క్యాన్సర్ మరణాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..?
సాక్షి లైఫ్ : భారతదేశంలో కాన్సర్ మరణాలు విపరీతంగా పెరుగు తున్నాయి. క్యాన్సర్ మరణాల విషయంలో ప్రస్తుతం ఆసియాలోనే భారత్ రెండో స్థానంలో ఉన్నదని ది లాన్సెట్ అనే రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్ నివేదించింది. భారతదేశంలో క్యాన్సర్ కారణంగా తొమ్మిది లక్షలకు పైగా మరణాలు సంభవించగా, 12 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని లాన్సెట్ నివేదికలో తెలిపింది. ఆసియాలోని 49దేశాల్లో 29 క్యాన్సర్ల పై అధ్యయనం చేశారు. ప్రతి సంవత్సరం 13 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా, 12లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది.
అధ్యయనంలో..
క్యాన్సర్ మరణాల విషయంలో ఆసియాలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. 2019లో భారతదేశంలో 9 లక్షల ముప్పై వేల మంది క్యాన్సర్ బారీన పడి చనిపోగా, కొత్త క్యాన్సర్ కేసులు 12 లక్షలు నమోదయ్యాయి. ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. క్యాన్సర్ మరణాలు భారతదేశం, చైనా, జపాన్ దేశాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. కొత్త కేసులు కూడా ఈ దేశాల్లోనే మరింతగా పెరుగు తున్నాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. 2019లో 94 లక్షల కొత్త కేసులు నమోదవ్వగా, 56 లక్షల మరణాలు ఈ దేశాల్లోనే సంభవించాయి.
భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్ వంటి ఆసియా దేశాలలోని ప్రజలు ఖైనీ, గుట్కా, పాన్ మసాలాలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీని కారణంగా ఆయా దేశాల ప్రజలు పలురకాల క్యాన్సర్ల బారీన పడుతున్నారు. నోటి క్యాన్సర్ కారణంగా ప్రపంచ మరణాలలో 28.2 శాతం కొత్త కేసులు నమోదవుతున్నాయి. క్యాన్సర్ కొత్త కేసులలో భారతదేశంలో పెదవులు, నోటి క్యాన్సర్ల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రపంచంలోని నోటి క్యాన్సర్ కేసులకు 50 శాతానికి పైగా పొగాకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు.
మరణాలు ఎలా తగ్గుతాయి..?
క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించి అవసరమైన చికిత్స అందించడం వల్ల కొంత మేర క్యాన్సర్ మరణాలను తగ్గించడానికి అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
