Paracetamol : పారాసిటమాల్ రోజువారీ పరిమితి ఎంతంటే..?
సాక్షి లైఫ్ : జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం రాగానే చాలామంది చేతులు ముందుగా వెతికేది పారాసిటమాల్ బిళ్ల కోసమే. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే మెడికల్ షాపుల్లో సులువుగా లభిస్తుండటంతో, దీన్నో అత్యంత సాధారణ ఔషధంగా భావించి ఇష్టారీతిన వాడేస్తుంటారు. అయితే, ఎంతటి సాధారణ మందైనా మోతాదు మించితే ప్రాణాలకే ముప్పుగా మారుతుందని బ్రిటన్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడి ఉదంతం తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఆ చిన్న పొరపాటే ఐసీయూ చేర్చింది..!
బ్రిటన్‌కు చెందిన 20 ఏళ్ల రాలీ లుబాస్ అనే యువకుడికి కొద్దిరోజుల క్రితం తీవ్రమైన జలుబు, ఫ్లూ లక్షణాలు కనిపించాయి. వెంటనే సమీపంలోని ఫార్మసీకి వెళ్లి జలుబు నివారణ మందులతో పాటు 500 మిల్లీగ్రాముల పారాసిటమాల్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేశాడు. ఇక్కడే అతను ఒక కీలకమైన విషయాన్ని గమనించలేకపోయాడు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
అతను తీసుకున్న జలుబు కాంబినేషన్ మందుల్లోనే ఇప్పటికే 250 మి.గ్రా పారాసిటమాల్ కలిసి ఉంది. దీనికి అదనంగా ప్రత్యేకంగా మరో 500 మి.గ్రా పారాసిటమాల్ బిళ్లను కూడా వేసుకున్నాడు. అలా రోజుకు ఏకంగా 9,000 మి.గ్రా వరకు పారాసిటమాల్‌ను శరీరంలోకి పంపించాడు. ఫలితంగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు మొదలై చివరికి కాలేయం దెబ్బతిని ఐసీయూలో చేరాల్సి వచ్చింది. సకాలంలో వైద్యులు స్పందించి చికిత్స అందించడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
శరీరంలో ఏం జరుగుతుంది..?
సాధారణ మోతాదులో పారాసిటమాల్ తీసుకున్నప్పుడు కాలేయం దానిని సురక్షితంగా జీర్ణం చేసి బయటకు పంపుతుంది. కానీ పరిమితికి మించి తీసుకున్నప్పుడు కాలేయంలో 'NAPQI' (N-acetyl-p-benzoquinone imine) అనే విషపూరిత రసాయనం భారీ స్థాయిలో పేరుకుపోతుంది.
కాలేయ కణాల విధ్వంసం: పెరిగిన విషపదార్థాన్ని తట్టుకునే శక్తి కాలేయానికి లేక కణాలు వేగంగా దెబ్బతింటాయి. ఓవర్‌డోస్ అయిన తొలినాళ్లలో వచ్చే వికారం, నీరసం సాధారణ జ్వరం లేదా జలుబు లక్షణాలనే పోలి ఉంటాయి. దాంతో బాధితులు మరింతగా పారాసిటమాల్ తీసుకుని సమస్యను ప్రాణాంతకంగా మార్చుకుంటారు.
వైద్య నిపుణుల మార్గదర్శకాల ప్రకారం.. పెద్దలు ఒకేసారి తీసుకునే పారాసిటమాల్ మోతాదు 500 మిల్లీగ్రాముల నుంచి గరిష్ఠంగా 1,000 మిల్లీగ్రాముల వరకు మాత్రమే ఉండాలి. ఒక మోతాదు తీసుకున్న తర్వాత మళ్లీ వేసుకోవడానికి కనీసం 4 నుంచి 6 గంటల వ్యవధి తప్పనిసరిగా పాటించాలి. అన్నింటికంటే ముఖ్యంగా, 24 గంటల వ్యవధిలో మొత్తం మోతాదు ఎట్టిపరిస్థితుల్లోనూ 4,000 మిల్లీగ్రాములు అంటే 4 గ్రాములు లేదా 500 మి.గ్రా మాత్రలైతే గరిష్ఠంగా 8 బిళ్లలు మించకూడదు. ఈ పరిమితి దాటితే కాలేయంపై తీవ్ర భారం పడి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
లేబుల్ నిశితంగా పరిశీలించండి..దగ్గు, జలుబు, సైనస్ కోసం వాడే సిరప్‌లు లేదా మల్టీ-సింప్టమ్ మాత్రల్లో ఇప్పటికే పారాసిటమాల్ (ఎసిటమైనోఫెన్) కలిసి ఉందో లేదో చూసుకోండి. అలా ఉంటే ప్రత్యేకంగా పారాసిటమాల్ వేసుకోకూడదు.
సొంత వైద్యం వద్దు.. రెండు మూడు రోజులు మించి జ్వరం తగ్గకపోతే సొంతంగా మాత్రల సంఖ్యను పెంచకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇప్పటికే కాలేయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు లేదా మద్యపాన అలవాటు ఉన్నవారు పారాసిటమాల్ వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. పారాసిటమాల్ సురక్షితమైన ఔషధమే అయినప్పటికీ, అవగాహన లేకుండా మితిమీరి వాడితే ప్రాణాంతక లివర్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుందని గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
