Excessive Sleep : అతి నిద్ర కూడా ఆరోగ్యానికి హానికరమే.. హెచ్చరిస్తున్న పరిశోధనలు
సాక్షి లైఫ్ : మంచి ఆరోగ్యానికి పోషకాహారం, వ్యాయామంతో పాటు తగినంత నిద్ర కూడా అంతే అవసరం. సాధారణంగా రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. నిద్రలేమి వల్ల అలసట, తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయని మనందరికీ తెలుసు. కానీ, అవసరానికి మించి ఎక్కువగా నిద్రపోవడం కూడా అంతే ప్రమాదకరమని మీకు తెలుసా..? రోజుకు 9 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవడం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చునని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..Gen Z Trend ‘Panic Pouch’ : జెన్ జెడ్ ట్రెండ్ ‘పానిక్ పౌచ్’.. యాంగ్జైటీ, ఒత్తిడికి చెక్ పెట్టే మినీ కిట్..!
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
అతిగా నిద్రపోవడం అంటే ఏమిటి..?
వైద్యశాస్త్రంలో అతిగా నిద్రపోయే అలవాటును ‘హైపర్సోమ్నియా’ (Hypersomnia) అని పిలుస్తారు. సాధారణంగా 18 నుంచి 64 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతమైన పెద్దలకు రాత్రి పూట 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుంది. అయితే, రాత్రంతా పడుకున్నా కూడా పగటిపూట విపరీతమైన నిద్రమత్తు ఉండటం, రోజూ 10 నుంచి 12 గంటల కంటే ఎక్కువ సమయం పడకకే పరిమితమవ్వడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. గర్భిణీలు, చిన్నపిల్లలు, పాత రోగాల నుండి కోలుకుంటున్న వారికి ఎక్కువ నిద్ర అవసరం కావచ్చు. కానీ సాధారణ వ్యక్తుల్లో ఈ అలవాటు దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది.
ఎక్కువ నిద్ర వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు..
పరిమితికి మించి నిద్రపోవడం వల్ల శరీర జీవక్రియలు మందగించి అనేక రుగ్మతలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
ఊబకాయం సమస్య..
ఎక్కువ సమయం పడుకోవడం వల్ల శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతుంది. ఇది శరీరంలో క్యాలరీలు పేరుకుపోయేలా చేసి, బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది. అతిగా నిద్ర లేవడం వల్ల తలలోని నరాలు, రసాయనాలలో అసమతుల్యత ఏర్పడి రోజంతా తలనొప్పి, బద్ధకం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వేధిస్తాయి.
మానసిక సమస్యలు..
ఎక్కువ సమయం నిద్రలోనే గడపడం వల్ల మెదడు చురుకుదనం తగ్గి, డిప్రెషన్ (depression) వంటి మానసిక సమస్యల ముప్పు పెరుగు తుంది. అతిగా నిద్రపోవడం అనేది కేవలం బద్ధకం మాత్రమే కాకపోవచ్చు, అది మీ శరీరంలో ఉన్న ఏదైనా దాగి ఉన్న ఆరోగ్య సమస్యకు హెచ్చరిక కావచ్చు.
ముఖ్యంగా స్లీప్ అప్నియా అంటే నిద్రలో శ్వాస ఆడకపోవడం, నార్కోలెప్సీ అంటే నాడీ సంబంధిత నిద్ర రుగ్మత వంటి సమస్యలు ఉన్నప్పుడు నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. దీనివల్ల రాత్రి ఎంతసేపు పడుకున్నా శరీరం అలసిపోయినట్లే ఉండి, పగటిపూట మళ్లీ మళ్లీ నిద్ర వస్తుంది. ఇవే కాకుండా థైరాయిడ్ లోపం వల్ల మధుమేహం, తీవ్రమైన గురక, మానసిక ఒత్తిడి, మద్యం సేవించడం వంటి అలవాట్లు కూడా అతి నిద్రకు కారణమవుతాయి.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?
మీరు రోజుకు 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోతున్నా కూడా నిరంతరం అలసటగా అనిపిస్తున్నా, దాంతో పాటు అకస్మాత్తుగా బరువు పెరగడం, మతిమరుపు, విపరీతమైన గురక వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. మీ దినచర్యను మార్చుకుంటూనే, తగిన కారణాన్ని తెలుసుకోవడానికి వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. తక్కువ నిద్ర ఎంత నష్టమో, అతి నిద్ర కూడా అంతే హానికరమని, సమతుల్యమైన నిద్రతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
