Fatigue a Sign of Cancer : అలసటే క్యాన్సర్‌కు సంకేతమా..? వైద్యనిపుణులు ఏమంటున్నారంటే..?
సాక్షి లైఫ్ : రోజువారీ జీవితంలో నలిగిపోతూ, నిద్ర సరిగా లేక అలసటగా అనిపించడం చాలా మందికి మామూలు విషయమే. ముఖ్యంగా ఉద్యోగం చేసే తల్లులకు ఇది కొత్తేమీ కాదు. కానీ కొన్నిసార్లు ఈ సాధారణ అలసటే శరీరంలో పెద్ద ముప్పు దాగుందని హెచ్చరించే మొదటి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. యూకేకు చెందిన 38 ఏళ్ల ఒక మహిళ ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఇద్దరు చిన్నారుల తల్లి అయిన ఆమె, నిద్రలేమి వల్లే తనకు నిత్యం అలసటగా ఉంటుందని అనుకుంది. అరుదైన రక్త వర్గం కలిగిన ఆమె తరచూ రక్తదానం చేస్తుండేది. ఓసారి రక్తదానానికి వెళ్ళినప్పుడు, పరీక్షల్లో ఆమెలో ఐరన్ లోపం ఉన్నట్టు తేలడంతో సిబ్బంది రక్తం తీసుకోకుండా వెనక్కి పంపారు.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు..
సాధారణంగా మహిళల్లో నెలసరి కారణంగా ఐరన్ లోపం రావడం చాలా సాధారణమైన విషయమే. అయితే ఆమె విషయంలో పరిస్థితి వేరుగా ఉంది. కుటుంబ వైద్యుడిని సంప్రదించినప్పుడు, మలంలో దాగి ఉన్న రక్తాన్ని గుర్తించే FIT పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఫలితాలు వచ్చేసరికి, మలంలో రక్తం మోతాదు సాధారణ స్థాయి కంటే గణనీయంగా ఎక్కువగా కనిపించింది.
తదుపరి పరీక్షల్లో ఆమెకు మూడో దశ పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కడుపు నొప్పి గానీ, మలంలో కంటికి కనిపించే రక్తం గానీ, మరే ఇతర లక్షణాలు గానీ లేకుండా, కేవలం అలసట మాత్రమే ఆమెలో కనిపించిన సంకేతం. వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కణితిని, పేగులోని కొంత భాగాన్ని తొలగించి, తర్వాత 12 వారాల పాటు కీమోథెరపీ చేశారు. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా, క్యాన్సర్ రహితంగా ఉంది.
నిర్లక్ష్యం వద్దంటున్న నిపుణులు..
ఐరన్ లోపం, పెద్దప్రేగు క్యాన్సర్‌కు తొలి సూచన కావొచ్చనే విషయం చాలా మందికి తెలియదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ రక్త పరీక్ష కంటే, శరీరంలో నిల్వ ఉన్న ఐరన్ పరిమాణాన్ని కచ్చితంగా చూపే ఫెర్రిటిన్ పరీక్ష మరింత విశ్వసనీయమైనదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొన్నిసార్లు సాధారణ రక్త పరీక్షలో ఐరన్ స్థాయి మామూలుగానే కనిపించినా, లోపల నిల్వలు క్షీణించి ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఫెర్రిటిన్ పరీక్ష ద్వారానే అసలు పరిస్థితి బయటపడుతుంది.
యువతలోనూ పెరుగుతున్న ముప్పు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, పెద్దప్రేగు క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మూడో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా, క్యాన్సర్ మరణాలకు రెండో ప్రధాన కారణంగా నిలుస్తోంది. 2022 సంవత్సరంలోనే సుమారు 19 లక్షల కొత్త కేసులు నమోదవగా, 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు సంస్థ తెలిపింది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, గతంలో వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు 50 ఏళ్లలోపు వారిలో, చివరకు 30 ఏళ్లలోపు యువతలో సైతం వేగంగా పెరుగుతోంది.
మలబద్ధకం లేదా నీళ్ల విరేచనాలు, మలంలో రక్తం కనిపించడం, కారణం లేకుండా బరువు తగ్గడం, దీర్ఘకాలిక ఐరన్ లోపం వంటివి పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే వైద్యులను సంప్రదించడం మేలని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
