Myths vs Facts : అపోహలు-వాస్తవాలు : మహిళల ఆరోగ్యం గురించి ఇవి నిజమేనా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సమాజంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అపోహలు, అపార్థాలు ఏళ్ల తరబడి ప్రచారంలో ఉన్నాయి. శాస్త్రీయ ఆధారం లేకపోయినా.. చాలామంది గుడ్డిగా వీటిని నమ్ముతుంటారు. దీనివల్ల కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సైతం నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. నెలసరి సమయంలో వ్యాయామం చేయకూడదని, వయసు పైబడిన వారికే ఎముకలు బలహీనపడతాయని.. ఇలా ఎన్నో తప్పుడు నమ్మకాలు జనాల్లో నాటుకుపోయాయి. మహిళలు తమ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన పెంచుకోవడం ద్వారా సకాలంలో స్పందించి, తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు. ఈ నేపథ్యంలో.. మహిళల ఆరోగ్యం చుట్టూ అల్లుకున్న కొన్ని సాధారణ అపోహలు, వాటి వెనుక ఉన్న కచ్చితమైన వాస్తవాలు నిపుణుల మాటల్లో మీకోసం..

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

అపోహ 1.. నెలసరి సమయంలో వ్యాయామం చేయకూడదు..


వాస్తవం: ఇది పూర్తిగా తప్పుడు నమ్మకం. రుతుక్రమ సమయంలో తేలికపాటి వ్యాయామాలు, యోగా, వాకింగ్, స్ట్రెచింగ్ చేయడం వల్ల పొత్తికడుపు నొప్పి, కండరాల పట్టేయడం (cramps), తీవ్రమైన అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంటే మాత్రం శరీరానికి కాస్త విశ్రాంతి ఇవ్వడం మంచిది.

అపోహ 2..ఎముకల బలహీనత వృద్ధాప్యంలోనే వస్తుంది..


వాస్తవం: ఎముకలు అరిగిపోవడం లేదా బలహీనపడటం అనేది కేవలం వృద్ధాప్యానికే పరిమితం కాదు. చిన్న వయసులో కూడా ఈ సమస్య ఎదురుకావచ్చు. శరీరంలో క్యాల్షియం, విటమిన్-డి లోపించడం, పోషకాహార లోపం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, హార్మోన్ల మార్పుల వల్ల యువతుల్లోనూ ఎముకల వ్యాధులు వచ్చే ముప్పు ఉంటుంది.

అపోహ 3..రొమ్ము నొప్పి వస్తే క్యాన్సర్ ఉన్నట్లే..!

వాస్తవం..రొమ్ములో నొప్పి రావడం ఎల్లప్పుడూ క్యాన్సర్‌కు సంకేతం కాదు. హార్మోన్లలో హెచ్చుతగ్గులు, ఇన్ఫెక్షన్లు, కణితులు ఏర్పడటం వంటి ఇతర సాధారణ కారణాల వల్ల కూడా నొప్పి వస్తుంటుంది. అయితే, ఏవైనా గడ్డలు తగలడం, చర్మంలో అసాధారణ మార్పులు కనిపించడం, నొప్పి తగ్గకుండా రోజుల తరబడి వేధిస్తుంటే మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

అపోహ 4..మెనోపాజ్ తర్వాత గర్భం దాల్చలేరు..

వాస్తవం.. మెనోపాజ్ దశ పూర్తిగా ముగిశాక సహజంగా గర్భం దాల్చడం సాధ్యం కాదన్నది నిజమే. కానీ, మెనోపాజ్‌కు ముందు వచ్చే పరివర్తన దశను (పెరిమెనోపాజ్) చాలామంది మెనోపాజ్‌గా పొరబడుతుంటారు. ఈ దశలో అరుదుగానే అయినా గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి, ఆ సమయంలోనూ వైద్యుల సలహాతో గర్భనిరోధక పద్ధతులు పాటించడం సురక్షితం.

అపోహ 5.. అధిక బరువు ఉన్నవారికే పీసీఓఎస్ (PCOS) వస్తుంది..

వాస్తవం: కేవలం ఊబకాయం ఉన్న మహిళలు మాత్రమే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) బారిన పడతారనుకోవడం అపోహ మాత్రమే. సాధారణ బరువు, సన్నగా ఉండే మహిళల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. ఇది కేవలం బరువుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు.. జన్యుపరమైన, హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే ఆరోగ్య సమస్య.

అపోహ 6.. నెలసరి క్రమం తప్పడం సాధారణమే..

వాస్తవం.. ఒత్తిడి, ప్రయాణాలు లేదా జీవనశైలిలో ఆకస్మిక మార్పుల వల్ల అప్పుడప్పుడూ నెలసరి ఒకటి రెండు రోజులు అటూఇటూ అవ్వడం సహజమే. కానీ, ఎప్పుడూ రుతుక్రమం సక్రమంగా రాకపోవడం, నెలల తరబడి రాకపోవడం లాంటివి సాధారణం కాదు. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే అది హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ లేదా పీసీఓఎస్‌కు సంకేతం కావొచ్చు.

అపోహ 7..మహిళలకు గుండెపోటు వచ్చే ముప్పు తక్కువ..


వాస్తవం: గుండె జబ్బులు కేవలం పురుషులకే వస్తాయనేది పచ్చి అబద్ధం. మహిళలకు కూడా సమాన స్థాయిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఈ ముప్పు మరింత పెరుగుతుంది. అయితే, పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు లక్షణాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఛాతీ నొప్పితో పాటు తీవ్రమైన అలసట, ఊపిరి ఆడకపోవడం, వికారం, దవడ లేదా నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.