Doorway Effect : గదిలోకి వెళ్లాక ఎందుకు వచ్చామో మర్చిపోతున్నారా..? దీని వెనుక ఉన్న ‘డోర్‌వే ఎఫెక్ట్’ ఏంటో తెలుసుకోండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఏదో వస్తువు తెచ్చుకుందామని వంటింట్లోకో, బెడ్‌రూమ్‌లోకో వెళ్తాం.. తీరా అక్కడికి వెళ్లాక 'అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను?' అని తల గీక్కుంటాం. ఫ్రిజ్ డోర్ తెరిచి.. అందులోంచి ఏం తీసుకోవాలో తెలియక కాసేపు అలాగే ఉండిపోతాం. మనలో చాలా మందికి నిత్యజీవితంలో ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. దీనిని ఏదో మతిమరుపు వ్యాధి అనుకుంటే పొరపాటే. శాస్త్రవేత్తలు దీనిని ఒక విచిత్రమైన మానసిక ప్రక్రియగా చెబుతున్నారు. సైకాలజీ భాషలో దీనినే ‘డోర్‌వే ఎఫెక్ట్’ (Doorway Effect) అంటారు.

చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

ప్రస్తుత వేగవంతమైన జీవనశైలి, మల్టీటాస్కింగ్ కారణంగా ఈ పరిస్థితి ఎక్కువవుతోంది. అసలు మెదడులో జరిగే ఈ వింత మార్పు ఏంటి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో చదివి తెలుసుకుందాం..

‘డోర్‌వే ఎఫెక్ట్’ అంటే ఏమిటి..?

ఒక వ్యక్తి ఒక గది లేదా ఒక వాతావరణం నుంచి మరో ప్రదేశంలోకి ప్రవేశించినప్పుడు.. అంతకుముందు మనసులో ఉన్న ఆలోచన లేదా చేయాలనుకున్న పనిని అకస్మాత్తుగా మర్చిపోవడాన్ని ‘డోర్‌వే ఎఫెక్ట్’ అంటారు. అంటే, మనం ఒక తలుపు దాటి అవతలికి వెళ్లగానే మెదడు తాత్కాలికంగా పాత సమాచారాన్ని పక్కన పెడుతుంది.

మెదడులో ఏం జరుగుతుంది..?

పరిశోధకుల ప్రకారం.. మన మెదడు సమాచారాన్ని నిరంతరం అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే పలు కారణాల వల్ల ఈ తాత్కాలిక మతిమరుపు వస్తుంది.

వాతావరణ మార్పు (Location Update)..మనం ఒక గది నుంచి మరో గదిలోకి వెళ్లినప్పుడు, మెదడు ఆ మార్పును ఒక కొత్త అధ్యాయంగా లేదా కొత్త సందర్భం (New Event)గా గుర్తిస్తుంది. కొత్త వాతావరణానికి అనుగుణంగా మారే క్రమంలో, పాత గదిలో అనుకున్న విషయాలను మెదడు తాత్కాలికంగా వెనుక సీట్లోకి నెట్టేస్తుంది.

వర్కింగ్ మెమరీపై ఒత్తిడి..మన మెదడులోని 'వర్కింగ్ మెమరీ' సమాచారాన్ని కొద్దిసేపు మాత్రమే దాచుకోగలదు. మనం ఒకేసారి నాలుగైదు విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఈ తాత్కాలిక జ్ఞాపకశక్తి వ్యవస్థపై భారం పడి చిన్న చిన్న విషయాలు మర్చిపోతాం.

పరధ్యానం (Distraction).. ఒక గది దాటి ఇంకో గదిలోకి వెళ్లే లోపు అక్కడ కనిపించే వస్తువులు, వినిపించే శబ్దాలు లేదా ఫోన్ నోటిఫికేషన్లు మన దృష్టిని మళ్లిస్తాయి. ఈ ఆకస్మిక పరధ్యానం వల్ల అసలు పని మరుగన పడుతుంది.

మల్టీటాస్కింగ్.. ఒకే సమయంలో ఫోన్ మాట్లాడుతూ, మరో పని చేస్తూ, ఇంకేదో ఆలోచించే అలవాటు ఉన్నవారిలో ఏకాగ్రత లోపిస్తుంది. దీనివల్ల డోర్‌వే ఎఫెక్ట్ మరింత ఎక్కువగా కనిపిస్తుంది.

ఇది ఏమైనా తీవ్రమైన జబ్బా..?

 డోర్‌వే ఎఫెక్ట్ అనేది ఏ రకమైన మానసిక వ్యాధి లేదా అల్జీమర్స్ వంటి తీవ్రమైన సమస్య కాదు. ఇది మెదడు పనితీరులో భాగమైన ఒక సహజమైన ప్రక్రియ మాత్రమే. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇది ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటుంది.

దీని నుంచి బయటపడటం ఎలా..?

స్పష్టమైన ఆలోచన: ఒక గది నుంచి మరో గదికి వెళ్లేటప్పుడు.. మీరు ఏ పని మీద వెళ్తున్నారో ఆ వస్తువును లేదా పనిని మనసులో గట్టిగా అనుకుంటూ వెళ్లండి. ఒకేసారి పది పనులు చేయడం కాకుండా, ప్రస్తుత క్షణంలో చేసే పనిపైనే పూర్తి ఏకాగ్రత ఉంచడం అలవాటు చేసుకోండి. ఒకవేళ గదిలోకి వెళ్లాక పని మర్చిపోతే.. మళ్లీ పాత స్థానానికి అంతకుముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్తే ఆ ఆలోచన తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఈ మతిమరుపు రోజువారీ ముఖ్యమైన పనులను సైతం తీవ్రంగా దెబ్బతీస్తూ, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు సృష్టిస్తుంటే మాత్రం ఒకసారి నిపుణులైన వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.