడి సమయంలో మన శరీరం 'కార్టిసోల్' (Cortisol) అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనినే సాధారణంగా 'స్ట్రెస్ హార్మోన్' అని కూడా పిలుస్తారు. శరీరానికి కార్టిసోల్ అవసరమే అయినప్పటికీ.. అది ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉండటం ఎంతో ముఖ్యం.
దీర్ఘకాలికంగా ఒత్తిడితో బాధపడితే అది నిద్రలేమికి (insomnia)దారితీస్తుంది. మూడ్ స్వింగ్స్, శక్తి కోల్పోవడం, జీవక్రియలు (metabolism) మందగించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర చాలా అవసరం. శరీరంలో కార్టిసోల్ స్థాయిలను సహజంగా సమతుల్యంగా ఉంచుకోవడానికి ఈ జీవనశైలి మార్పులు ప్రయత్నించండి..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
1. దినచర్యలో 'అశ్వగంధ'..
ఆయుర్వేదంలో అశ్వగంధకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శతాబ్దాలుగా ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే మూలికగా దీనిని వాడుతున్నారు. అశ్వగంధ వాడకం వల్ల ఒత్తిడి, కార్టిసోల్ స్థాయిలు తగ్గుముఖం పడతాయని పలు పరిశోధనల్లో కూడా తేలింది. అయితే, దీనిని సప్లిమెంట్ (మాత్రలు/పొడి) రూపంలో తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆయుర్వేద నిపుణులు లేదా వైద్యుల సలహా తీసుకోవాలి.
2. మనసుకు సాంత్వననిచ్చే 'తులసి టీ'..
భారతీయ గృహాల్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. శరీరానికి, మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే అద్భుతమైన ఔషధమిది. మానసికంగా అలసిపోయినట్లు అనిపించినా, తీవ్రమైన ఒత్తిడి ఉన్నా.. ఒక కప్పు వేడివేడి తులసి టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో దీన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవచ్చు.
3. క్రమం తప్పకుండా ప్రాణాయామం..
ఒత్తిడి బాగా పెరిగిపోయినప్పుడు.. నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస పీల్చుకోవడం (deep breathing) అలవాటు చేసుకోండి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కొన్ని నిమిషాల పాటు అనులోమ, విలోమ, ధ్యానం, యోగా లాంటివి చేయడం వల్ల ఒత్తిడిని సులభంగా జయించవచ్చు. ఇవి మనసును నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
4. నిద్రకు వేళలు నిర్ణయించుకోండి..
శారీరక, మానసిక ఆరోగ్యానికి తగినంత నిద్ర అత్యవసరం. నిద్రలేమి సమస్యలు, లేదా మధ్యమధ్యలో తరచూ మెలకువ రావడం లాంటివి శరీరంలో ఒత్తిడి స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. అందుకే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.నిద్రించే ముందు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలి.రాత్రిపూట కెఫిన్ ఉండే టీ, కాఫీలు వంటివి తీసుకోకపోవడం మంచిది.
5. సమతుల్య ఆహారం, శారీరక శ్రమ..
ఒత్తిడిని తగ్గించుకోవడానికి కేవలం ఏదో ఒక మూలిక పైనో లేదా పానీయం పైనో ఆధారపడితే సరిపోదు. తీసుకునే ఆహారం, నిద్ర, వ్యాయామం.. ఇలా అన్నీ సమపాళ్లలో ఉండాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్, చక్కెరలు ఎక్కువగా ఉండే స్వీట్లకు బదులుగా.. పప్పులు, తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ మీ డైట్‌లో చేర్చుకోండి. అలాగే రోజూ కాసేపు నడక, తేలికపాటి వ్యాయామాలు చేయండి. అయితే, అతిగా వ్యాయామం చేయడం మానుకుని.. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం కూడా మర్చిపోవద్దు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
