Anemia During Pregnancy : గర్భిణుల్లో రక్తహీనత కేవలం నీరసమే కాదు.. శిశువు ప్రాణానికే ముప్పు..!
సాక్షి లైఫ్ : మహిళలు సాధారణంగా ఇంటి బాధ్యతల్లో పడి తమ ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేస్తుంటారు. పోషకాహార లోపం, నెలసరి సమస్యల వల్ల చాలా మందిలో రక్తహీనత (Anemia) సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే, గర్భధారణ సమయంలో ఈ సమస్యను తేలికగా తీసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇది గర్భస్థ శిశువు మరణానికి దారితీయవచ్చని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది.'ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా' జర్నల్‌లో ప్రచురితమైన ఓ నివేదిక గర్భిణుల్లో రక్తహీనత వల్ల కలిగే ముప్పును గురించి వెల్లడించింది.
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
అధ్యయనంలో తేలిన ప్రధాన అంశాలు..
పెరుగుతున్న స్టిల్‌బర్త్ ప్రమాదం..
భారతదేశంలో గర్భధారణ సమయంలో ఎప్పుడైనా మోస్తరు నుంచి తీవ్రమైన రక్తహీనతకు గురైన మహిళల్లో.. 28 వారాల తర్వాత మృత శిశువు జననం (the risk of stillbirth) ముప్పు 27 శాతం వరకు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
29వ వారంలోనే ముప్పు..
సాధారణ ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న గర్భిణుల్లో శిశు మరణాల ప్రమాదం 31వ వారం చుట్టుపక్కల పొంచి ఉంటే.. అదే తీవ్రమైన రక్తహీనతతో బాధపడే మహిళల్లో ఈ ముప్పు 29వ వారంలోనే ఎదురయ్యే అవకాశం ఉందని అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
డేటా విశ్లేషణ..
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ బెంగళూరు పరిశోధకులు సంయుక్తంగా ఐసీఎంఆర్ (ICMR) కు చెందిన గణాంకాలను విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించారు.
రక్తహీనత (Anemia) అంటే ఏమిటి..?
శరీరంలో ఎర్ర రక్త కణాలు (Red Blood Cells) తగ్గిపోవడం లేదా హీమోగ్లోబిన్ స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉండటాన్ని రక్తహీనత అంటారు. గర్భధారణ సమయంలో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తల్లి శరీరం నుంచి అదనపు రక్తం, ఆక్సిజన్ అవసరం అవుతాయి. తగినంత ఐరన్ లేకపోవడం వల్ల రక్తహీనత తలెత్తుతుంది.
నివారణా చర్యలు..
గర్భిణుల్లో రక్తహీనత అనేది ముందుగానే గుర్తించి చికిత్స చేయగల సమస్య అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కచ్చితమైన వ్యూహాలతో దీనిని నివారించవచ్చు.సమతుల్య ఆహారం.. ఐరన్ అధికంగా ఉండే ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, మొలకలు, మాంసాహారం వంటివి రోజూవారీ డైట్‌లో చేర్చుకోవాలి. ఐరన్ సప్లిమెంట్లు..వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడాలి. క్రమం తప్పని చెకప్‌లు.. తరచూ రక్త పరీక్షలు చేయించుకుంటూ హీమోగ్లోబిన్ స్థాయిలను పర్యవేక్షించుకోవాలి.
విటమిన్ సి.. ఐరన్ వంటబట్టాలంటే విటమిన్ సి ఎంతో అవసరం. నిమ్మ, ఉసిరి, జామ వంటి పండ్లను తీసుకోవాలి. గర్భధారణ సమయంలో చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కూడా శిశువు ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది. తగిన జాగ్రత్తలు, మెరుగైన వైద్య విధానాల ద్వారా ఈ ముప్పును సులభంగా అధిగమించవచ్చు.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
