సాక్షి లైఫ్ : ఇపుడు భారీకాయులుగా వున్న బాల, బాలికలు యవ్వన దశలో డయాబెటిస్‌కి గురయ్యే ప్రమాదం వుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మన దేశం అనారోగ్య దేశమవుతుంది. యువత అనారోగ్యంతో ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి బాల్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం భారత దేశంలో గణాంకాల ప్రకారం కోటి నలభై లక్షల మందికిపైగానే చిన్నారులు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో షుగర్ వ్యాధితో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది.
హుషారుగా..
ఆరోగ్యంతో హుషారుగా వ్యవహరిస్తూ చక్కనిరూపం గల పిల్లల్ని చూస్తే ముద్దొస్తుంటుంది. కొంతమంది పిల్లలు బొద్దుగా కనిపిస్తారు. అలాంటి పిల్లల్ని చూసి తల్లిదండ్రులు సంతోష పడుతుంటారు. అయితే బొద్దుగా వుండటానికి, భారీకాయం అనిపించుకోవటానికి మధ్యనున్న తేడా తల్లిదండ్రులకు తెలియదు. వయసు, ఎత్తు పరిగణలోకి తీసుకుని ఇంత బరువు వుండాలని ఒక పట్టిక వైద్య బృందం తయారుచేసింది.
భారీకాయులు..
ఆ పరిమితిని దాటివుంటే ఓవర్‌వెయిట్ అంటారు. అలా కాకుండా అధికంగా కొవ్వు మాత్రమే పెరిగిపోయి, శరీర రూపం వికారంగా తయారైనవారిని భారీకాయులు అంటారు. బొద్దుగా వుండటానికి, బూదరవొళ్ళు రావటానికి వున్న తేడా ఇది.
తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు తక్కువగా, క్యాలరీలు అధికంగా వున్నప్పుడు, శారీరక శ్రమ లేనప్పుడు శరీరంలోకి అదనంగా చేరిన క్యాలరీలు కొవ్వులుగా పొట్ట దగ్గర ముందుగా పేరుకుంటాయి.
క్రమంగా శరీరమంతా..
క్రమంగా శరీరమంతా వ్యాప్తి చెంది భారీకాయంగా మారుతుంది. ప్రస్తుతం చిన్నారుల్లో కనిపిస్తున్న ఇబ్బంది ఇదే. భారీకాయపు పిల్లల్లో తక్షణం కనిపించే ఇబ్బందులు కొన్నయితే, దీర్ఘకాలంలో తలెత్తే ఇబ్బందులు మరికొన్ని. చిన్నతనంలోనే భారీకాయం వచ్చిందంటే, కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
బాల్యదశలోనే అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే దుస్థితి వస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం వుంది. ఈ దశలో రక్తంలో చక్కెరల స్థాయి అధికంగా వుండి డయాబెటిక్‌కి గురయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇంకా కీళ్ళ ఇబ్బందులు, సరిగా నిద్రలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
గుండె జబ్బులు, డయాబెటిస్, పక్షవాతం..
బాల్యంలో భారీకాయంలో వున్నవారు పెద్దయిన తర్వాత సన్నబడే అవకాశం బాగా తక్కువ. యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత కూడా భారీకాయం నిలిచివుంటే గుండె జబ్బులు, డయాబెటిస్, పక్షవాతం, ఎముకల బలహీనత లాంటివి వస్తాయి. భారీకాయంవలన అనేక ఇతర రోగాలు వచ్చే అవకాశం వుంటుందంటున్నారు పరిశోధకులు.
రెటినాయిడ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
గర్భాశయ సమస్యలు..
రొమ్ము కాన్సర్, గర్భాశయ సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ గ్రంథిలో మార్పులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణనాళ క్యాన్సర్, అండాశయ సమస్యలు వస్తాయి.
భారీకాయపు బాల్యం మానసిక సమస్యల్ని తెస్తుంది. చిన్నతనంలో భారీగా కనిపించేవారిని తోటివారంతా వింతగా చూస్తూ రకరకాల మాటలతో అవహేళన చేస్తుంటారు. స్కూలు స్థాయిలో స్నేహం చేసేందుకు ముందుకురారు.
చురుగ్గా ఉండలేదన్న కారణంగా ఆటల్లో కలుపుకోరు. దీనివలన ఒంటరిననే భావం ఏర్పడుతుంది. తమ రూపం మీద తమకే అసహ్యం వేస్తుంటుంది. మానసిక ఆందోళన పెంచుకుంటారు.
ఆలోచనలు శరీరంమీద వున్నందున చదువులో వెనకబడతారు. ఇటువంటి వారిని తోటివారు ఏడిపిస్తుంటారు. డిప్రెషన్‌కు గురై అధికంగా తిండి తింటారు. ఇలా ఒకదానిపై ప్రభావం మరొకదానిపై ఉంటుంది. భారీకాయం వంశపారంపర్య లక్షణాలు కూడా. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు వంటివి పరీక్షించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలుగుతారు.
తలిదండ్రులు పిల్లల ఆహారపు అలవాట్లు మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంటుంది. ఆరోగ్యానిచ్చే పోషక పదార్థాలకు ప్రాధాన్యత పెంచి, క్యాలరీలు అధికంగా ఇచ్చేవాటిని తగ్గించుకోవాలి. ఏవో కొన్ని ఆహార పదార్థాల్ని ఇష్టంగా తీసుకుని మిగిలినవాటిని కాదనకూడదు. బియ్యం, గోధుమలు మన ముఖ్య ఆహారం. దీంతోపాటు పప్పుదినుసులు అవసరం. పాలు, పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, అన్నం సమపాళ్ళలో తీసుకోవాలి.
అతిగా తినటంవల్ల శరీరం దెబ్బతింటుంది. జీర్ణక్రియ సామర్థ్యం తగ్గుతుంది. తిన్నది సరిగా ఒంటపట్టదు. ఫలితంగా క్యాలరీలు పేరుకుంటాయి. క్రమంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. అది మొదలైతే తగ్గడం చాలా కష్టం. కాబట్టి ట్రిమ్‌గా ఎదిగేలా పిల్లల్ని పెంచండి. ఆరోగ్యవంతమైన సంతానాన్ని సమాజానికి అందించాలి.
ఇది కూడా చదవండి..గర్భం దాల్చిన మొదటి మూడునెలలు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎందుకు వస్తుందో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఏ వయసువారిలో రక్తహీనత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com