సాక్షి లైఫ్: ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) డాక్టర్లు అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. అత్యంత క్లిష్టమైన,అరుదైన కణితిని తొలగించారు. ఓ యువకుడి వృషణాల్లో అత్యంత అరుదైన,పెద్ద డంబెల్ ఆకారంలోని కణితిని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)కి చెందిన వైద్యనిపుణులు విజయవంతంగా తొలగించారు. ఇప్పటికే అతను కిడ్నీమార్పిడి చేయించుకుని, ఇమ్యునోసప్రెసెంట్ మందులు ఎక్కువ మోతాదులో వాడుతుండటంతో శస్త్రచికిత్స బాగా సంక్లిష్టంగా మారింది. దీంతో వైద్యులు శ్రమించి సులువుగా అరుదైన కణితిని తొలగించగలిగారు.
ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
పెద్ద కణితి..
ఆంధ్రప్రదేశ్‌లోని కడప నగరానికి చెందిన 39 ఏళ్ల వ్యక్తికి గతేడాది మూత్రపిండాలు పూర్తిగా విఫలం అయ్యాయి. దీంతో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ జరిగింది. అప్పటినుంచి అతను స్టెరాయిడ్లు, ఇమ్యునోసప్రెసెంట్లు వాడుతున్నాడు. ఇటీవల అతనికి ఎడమవైపు వృషణం వాపు వచ్చింది. దాన్ని సాధారణ హైడ్రోసిల్ అనుకున్నాడు. అయితే వాపు క్రమంగా పెరిగిపోతుండటంతో స్థానిక వైద్యుల సూచన మేరకు ఏఐఎన్‌యూలో పరీక్షించగా అతని ఎడమవైపు వృషణం నుంచి బొడ్డు మీదుగా ఉదరభాగం వరకు పెద్ద కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడి బీటా హెచ్‌సీజీ స్థాయి అసాధారణంగా పెరిగిపోయింది. ఇది సాధారణ స్థాయి కంటే 20 రెట్లు ఎక్కువగా ఉంది. అదృష్టవశాత్తు ఆ కణితి లక్షణాలు శరీరంలోని ఇతర భాగగాలు వేటికీ వ్యాపించలేదని పెట్ సీటీ స్కాన్‌లో నిర్ధారణ అయ్యింది.
ఈ రోగి ఇప్పటికే కిడ్నీ మార్పిడి చేయించుకుని, ఇమ్యునోసప్రెసెంట్ మందులు వాడుతుండటంతో కెమోథెరపీ, రేడియేషన్ లాంటి సంప్రదాయ చికిత్సలు ఏవీ పనిచేయవు. శస్త్రచికిత్స మాత్రమే చేయాలి. ముందుగా ఎనస్థీషియా, శస్త్రచికిత్స కోసం రోగిని సిద్ధం చేసిన తర్వాత.. రోగికి జనరల్ ఎనస్థీషియాలో ఒక సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు.
రాజేష్ కుమార్ రెడ్డి అడపాల నేతృత్వంలో..
కన్సల్టెంట్ యూరో-ఆంకాలజిస్టు డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి అడపాల నేతృత్వంలో డాక్టర్ దినేష్ సహకారంతో శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ నిత్యానంద, డాక్టర్ షిఫా నేతృత్వంలో ఎనస్థీషియా బృందంతో కలిసి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేయగలిగారు. రోగి కోలుకోవడంలో అత్యంత కీలకమైన ఆపరేషన్ తర్వాత నెఫ్రాలజీ సంరక్షణవిషయంలో డాక్టర్ శ్రీకాంత్ తనవంతుగా సేవలు అందించారు.
బాధితుడిని తొలుత ఐసీయూకి తరలించి, మూడోరోజు డిశ్చార్జి చేశారు. “వృషణాల్లో కణితులు యువకుల్లో సాధారణమే. కానీ అవి ఇంత పెద్ద పరిమాణంలో పెరిగి ఉదరభాగం వరకు వెళ్లడం మాత్రం చాలా అరుదు” అని డాక్టర్ అడపాల తెలిపారు. ఇతనికి గతంలో కిడ్నీ మార్పిడి కూడా ఏఐఎన్‌యూలోనే విజయవంతంగా జరిగింది. ఇప్పుడు మరో సంక్లిష్ట శస్త్రచికిత్స సైతం ఇక్కడే పూర్తయింది. తమ బృందం సాధించిన ఈ అసాధారణ విజయం పట్ల ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి. మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పీసీ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
శస్త్రచికిత్సలో భాగంగా..
శస్త్రచికిత్సలో భాగంగా సాధారణం కంటే కాస్త పెద్ద కోత పెట్టారు. ఎడమవైపు తొడ భాగం నుంచి ఉదర భాగానికి ఈ కోత పెట్టారు. తద్వారా లింఫ్‌నోడ్స్ వైపు ముప్పు విస్తరించకుండా జాగ్రత్త పడ్డారు. చుట్టుపక్కల ఉన్న మూత్రకోశం, ప్రధాన రక్తనాళాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అత్యంత జాగ్రత్తగా, విజయవంతంగా కణితిని తొలగించారు. దాదాపు 40 సెంటీమీటర్ల పొడవు, డంబెల్ ఆకారంలో ఉన్న ఈ కణితిని వీలైనంత తక్కువ రక్తస్రావంతో తొలగించారు వైద్యులు.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com