నిద్రలేమితో గుండెకు రిస్క్ తప్పదా..? పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే..?
సాక్షి లైఫ్: జీవనశైలి కారణంగా అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు జనాలు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే పలువురు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
అయితే నిద్రవేళల్లో కొన్ని మార్పులు చేసుకుంటే హార్ట్ రిస్క్ తగ్గుతుందని యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇంతకీ ఏ సమయంలో నిద్రించాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా 80శాతం కంటే ఎక్కువ గుండె జబ్బులను నివారించవచ్చని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఐతే పొగతాగకుండా ఉండడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వారిలో గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. ఈ రీసెర్చ్‌లో భాగంగా సుమారు 88వేల మందిని పరిశీలించారు. ఇందులో 60శాతం మంది మహిళలు పాల్గొన్నారు. ఐతే వీరు 61ఏళ్లు వయసు ఉన్నవారే. వీరిలోరాత్రి 10-11 గంటల లోపు నిద్రపోయే వారిలో హార్ట్ రిస్క్ తక్కువగా ఉందని వెల్లడైంది.
అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోయిన వారిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం సుమారు 24శాతం ఎక్కువగా ఉంది. అందుకే రాత్రిళ్లు త్వరగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ సుమారు 7 గంటల నుంచి 8గంటలకు తగ్గకుండా, రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం మరింత మంచిదంటున్నారు పరిశోధకులు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
