Shocking Study Reveals : పొలాల్లోనే కాదు.. ఇళ్లల్లో వాడే వాటిలోనూ క్యాన్సర్ కారకాలు..! సంచలన అధ్యయనంవెల్లడి..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తెలియకుండానే మన ఇళ్లలోకి.. మన కడుపులోకి ప్రవేశిస్తున్న పురుగు మందుల(Pesticides) ఉచ్చు ప్రాణాల మీదకు తెస్తోంది. కేవలం వ్యవసాయ పొలాల్లోనే కాదు.. మనం నిత్యం ఇళ్లలో శుభ్రత కోసం, దోమలు, ఈగలు, పేలు, గృహోపకరణాల రక్షణ కోసం వాడే మందుల్లోనూ ప్రమాదకర రసాయనాలు నిగూఢమై ఉంటున్నాయి. తాజాగా అమెరికాలో వెలువడిన ఓ ప్రతిష్టాత్మక శాస్త్రీయ అధ్యయనం ప్రపంచ ఆరోగ్య రంగాన్ని ఉలికిపాటుకు గురిచేస్తోంది. పురుగు మందుల్లో కేవలం ప్రధాన పదార్థాలే కాకుండా, వాటిలో కలిపే 'ఇతర' పదార్థాలు సైతం రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) ముప్పునకు కారణమవుతున్నట్లు ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.

అదే అసలు 'బ్లైండ్ స్పాట్'..!

అమెరికాలోని 'ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పర్సపెక్టివ్స్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన వివరాలు విస్మయం గొలుపుతున్నాయి. పురుగు మందుల తయారీలో వాడే వందలాది రసాయనాలను పరిశోధకులు లోతుగా విశ్లేషించారు. పురుగు మందుల తయారీలో వాడుతున్న మొత్తం 485 రసాయనాలు రొమ్ము క్యాన్సర్‌కు ముడిపడి ఉన్నట్లు గుర్తించారు.

కేవలం 145 మాత్రమే యాక్టివ్.. వీటిలో కేవలం 145 రసాయనాలు.. మాత్రమే అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) వద్ద 'యాక్టివ్ ఇన్‌గ్రీడింట్స్' అంటే ప్రధాన క్రియాశీలక పదార్థాలు గా రిజిస్టర్ అయి ఉన్నాయి. మిగతావి 'ఇనార్ట్' రూపంలో.. ఇక మిగిలిన వందలాది రసాయ నాలను 'ఇనార్ట్' (Inert Ingredients) అనగా నిస్సారమైనవి లేదా నిష్క్రియాత్మకమైనవిగా వర్గీకరించారు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

 

'ఇనార్ట్' అంటే హాని లేదనా..?

చాలామంది 'ఇనార్ట్' అంటే ఎలాంటి ప్రభావం చూపని పదార్థాలుగా పొరపడుతుంటారు. పురుగు మందుల స్ప్రే నేరుగా క్రిమిసంహార కానికి పని చేయకపోయినప్పటికీ.. ఆ మందు నేల మీద, ఆకుల మీద లేదా వస్తువుల మీద మెరుగ్గా వ్యాపించడానికి, లోపలికి చొచ్చుకుపోవడానికి, శరీరం లేదా ఉపరితలాలు వాటిని పీల్చుకోవడానికి ఈ 'ఇనార్ట్' పదార్థాలే ప్రధాన కారణమవుతున్నాయి.

"ప్రజలు కేవలం ఒక్క ప్రధాన పదార్థాన్ని మాత్రమే తీసుకోవడం లేదు.. ఆ పూర్తి స్థాయి పురుగు మందు మిశ్రమాన్ని (Formulation) పీలుస్తున్నారు, శరీరం ద్వారా గ్రహిస్తున్నారు" అని 'సైలెంట్ స్ప్రింగ్ ఇన్‌స్టిట్యూట్' పరిశోధకురాలు, ఈ అధ్యయన ప్రధాన రచయిత డాక్టర్ జెన్నిఫర్ కే (Dr. Jennifer Kay) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విభాగాన్ని అధికారులు గమనించకపోవడం పెద్ద 'నియంత్రణ అంధ ప్రాంతం' (Regulatory Blind Spot)గా మారిందని ఆమె హెచ్చరించారు.

ఎక్కడెక్కడో ఈ ముప్పు..?

ఇళ్లల్లోనే నిత్యం వాడకం..ఈ రసాయనాల ప్రభావం కేవలం రైతులు, వ్యవసాయ కూలీలకే పరిమితం కాలేదు. గృహాల్లో వాడే లాన్ ట్రీట్‌మెంట్స్, పెంపుడు జంతువుల కుక్కలు, పిల్లులు పురుగుల నివారణ మందులు, తలలో పేలు పోగొట్టే షాంపూల్లోనూ ఇవి ఉంటున్నాయి. ఆహారం, తాగునీరు ద్వారా.. మనం తిండి, తాగునీటి ద్వారా కూడా తెలియకుండానే ఈ రసాయనాలను శరీరంలోకి చేర్చుకుంటున్నాం.

ఎన్‌హెచ్‌ఏఎన్ఎస్ (NHANES) సర్వే నివేదిక.. అమెరికా జనాభాపై నిర్వహించిన ఆరోగ్య సర్వేలో.. గుర్తించిన 485 రసాయనాల్లో కనీసం 84 రసాయనాలు సాధారణ ప్రజల శరీరాల్లోనూ స్పష్టంగా లభ్యమై నట్లు తేలింది. చాలా సమ్మేళనాలను నిత్యం పరీక్షించక పోవడం వల్ల ఈ గణాంకాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

పెరుగుతున్న క్యాన్సర్ కేసులు..

అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసులు, ముఖ్యంగా యువతుల్లోనూ ఇవి ఆందోళనకరంగా పెరుగుతుండటం గమనార్హం. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గణాంకాల ప్రకారం.. రొమ్ము క్యాన్సర్ కేసులు ఏటా దాదాపు 1శాతం చొప్పున పెరుగుతుండగా, 50 ఏళ్ల వయసులోపు మహిళల్లో ఈ వేగం మరింత ఎక్కువగా ఉంది.

అయితే, ఈ రసాయనాలు నేరుగా రొమ్ము క్యాన్సర్‌ను కలిగిస్తాయని ఈ అధ్యయనం కచ్చితంగా నిర్ధారించలేదు. రొమ్ము క్యాన్సర్ అనేది జన్యుపరమైన, హార్మోన్ల మార్పుల వల్ల, పర్యావరణ, జీవనశైలి కారకాల కలయిక వల్ల వచ్చే సంక్లిష్టమైన వ్యాధి. అయినప్పటికీ, వివిధ రసాయనాల సమిష్టి ప్రభావం (Combined Exposure) మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపుతుందనే దానిపై అధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. World Heart Day 2026 : బ్లూ లైట్ తోనే యువతలో పెరుగుతున్న గుండెపోటు ముప్పు..!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.