Love Breakup : విచ్ఛిన్నమవుతున్న బంధాలు.. సైకాలజిస్టులు చెబుతున్న 5 కారణాలివే..!
సాక్షి లైఫ్ : ఫిబ్రవరి మాసం రాగానే ఎటుచూసినా ఎర్ర గులాబీలు, హృదయాకారపు బెలూన్లు, ప్రేమ సందేశాల సందడి కనిపిస్తుంది. అయితే, ఈ 'ప్రేమ వారోత్సవాల' (Valentine's Week) వేళ అందరి జీవితాల్లోనూ మధుర జ్ఞాపకాలు మిగలడం లేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రేమికుల రోజుకు ముందే అనేక జంటలు విడిపోతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. అసలు ఈ వసంత కాలంలో విరహ వేదన ఎందుకు మొదలవుతోంది? దీని వెనుక ఉన్న మానసిక కారణాలేంటి? నిపుణుల విశ్లేషణ మీకోసం..
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
అంచనాల భారమే కొంపముంచుతోంది..!
సినిమాలు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో వాలెంటైన్స్ డే అంటే ఏదో అద్భుతం జరిగిపోవాలని చాలామంది ఆశిస్తుంటారు. ఒక భాగస్వామి భారీ సర్ప్రైజ్ ఆశించడం, రెండో వ్యక్తి దానిని సాధారణ రోజులా చూడటం వల్ల ఇద్దరి మధ్య 'అంచనాల అంతరం' (Expectation Mismatch) ఏర్పడుతోంది. ఈ చిన్న అసంతృప్తి కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి బంధం తెగిపోయే వరకు వెళ్తోంది.
భవిష్యత్తుపై పరీక్ష (Litmus Test)..
వాలెంటైన్స్ డేను చాలామంది ఒక మైలురాయిలా భావిస్తారు. "ఈ వ్యక్తితో నేను జీవితాంతం ఉండగలనా?" అనే ప్రశ్న ఈ సమయంలోనే ఎక్కువగా ఉదయిస్తుంది. ఫిబ్రవరి 14న కలిసి ఉన్నారంటే ఆ బంధం చాలా సీరియస్ అని లోకం భావిస్తుంది. ఆ స్థాయి బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా లేని వారు, అబద్ధపు ప్రయాణం కంటే ముందే విడిపోవడమే మేలని నిర్ణయించుకుంటున్నారు.
సోషల్ మీడియా కారణంగా..
ప్రస్తుత కాలంలో ప్రేమ అనేది వ్యక్తిగతం కంటే ప్రదర్శన వస్తువుగా మారిపోయింది. పక్కవారి పార్టనర్ ఖరీదైన కానుకలు ఇచ్చారని లేదా విదేశీ ప్రయాణాలు చేశారనే విషయాలను సోషల్ మీడియా ప్లాట్ ఫాన్స్ లో చూడగానే.. తెలియకుండానే తమ భాగస్వామితో పోల్చుకోవడం మొదలవుతుంది. ఈ తులనాత్మక ధోరణి భాగస్వామిలోని మంచిని కాకుండా లోపాలనే ఎత్తిచూపేలా చేస్తోంది.
ఆర్థిక ఒత్తిడి,బడ్జెట్ తగాదాలు..
వినడానికి వింతగా ఉన్నా.. కానుకలు, విందు వినోదాల కోసం చేసే ఖర్చు కూడా బ్రేకప్స్‌కు కారణమవుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖరీదైన వేడుకలు జరపాలని ఒత్తిడి చేయడం వల్ల మనస్పర్థలు వస్తున్నాయి. కేవలం ఒక రోజు ప్రహసనం కోసం అప్పులు చేయలేక, ఆ గొడవలు భరించలేక కొందరు బంధానికి స్వస్తి పలుకుతున్నారు.
ప్రవర్తనలో మార్పులు,రెడ్ ఫ్లాగ్స్..
పండగలు లేదా ప్రత్యేక రోజులు దగ్గరపడినప్పుడు మనం ఎదుటివారి ప్రవర్తనను అతి సూక్ష్మంగా గమనిస్తాం. భాగస్వామి ఈ ప్రత్యేక రోజు కోసం కనీస ప్రయత్నం కూడా చేయడం లేదని అనిపించినప్పుడు.. "నాపై వారికి ప్రేమ తగ్గిపోయింది" అనే భావన బలపడుతుంది. ఆ భావోద్వేగ దూరం (Emotional Disconnect) చివరకు విడిపోయేలా ప్రేరేపిస్తుంది. బంధం బలపడాలన్నా, బలహీనపడాలన్నా దానికి పునాది ఒకరోజు వేడుక కాదు.. నిరంతరం ఉండే అవగాహన. అంచనాలను తగ్గించుకుని, వాస్తవాలకు దగ్గరగా ఉంటేనే ఏ బంధమైనా నిలబడుతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
