Sleep Debt Blindness : 'స్లీప్ డెట్ బ్లైండ్‌నెస్' అంటే ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : "నాకు రోజుకు ఐదు గంటల నిద్ర చాలు.. నేను చాలా యాక్టివ్‌గా ఉంటాను" అని స్నేహితుల దగ్గరో, ఆఫీసులోనో కొందరు గర్వంగా చెబుతుంటారు. తక్కువ నిద్రపోవడాన్ని ఒక గొప్ప విషయంగా లేదా తమకున్న ప్రత్యేక శక్తిగా భావిస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఇదే బాటలో ఉంటే.. నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్న చేదు నిజాన్ని  తప్పకుండా తెలుసుకోవాల్సిందే..! ఐదు గంటల నిద్ర మీ మెదడును, శరీరాన్ని లోపల నుంచి ఎలా గుల్ల చేస్తోందో న్యూరోలజిస్ట్ లు వెల్లడించిన వివరాల ఆధారంగా ప్రత్యేక కథనం మీకోసం..

ఇది కూడా చదవండి..సడెన్ గా డైట్ చేంజ్ చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి..? 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

నిద్ర అంటే 'స్విచ్ ఆఫ్' కావడం కాదు..!

మనం పడుకున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుంది కానీ, మెదడు మాత్రం 'ఓవర్‌టైమ్' పనిచేస్తుంటుంది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడు పలు కీలక పనులను పూర్తి చేస్తుంది.

రోజంతా సేకరించిన సమాచారాన్ని, జ్ఞాపకాలను మెదడులో భద్రపరుస్తుంది.

నాడీ కణాల (Nerve Cells) మరమ్మతులు చేపడుతుంది.

మెదడులోని హానికరమైన వ్యర్థాలను, విషపదార్థాలను శుభ్రం చేస్తుంది.

హార్మోన్ల సమతుల్యతను కాపాడి, మానసిక భావోద్వేగాలను స్థిరపరుస్తుంది.

'స్లీప్ డెట్ బ్లైండ్‌నెస్' అంటే ..?

రోజుకు కేవలం 5 గంటలే నిద్రపోవడం అలవాటుగా మారినప్పుడు, మెదడు ఆ తీవ్ర అలసటకు అలవాటు పడిపోతుంది. దీనివల్ల మనం అంతా బానే ఉన్నాం, సక్రమంగానే పనిచేస్తున్నాం అనే భ్రమలో ఉంటాం. కానీ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. ఆ సమయంలో మన పనితీరు, ఏకాగ్రత చాలా దారుణంగా పడిపోతాయి. వైద్య పరిభాషలో ఈ ప్రమాదకరమైన సమస్యను 'స్లీప్ డెట్ బ్లైండ్‌నెస్' (Sleep Debt Blindness) అని పిలుస్తారు.

తక్కువ నిద్రతో పొంచి ఉన్న ముప్పులు..

జ్ఞాపకశక్తి క్షీణత..గాఢ నిద్ర లేకపోతే కొత్త విషయాలను నేర్చుకోవడం, వాటిని గుర్తుంచుకోవడం మెదడుకు కష్టంగా మారుతుంది. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వైద్యులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి.

భావోద్వేగాల అసమతుల్యత.. నిద్ర కరువైతే చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం, ఆందోళనకు గురికావడం, తీవ్రమైన ఒత్తిడిని అనుభవించడం జరుగుతుంది.

ప్రాణాంతక వ్యాధులకు దారి..

 దీర్ఘకాలికంగా నిద్ర తగ్గడం వల్ల హైబీపీ, ఊబకాయం, టైప్-2 మధుమేహం, స్ట్రోక్ (పక్షవాతం), గుండె జబ్బులు మరియు మతిమరుపు (dementia) వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి పతనం..

 నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. దీనివల్ల తరచూ అనారోగ్యానికి గురికావడం, వ్యాక్సిన్లు సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

రహదారి ప్రమాదాలు..

ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోయి వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనం నడపడంతో సమానమని పరిశోధనలు చెబుతున్నాయి. డ్రైవింగ్ సమయంలో కొన్ని సెకన్ల పాటు వచ్చే 'మైక్రోస్లీప్' అంటే కునుకు ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతుంది.

ప్రశాంతమైన నిద్ర కోసం శాస్త్రీయ చిట్కాలు..

సమయపాలన..

ప్రతిరోజూ పడుకునే సమయాన్ని, ఉదయం నిద్ర లేచే సమయాన్ని ఒకేలా ఉంచుకోవాలి. ఆదివారం కూడా ఈ నియమాన్ని మార్చకూడదు.

సూర్యరశ్మి..

 ఉదయం నిద్ర లేచిన తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు తాజా ఎండ తగిలేలా చూసుకోవాలి. ఇది నిద్ర చక్రాన్ని (Circadian Rhythm) క్రమబద్ధీకరిస్తుంది.

కెఫిన్‌కు దూరం..

పడుకునే సమయానికి కనీసం 8 గంటల ముందే కాఫీ, టీలు తాగడం ఆపేయాలి. అలాగే రాత్రి పూట ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

డిజిటల్ డిటాక్స్..

పడుకోవడానికి గంట ముందే మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, టీవీ స్క్రీన్లను పూర్తిగా కట్టేయాలి.

బెడ్‌రూమ్ వాతావరణం..

 పడకగది ప్రశాంతంగా, చీకటిగా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. మంచాన్ని కేవలం నిద్రపోవడానికి మాత్రమే ఉపయోగించాలి; అక్కడ కూర్చుని ఆఫీస్ పనులు చేయడం, సోషల్ మీడియా చూడటం వంటివి చేయకూడదు.

తేలికపాటి ఆహారం.. రాత్రి వేళల్లో పడుకోవడానికి 2 నుంచి 3 గంటల ముందే తేలికపాటి భోజనం ముగించాలి. నిద్రను తగ్గించుకుని పగలు కష్టపడటం గొప్పతనం కాదు. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అనేది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యంత అవసరమని గుర్తించండి.

 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.