Blood Transfusion : ప్రాణాలను కాపాడే సురక్షిత రక్త మార్పిడి విధానానికి పునాది ఎలా పడింది అంటే..?
సాక్షి లైఫ్ : ఆపదలో ఉన్నవారికి రక్తం దానం చేయడం అంటే.. ప్రాణదానం చేయడమే. ఆధునిక వైద్యంలో 'రక్త మార్పిడి' (Blood Transfusion) అనేది చాలా సాధారణమైన.. అత్యంత సురక్షితమైన ప్రక్రియ. కానీ, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ రక్త మార్పిడి ప్రయోగం ఎలా జరిగిందో, ఎవరికి జరిగిందో మీకు తెలుసా..? మనిషికి మనిషి రక్తం కాకుండా.. ఒక జంతువు రక్తాన్ని ఎక్కించారని చెబితే మీరు నమ్ముతారా..? అవును.. మీరు విన్నది నిజమే..! 1 ఫ్రాన్స్‌కు చెందిన డాక్టర్ 'జీన్ బాప్టిస్ట్ డెనిస్' (Jean-Baptiste Denys) అనే వైద్యుడు ఓ 15 ఏళ్ల బాలుడిపై ఈ సాహసోపేతమైన ప్రయోగం చేశాడు.
మనిషికి గొర్రె రక్తాన్ని ఎక్కించి ప్రపంచంలోనే తొలిసారిగా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్‌కి నాంది పలికాడు. అసలు ఆ వింతైన ప్రయోగానికి దారితీసిన పరిస్థితులు ఏంటి..? గొర్రె రక్తం ఎక్కించిన తర్వాత ఆ బాలుడి పరిస్థితి ఏమైంది..? ప్రాణాలు నిలబెట్టే ఈ రక్తదానం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
మార్పిడి చేయడం..
నేడు వైద్య రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రమాదాలు జరిగినప్పుడో, శస్త్రచికిత్సల సమయాల్లోనో అవసరమైన వారికి రక్తాన్ని మార్పిడి చేయడం (Blood Transfusion) చాలా సర్వసాధా రణమైన విషయంగా మారిపోయింది. కానీ, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ రక్త మార్పిడి ప్రయోగం ఎలా జరిగిందో తెలుసా..? వినడానికి కాస్త ఆశ్చర్యంగా, భయానకంగా అనిపించినా.. ఆనాడు ఒక మనిషి ప్రాణాలు కాపాడటానికి గొర్రె రక్తాన్ని ఎక్కించారు. మానవ వైద్య చరిత్రలో అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన ఆ సంఘటన గురించిన సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం మీకోసం..
అది 1667వ సంవత్సరం, జూన్ 15. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు జీన్-బాప్టిస్ట్ డెనిస్ వద్దకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఒక 15 ఏళ్ల బాలుడు వచ్చాడు. ఆ రోజుల్లో రక్త మార్పిడి గురించి ఎటువంటి శాస్త్రీయ అవగాహన గానీ, పరిశోధనలు గానీ లేవు. బాలుడి పరిస్థితి విషమించడంతో, డాక్టర్ డెనిస్ ఒక సాహసోపేతమైన, అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక గొర్రె రక్తాన్ని సేకరించి, ఆ బాలుడి శరీరంలోకి ప్రవేశపెట్టారు.
మొదటి ప్రయత్నంలో ..
వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఈ ప్రయోగం మొదటి ప్రయత్నంలో విజయవంతమైంది. గొర్రె రక్తం ఎక్కించిన తర్వాత ఆ బాలుడు కోలుకోవడమే కాకుండా, అతని ఆరోగ్యం కూడా మెరుగైంది. ఈ విజయంతో ఉత్సాహం తెచ్చుకున్న డాక్టర్ డెనిస్, మరికొంత మంది రోగులపై కూడా ఇదే తరహా ప్రయోగాలు చేశారు. అయితే, అదృష్టం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఆ తర్వాత గొర్రె రక్తం ఎక్కించిన కొందరు రోగులు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు.రోగుల మరణాలతో ఫ్రాన్స్‌లో తీవ్ర కలకలం రేగింది.
ఒక రోగి మృతి చెందిన నేపథ్యంలో..
ఒక రోగి మృతి చెందిన నేపథ్యంలో డాక్టర్ డెనిస్‌పై ఏకంగా 'హత్య' ఆరోపణలు వచ్చాయి. కోర్టు విచారణ జరిపి, ఆయనను నిర్దోషిగా ప్రకటించిన ప్పటికీ, ఈ ఘటనతో వైద్య ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనితో జంతువుల రక్తాన్ని మనుషులకు ఎక్కించే ప్రయోగాలపై నిషేధం విధించారు. ఈ భయాందోళనల కారణంగా దాదాపు 200 సంవత్సరాల పాటు రక్త మార్పిడిపై ఎలాంటి పరిశోధనలు జరగలేదు. రక్త మార్పిడి చరిత్రలో అసలైన మైలురాయి 1900వ సంవత్సరంలో నమోదైంది.
ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టీనర్ మానవ రక్తంలో వేర్వేరు రకాలు (Blood Groups) ఉంటాయని కనుగొన్నారు. ఒకరి రక్తం ఇంకొకరికి పడాలంటే బ్లడ్ గ్రూపులు కలవడం ఎంత ముఖ్యమో ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు. ల్యాండ్‌స్టీనర్ చేసిన ఈ చారిత్రాత్మక ఆవిష్కరణే నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్న సురక్షిత రక్త మార్పిడి విధానానికి అద్భుతమైన పునాది వేసింది.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
