ఈ భూమ్మీద ఒక్క దోమలేకుండా చేస్తే ఏం జరుగుతుంది..?
సాక్షి లైఫ్ : ఈ భూమి మీద అంటే..? ప్రపంచ దేశాల్లోని మొత్తం 3,500 దోమల జాతులు ఉన్నాయి. వీటిలో కొన్నిరకాల జాతుల దోమలు మనిషిని కుట్టవు. ఇలాంటి జాతుల దోమలు ఏం తిని జీవిస్తాయనే సందేహం మీకు రావొచ్చు. అవి ఏమేం తింటాయంటే..? పండ్లు, మొక్కల రసాలను తాగి జీవిస్తాయి. కేవలం ఆరు జాతుల దోమలే మనుషుల రక్తాన్ని తాగుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ రకం దోమలు మనుషుల రక్తం తాగడమేకాకుండా కొన్నిరకాల వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి.
భారతదేశంలో దోమల కారణంగా ప్రతి సంవత్సరం 10 లక్షల మంది చనిపోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దోమలు అన్ని ప్రదేశాల్లో కనిపిస్తాయి. అవి కుడితే జ్వరం నుంచి పలురకాల ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
దోమలు కుడితే..
దోమలు కుడితే మలేరియా, డెంగ్యూ,ఎల్లో ఫీవర్ వంటి వచ్చే వ్యాధులు వస్తాయి. దోమ కాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోతున్నారు. ఒకవేళ ప్రపంచంలోని దోమలన్నింటినీ చంపేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? అవి లేకపోతే లాభమా..? నష్టమా..? అనేది తెలుసుకుందాం.
జనరల్ గా దోమలను చంపడానికి కెమికల్స్ ను ఎక్కువగా వాడు తుంటారు. అయితే దోమల కంటే ఈ రసాయనాలతోనే ఎక్కువగా మనుషులకే ప్రమాదం. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ఎలాంటి రసాయనాలతో పనిలేకుండా దోమలను అంతమొందించేందుకు అవసరమైన ఉపాయాలను కనుగొనే పనిలో పడ్డారు. ఈ ప్రయత్నంలో అనేక దేశాలు విజయం సాధించాయి కూడా.
ఈ ప్రయోగం కారణంగా..
మనిషులను కుట్టే ఆడ దోమల జీన్‌లో మార్పులు తీసుకువచ్చి జెనెటికల్లీ మోడిఫైడ్ దోమలను సిద్ధం చేశారు. దోమలు గుడ్లను పెడతాయి. అయితే వాటినుంచి పిల్లలు బయటకు వచ్చేలోగానే తల్లిదోమలు మృతి చెందుతాయి. సుమారు మూడు లక్షల దోమలను కెమన్ ద్వీపంలో 2009-2010 సంవత్సరాల మధ్య వదిలివేశారు. ఈ ప్రయోగం కారణంగా దోమల జనాభాలో 96 శాతం వరకూ తగ్గింది. ఇటువంటి ప్రయోగం బ్రెజిల్ లోనూ మంచి ఫలితాలను ఇచ్చింది.
మాడిఫైడ్ మస్కిటో ప్రయోగం..
మూడు రకాల దోమలను నాశనం చేయగలిగితే పది లక్షలమంది మనుషులను కాపాడవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాగే జెనిటికల్లీ మాడిఫైడ్ మస్కిటో ప్రయోగం కూడా ఇప్పటివరకూ ఎటువంటి దుష్పరిమాణాలను చూపలేదు.
అయితే దోమలను పూర్తిస్థాయిలో నాశనం చేస్తే ప్రకృతి అందించిన ఆహారపు గొలుసుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దోమలు పూలలో పరపరాగ సంపర్కం ఏర్పడేందుకు సహకారం అందిస్తాయి. తద్వారానే పూలు పండ్లుగా మారుతాయి.
కొన్ని ప్రాణులకు దోమలు ఆహారంగా మారుతాయి. కప్పలు, బల్లులు, తొండలు వంటివి దోమలను తిని బతుకుతాయి. ఇవి ఉండటం వల్ల ప్రకృతి సమతుల్యత సాఫీగా ఉంటుంది. అందుకే దోమలను మొత్తంగా అంతం చేసేబదులు వాటిలో ప్రమాదకరమనవాటిని మాత్రం అంతం చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
