Monsoon dehydration : వర్షాకాలంలో దాహం వేయట్లేదని నీళ్లు తాగడం తగ్గిస్తున్నారా..? అయితే ఈ ముప్పు తప్పదు..!
సాక్షి లైఫ్ : వాతావరణం చల్లబడగానే వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి శరీరంలో నీటిశాతం తగ్గడం(dehydration) సమస్య రాదని చాలామంది అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ మాత్రమే..! శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతింటే ఏ కాలంలోనైనా డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక వెల్లడిస్తోంది. వానాకాలంలోనూ తగినన్ని నీళ్లు తాగకపోతే అనారోగ్యాల బారిన పడక తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?
వానాకాలంలో డీహైడ్రేషన్ ఎందుకు వస్తుంది..?
వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ.. గాలిలో తేమ (Humidity) శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన శరీరంలో పుట్టే చెమట త్వరగా ఆవిరి కాదు. లోపల శరీరం చెమట రూపంలో నీటిని కోల్పోతున్నా, బయటకు వాతావరణం చల్లగా ఉండటం వల్ల మనకు పెద్దగా దాహం వేయదు. దీంతో నీళ్లు తాగడం బాగా తగ్గిస్తాం. ఫలితంగా శరీరంలో తెలియకుండానే నీటి కొరత ఏర్పడుతుంది.
వాంతులు, విరేచనాలతో మరింత ముప్పు..
వర్షాకాలంలో కలుషిత నీరు, ఆహారం వల్ల కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎక్కువ. దీనివల్ల తరచుగా వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. ఈ క్రమంలో శరీరంలోని నీటితో పాటు సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్లిపోతాయి. వీటిని సకాలంలో భర్తీ చేయకపోతే తీవ్రమైన డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది ప్రాణాపాయ స్థితికి కూడా దారితీయొచ్చని డబ్ల్యూహెచ్‌వో (WHO) చెబుతోంది.
ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!
శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. వీటిని వెంటనే పసిగట్టాలి.. నోరు, నాలుక పదే పదే పొడిబారడం. మూత్రం ముదురు పసుపు రంగులో రావడం లేదా చాలా తక్కువగా రావడం. తీవ్రమైన అలసట, నీరసం, కళ్లు తిరగడం. మరీ ముఖ్యంగా మగతగా అనిపించడం, గందరగోళానికి గురికావడం వంటివి కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
వర్షాకాలంలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే..?
టైమ్ టు టైమ్ నీళ్లు.. దాహం వేసినా, వేయకపోయినా ప్రతి గంటకూ కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లండి. ఓఆర్‌ఎస్ (ORS) తప్పనిసరి.. వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు కేవలం నీళ్లే కాకుండా, ఓఆర్‌ఎస్ ద్రావణం కలుపుకుని తాగడం చాలా ముఖ్యం. ఇది ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.
ఆరోగ్యకరమైన ద్రవాలు..కొబ్బరినీళ్లు, వేడివేడి సూప్‌లు, హెర్బల్ టీ, మజ్జిగ వంటివి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. సురక్షితమైన నీరు.. వర్షాకాలంలో నీళ్లు కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ కాబట్టి కాచి చల్లార్చిన నీటినే తాగాలి. స్వీట్ డ్రింక్స్‌కు దూరం..దప్పిక తీర్చుకోవడానికి కూల్‌డ్రింక్స్, అధిక తీపి ఉండే ప్యాకేజ్డ్ జ్యూస్‌లకు దూరంగా ఉండటం మంచిది. రెండు రోజులకు మించి వాంతులు, విరేచనాలు లేదా తీవ్రమైన జ్వరం ఉంటే కేవలం ఇంట్లో ద్రవపదార్థాలు తాగుతూ కాలయాపన చేయకుండా, వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
