Dry Eyes, Poor Night Vision : కళ్లు పొడిబారుతున్నాయా..? చీకట్లో సరిగ్గా కనిపించడం లేదా..? అయితే కారణం ఇదే కావొచ్చు..!
సాక్షి లైఫ్ : వయసు పైబడిన వారికే కంటి సమస్యలు వస్తాయనే రోజులు పోయాయి. ఇప్పుడు యువత, చిన్నపిల్లలు కూడా కంటి చూపు సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. గంటల తరబడి మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోవడం, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలు. కళ్లు తరచుగా పొడిబారడం, చీకటి పడగానే చూపు మందగించడం అంటే రేచీకటి వంటి లక్షణాలు ఈమధ్య చాలామందిలో కనిపిస్తున్నాయి. అయితే వీటిని కేవలం అలసటగానో, వాతావరణ మార్పుల ప్రభావంగానో భావించి కొట్టిపారేయకండి. దీని వెనుక ఓ ముఖ్యమైన విటమిన్ లోపం దాగి ఉందంటున్నారు వైద్యనిపుణులు.
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
విటమిన్-ఏ ఎందుకంత కీలకం..?
మన కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే 'విటమిన్-ఏ' చాలా అవసరం. ఇది కేవలం కంటికే కాకుండా గుండె, ఊపిరితిత్తులు తదితర అవయవాల పనితీరుకు, కణాల ఎదుగుదలకు, శరీర రోగనిరోధక వ్యవస్థ బలోపేతానికి ఎంతో తోడ్పడుతుంది. పిల్లల శారీరక ఎదుగుదలలో ఈ విటమిన్ పాత్ర చాలా ముఖ్యం.
రేచీకటి ఎందుకొస్తుందంటే..?
విటమిన్-ఏ లోపం వల్ల వచ్చే ప్రధాన సమస్య రేచీకటి (Night Blindness). కంటిలోని రెటీనా కాంతిని గ్రహించి ప్రతిస్పందించాలంటే విటమిన్-ఏ అత్యవసరం. ఇది లోపించినప్పుడు చీకట్లో లేదా తక్కువ వెలుతురులో వస్తువులను స్పష్టంగా చూడలేరు. అయితే, రాత్రి పూట కళ్లు సరిగ్గా కనిపించకపోవడానికి కేవలం విటమిన్-ఏ లోపమే కాకుండా ఇతర కంటి సమస్యలు కూడా కారణం కావొచ్చు. కాబట్టి తరచుగా ఇలా జరుగుతుంటే సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించడం ముఖ్యం.
కళ్లు పొడిబారడం (Xerophthalmia)..
శరీరంలో ఈ విటమిన్ తీవ్రంగా లోపిస్తే కంటి ఉపరితలం పూర్తిగా పొడిబారుతుంది. ఈ స్థితిని వైద్య పరిభాషలో జెరాఫ్తాల్మియా (Xerophthalmia) అంటారు. దీనివల్ల కంటి కార్నియా దెబ్బతినడం, అల్సర్లు ఏర్పడటం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికల ప్రకారం.. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే శాశ్వతంగా అంధత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంది.
శరీరంపై ఇతర ప్రభావాలు..
విటమిన్-ఏ లోపిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. పిల్లల్లో శారీరక ఎదుగుదల మంద గిస్తుందని డబ్ల్యూహెచ్ఓ (WHO) చెబుతోంది. ఈ విటమిన్ లోపాన్ని రక్తహీనత (anemia)తో కూడా ముడిపెట్టి చూస్తారు.
పరిష్కారం ఏంటి..? ఏం తినాలి..?
సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా విటమిన్-ఏ లోపాన్ని సులభంగా జయించవచ్చు. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు బచ్చలికూర, తోటకూర తదితరమైనవి. క్యారెట్, చిలగడదుంప, బొప్పాయి, మామిడిపండ్లు. పాలు, గుడ్లు, చేపలు ముఖ్యంగా కొన్ని రకాల సముద్ర చేపలు. రోజూ తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి.
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
