పాము కాటేసినప్పుడు దేని ప్రభావం ఎక్కువగా ఉంటుంది..?
సాక్షి లైఫ్ : పాము కాటులో విషం కంటే దాని కోరలతోనే ఎక్కువ సమస్య అని మీకు తెలుసా? అవునండి ఇది నిజం. కోరల ద్వారా విషం శరీరంలోకి ఇంజెక‌్షన్ మాదిరిగా చేరుతుందని ఇప్పటివరకూ అనుకునే వారు కానీ... ఇప్పుడా అవగాహన మారిపోయింది. పాము విషం ఇంచుమించు గుజ్జులా ఉంటుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా గుర్తించారు. పాము కోరలమీద గాడిలాగ నొక్కు ఉంటుంది. అది గొట్టంలా పనిచేసి, విషం శరీరంలోకి జారుతుందని కూడా గమనించారు.
కోరలు శరీరంలోకి దిగిన తర్వాత..
ఈ గాడి గుండా విషం కారే విధానం గురించి ఫిజికల్ రివ్యూ లెటర్స్ అనే జర్నల్‌లో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. విషం కారే సమయం వచ్చేదాకా బాగా గుజ్జుగా ఉంటుంది. కోరలు శరీరంలోకి దిగిన తర్వాత, విషం వాటి వెంట కిందకు జారుతుంది. పాము విషంగానీ, నాన్ న్యూటోనియన్ అనే ద్రవాల రకం కిందకు వస్తాయి.
విషాన్ని పీల్చే శక్తి ..
అంటే వాటి చిక్కదనం కదిలే వేగాన్నిబట్టి మారుతుందని అర్థం. కోరలు దిగకముందు విషం చాలా చిక్కగా ఉంటుంది. కదలదు కూడా. లేకుంటే విషం ఎప్పుడూ కోరల వెంట చుక్కచుక్కలుగా దిగుతూనే ఉంటుంది. కోరలు దిగి, విషంలో కదలిక మొదలయిన తర్వాత మాత్రం అది సులభంగా కారుతుంది. మరి గుజ్జుగా ఉండిన విషం కారడానికి ఒక కారణం కూడా ఉంది. కోరల్లో గాడి ఉంది. ఒంట్లో దిగబడినప్పుడు, ఆ గాడి గొట్టంలాగ మారుతుంది. అందులో విషాన్ని పీల్చే శక్తి పుడుతుంది.
విషం గాయంలోకి దిగుతుంది. పైగా విషంలో ఉపరితలంలో బిగువు బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ లక్షణం కారణంగా, విషం గాడిలో మాత్రమే ప్రవహిస్తుంది. వీటికి ఈ రకం బిగువు ఉన్నందుకే తేలికయిన పురుగులు, కాళ్ళు తడికాకుండా తేలుతుంటాయి.
సొలెనొడాన్..
విషాన్ని ఈ రకంగా శరీరంలోకి పంపించే పద్ధతి, మరికొన్ని రకాల పాకుడు జంతువులలో కూడా ఉంటుంది. సొలెనొడాన్ అనే క్షీరదం ఒకటి కరీబియన్ దీవులలో ఉంటుంది. దాని కోరలలో కూడా ఈ రకం ఏర్పాటు ఉంటుంది. పాములన్నింటిలోనూ ఇంచుమించు ఇదే పద్ధతి ఉంటుంది. రాటిల్ స్నేక్స్‌లో మాత్రం కోరలు బోలుగా ఉండి, సూదిమందు లా విషం శరీరంలోకి ఎక్కుతుంది.
పాముకాట్లు..
పాముల్లో చాలావాటికి విషం ఉండదు. త్రాచు, కట్లపాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్పజాతులతోనే ప్రమాదముంటుంది. అన్ని పాముకాట్లు ప్రమాదకరమైనవి కాకపోవచ్చు. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషం లేని, ప్రమాదంలేని మామూలు గాయాలే సాధారణచికిత్స తీసుకుంటే ఈ గాయాలు నయమవుతాయి.
షాక్ తోనే..
పాము విషంతో కన్నా చాలామంది షాక్ తోనే ప్రాణంమీదకి తెచ్చుకుంటారు. ఇంట్లోని వారు, ఇరుగుపొరుగు ధైర్యం చెప్పడానికి బదులు ఏడుపులు ప్రారంభిస్తే వీరు భయాందోళనలకు గురై పరిస్ధితి ప్రమాదకరంగా తయారవుతుంది. కాబట్టి అలా కాకుండా ఆ సమయంలో బాధితులకు ధైర్యాన్ని అందించగలగాలి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
