AI Magic in Heart Treatment : గుండెపోటుకు ముందే హెచ్చరిక.. హార్ట్ ట్రీట్మెంట్ లో 'ఏఐ' మ్యాజిక్..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, తీవ్రమైన ఒత్తిడి, మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం తదితర కారణాల వల్ల దేశంలో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కృత్రిమ మేధ (Artificial Intelligence) వైద్య రంగానికి, ముఖ్యంగా కార్డియాలజీకి ఒక సరికొత్త ఆశాకిరణంలా మారుతోంది. అయితే, సాంకేతికత ఎంత పెరిగినా అది వైద్యుడికి ప్రత్యామ్నాయం కాలేదన్నది అక్షర సత్యం. మరి గుండె జబ్బుల నిర్ధారణ, చికిత్సలో ఏఐ పాత్ర ఏమిటి..? భవిష్యత్తులో ఇది ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో తెలుసుకుందాం.. 

వ్యాధి రాకముందే పసిగట్టే అవకాశం..

ఇప్పటివరకు వైద్యరంగం ప్రధానంగా వ్యాధి వచ్చాక చికిత్స చేసే విధానం (Reactive Medicine) పైనే ఆధారపడింది. కానీ, ఏఐ రాకతో వ్యాధి రాకముందే పసిగట్టే (Predictive Care) అవకాశం ఏర్పడింది. ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, ల్యాబ్ రిపోర్టులను వేగంగా విశ్లేషించి, మనుషులు గుర్తించలేని సూక్ష్మమైన మార్పులను సైతం ఏఐ ఇట్టే పసిగట్టేస్తుంది. దీనివల్ల ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోయినా, భవిష్యత్తులో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నవారిని ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయవచ్చు. "ఈరోజు మన గుండె పరిస్థితి ఏంటి..? రేపు ఏం జరగబోతోంది..? దాన్ని ఆపడానికి ఈరోజు ఏం చేయాలి..?" అనే ప్రశ్నలకు ఏఐ కచ్చితమైన సమాధానాలు ఇవ్వగలదు.

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

గ్రామీణ వైద్యంలో సరికొత్త విప్లవం..

మన దేశంలో నిపుణులైన వైద్యులు, అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఎక్కువగా నగరాలకే పరిమితం. పల్లెల్లో సరైన సమయంలో వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పోర్టబుల్ ఈసీజీలు, డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్‌లకు ఏఐని అనుసంధానించడం వల్ల ప్రాథమిక ఆరోగ్య కార్యకర్తలు సైతం గుండె జబ్బుల ముప్పు ఉన్నవారిని సులభంగా గుర్తించవచ్చు. అత్యవసరమైతే వెంటనే నగరాల్లోని నిపుణుల సలహాలు తీసుకునేలా ఏఐ ఒక వారధిలా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్యాన్ని చేరువ చేయడమే ఏఐ అసలైన విజయం.

రోగికి తగ్గట్టుగా వ్యక్తిగత చికిత్స (Personalized Care)..

ఒకే వయసు ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఒకేరకమైన గుండె సమస్య ఉండకపోవచ్చు. వారి బీపీ, షుగర్, కుటుంబ నేపథ్యం, నిద్ర, అలవాట్లను బట్టి చికిత్స మారాలి. రోగి వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి, వారికి మాత్రమే సరిపోయే చికిత్సను అందించడంలో ఏఐ వైద్యులకు ఒక 'కో-పైలట్' లా సహాయపడుతుంది. అయితే, దీనికోసం విదేశీ డేటా కాకుండా మన దేశ ప్రజల ఆరోగ్య, జన్యుపరమైన డేటాను (Indian Data Sets) వినియోగించడం చాలా ముఖ్యం. అలాగే రోగుల వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడటానికి పటిష్టమైన భద్రతా ప్రమాణాలు ఉండాలి.

సమయమే ప్రాణాధారం..

గుండెపోటు వచ్చినప్పుడు ప్రతి నిమిషం చాలా విలువైంది. ఏఐ ఆధారిత వ్యవస్థల ద్వారా రోగి పరిస్థితి తీవ్రతను బట్టి అత్యవసర విభాగాలు, కార్డియాలజిస్టుల మధ్య వేగంగా సమాచార మార్పిడి జరుగుతుంది. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఛాతీలో అకస్మాత్తుగా నొప్పి రావడం, విపరీతంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తే.. ఏఐ కోసం ఎదురుచూడకుండా తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి.

వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు..!

ఏఐ రాకతో వైద్యుల అవసరం తీరిపోతుందనే అపోహ చాలామందిలో ఉంది. యంత్రాలు వ్యాధిని అంచనా వేయగలవు, వేగంగా రిపోర్టులు ఇవ్వగలవు.. కానీ, రోగి భయాన్ని, ఆవేదనను అర్థం చేసుకోలేవు. రోగికి కావాల్సిన ధైర్యాన్ని, భరోసాను, మానవత్వాన్ని కేవలం ఒక వైద్యుడు మాత్రమే అందించగలడు. భవిష్యత్తు వైద్యం 'డాక్టర్ వర్సెస్ ఏఐ' లా కాకుండా 'డాక్టర్ + ఏఐ + మానవత్వం' అనే కోణంలో సాగాలి. సాంకేతికతతో వైద్యం సులభతరం కావొచ్చు. కానీ ఆరోగ్య సంరక్షణలో అతి ముఖ్యమైన ఇంటెలిజెన్స్.. కృత్రిమమైనది కాదు, అది తోటి మనిషిని కాపాడుకోవాలనే 'మానవత్వం'.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.