సాక్షి లైఫ్ : ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్‌కు చికిత్స అందించేందు కు రష్యాదేశం 'ఎంటెరోమిక్స్' అనే కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి, వైద్య ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధంగా ఉందని రష్యా ప్రకటించడంతో, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులలో కొత్త ఆశలు చిగురించాయి. అయితే, ఈ ఆవిష్కరణ నిజంగా ఒక శాస్త్రీయ అద్భుతమా లేదా కేవలం ప్రచారమా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటి అంటే..?
కోవిడ్-19 వ్యాక్సిన్‌ల మాదిరిగానే ఈ 'ఎంటెరోమిక్స్' కూడా mRNA టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీని ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రతి రోగికి వారి కణితి కణాల జన్యువుల ఆధారంగా వ్యక్తిగతంగా రూపొందించబడుతుంది. ఈ వ్యాక్సిన్ రోగి రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నాశనం చేసే శిక్షణ ఇస్తుంది. ప్రీ-క్లినికల్ ట్రయల్స్‌లో ఇది 100శాతం ప్రభావవంతంగా పనిచేసిందని, కణితి పెరుగుదలను గణనీయంగా తగ్గించిందని, అలాగే ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని రష్యా ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితి ఏమిటి..?
ఈ వ్యాక్సిన్ ప్రస్తుతానికి క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. మొదటి దశ ట్రయల్స్‌లో 48 మంది వాలంటీర్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ వ్యాక్సిన్‌ను మొదట పెద్దప్రేగు క్యాన్సర్ (కొలొరెక్టల్ క్యాన్సర్) చికిత్స కోసం లక్ష్యంగా చేసుకున్నారు. దీనితో పాటు మెదడు క్యాన్సర్ (గ్లియోబ్లాస్టోమా), కొన్ని రకాల చర్మ క్యాన్సర్‌లకు కూడా వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ట్రయల్స్ విజయవంతమైతే, రష్యా ప్రభుత్వం తమ పౌరులకు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని యోచిస్తోంది.