For Healthy and Strong Knees : మోకాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పడిపోవడం లేదా యాక్సిడెంట్స్ కావడం, ఆటలాడేటప్పుడు లేదా ఏదైనా పని చేసేటప్పుడు ఒక్కసారిగా మోకాలిపై ఒత్తిడి పడటం వల్ల అకస్మాత్తుగా నొప్పులు వస్తాయి. మోకాళ్లలో తరచుగా జరిగే గాయాలలో 'మెనిస్కస్' (Meniscus) చిట్లడం ఒకటి. ఇది మోకాలికి షాక్ అబ్జార్బర్‌లా పనిచేసే అర్ధచంద్రాకారపు కార్టిలేజ్. మోకాలిని అకస్మాత్తుగా తిప్పడం వల్ల ఇది దెబ్బతింటుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి, వాపు వస్తాయి. అలాగే, కీళ్లకు స్థిరత్వాన్ని ఇచ్చే నాలుగు ప్రధాన లిగామెంట్లలో ఏదైనా అతిగా సాగినా లేదా చినిగినా నొప్పులు వస్తాయి. ముఖ్యంగా 'ఎంసీఎల్' (MCL), 'ఏసీఎల్' (ACL) లిగామెంట్లు తరచుగా గాయపడే భాగాల కోవలోకి వస్తాయి.

ఆర్థరైటిస్ నొప్పికి చికిత్స ఎలా..?

నొప్పి క్రమంగా పెరుగుతుంటే తప్పనిసరిగా ఫిజికల్ థెరపిస్ట్‌ను సంప్రదించాలి. నడిచే విధానంలో లోపాలు, తుంటి కండరాల బలహీనత వంటి అంశాలను గుర్తించి వారు తగిన సలహాలు ఇస్తారు. ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పి తగ్గడంలో వ్యాయామాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. నొప్పి నివారణ మందులతో సమానంగా ఇవి మేలు చేస్తాయి. రోజువారీ నొప్పులు ఉంటే సైక్లింగ్, ఈత కొట్టడం లేదా ఎలిప్టికల్ మెషిన్ వంటి తక్కువ ప్రభావం చూపే ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. మోకాళ్లకు సపోర్ట్ ఇచ్చే బూట్లు ధరించడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

మందులు, సర్జరీ ప్రత్యామ్నాయాలు.. 

జీవనశైలి మార్పులు, మందుల వల్ల ఉపశమనం లభించకపోతే వైద్యులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను సిఫార్సు చేస్తారు. అయితే వీటిని పదే పదే వాడకూడదు. హ్యాలురోనిక్ యాసిడ్ లేదా ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా (PRP) ఇంజెక్షన్ల విషయంలో వైద్యుల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ఇవి ఖరీదైనవి అయినప్పటికీ, ప్రాథమిక దశలో ఉన్న ఆర్థరైటిస్ బాధితులకు కొంతవరకు మెరుగైన ఫలితాలను ఇస్తాయి. అన్ని రకాల చికిత్సల తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే వైద్యులు నీ-రీప్లేస్‌మెంట్ సర్జరీని ఎంచుకుంటారు.

గాయాలైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

రోజువారీ పనుల వల్ల గాయాలై నొప్పి వస్తే ఆ పనిని తక్షణమే నిలిపివేయాలి. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కీళ్ల చుట్టూ ఐస్ క్యూబ్స్‌తో కాపడం పెట్టడం మంచిది. ఏసీఎల్ లేదా మెనిస్కస్ ట్రియర్స్ వంటి తీవ్రమైన గాయాలకు సర్జరీ అవసరం కావచ్చు. మోకాళ్లలో స్థిరత్వం లేకపోవడం, అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడం, మెట్లు ఎక్కడం-దిగడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా..?

వయసును లేదా జన్యుపరమైన అంశాలను మనం మార్చలేం, కానీ శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మోకాళ్లపై పడే భారాన్ని తగ్గించు కోవచ్చు. కీళ్లను చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచడానికి నిత్యం శారీరకంగా యాక్టివ్‌గా ఉండటం అత్యవసరం. కొన్ని రకాల వ్యాయామాలు మోకాళ్లకు హాని చేస్తాయనేది కేవలం అపోహ మాత్రమే. సరైన పద్ధతిలో వ్యాయామాలు చేయడం ఎప్పుడూ మేలే. శారీరకంగా చురుగ్గా లేకపోతే కండరాలు బలహీనపడి, భవిష్యత్తులో ఆర్థరైటిస్ ముప్పు పెరుగుతుంది. ఆర్థరైటిస్ సమస్య ఉన్నప్పటికీ, సరైన ఆహారం తీసుకుంటూ, తగిన విశ్రాంతిని ఇస్తూ, కండరాలను బలంగా ఉంచుకుంటే మోకాళ్లు మెరుగ్గా పనిచేస్తాయి, లక్షణాల తీవ్రతను సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.   

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.