ICMR Report : గుండె పదిలమేనా..? భారతీయులను భయపెడుతున్న ఐసీఎంఆర్ నివేదిక..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుండె జబ్బులు కేవలం వయసు పైబడిన వారికే వస్తాయనుకుంటే పొరపాటే. లావుగా ఉన్నవారు, మధుమేహం ఉన్నవారికే కాదు.. పైకి ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా కనిపించే యువతకు కూడా గుండెపోటు ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. భారతీయుల్లో కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు సమస్యలు చాపకింద నీరులా విస్తరిస్తూ గుండెను ప్రమాదంలో పడేస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

ఆందోళన కలిగిస్తున్న ఐసీఎంఆర్ గణాంకాలు..

'జర్నల్ ఆఫ్ క్లినికల్ లిపిడాలజీ'లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా 23,665 మందిని పరీక్షించారు. ఇందులో వెల్లడైన దిగ్భ్రాంతికరమైన విషయాలు:

అసాధారణ కొవ్వు స్థాయిలు..

 దేశంలోని సుమారు దాదాపు 87.3శాతం వయోజనుల రక్తంలో కనీసం ఒక రకమైన కొవ్వు స్థాయి అసాధారణంగా ఉన్నట్లు తేలింది. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని 'డైస్లిపిడెమియా' అంటారు.

లక్షణాలు శూన్యం..

ఈ కొలెస్ట్రాల్ సమస్యకు ఎటువంటి ప్రారంభ లక్షణాలు, నొప్పులు ఉండవు. కానీ కాలక్రమేణా రక్తనాళాల్లో చెడు కొవ్వు పేరుకుపోయి ఒక్కసారిగా ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది.

అపోహలు వద్దు..

 బరువు సక్రమంగా ఉన్నంత మాత్రాన గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. కేవలం మధుమేహం, ఊబకాయం ఉన్నవారే కాకుండా.. సన్నగా ఉన్నవారు కూడా క్రమం తప్పకుండా 'లిపిడ్ ప్రొఫైల్' పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

చాపకింద నీరులా 'అధిక రక్తపోటు' (Hypertension)..


భారతీయులను వేధిస్తున్న మరో ప్రధాన నిశ్శబ్ద మహమ్మారి అధిక రక్తపోటు. కొలెస్ట్రాల్‌కు బీపీ తోడైతే గుండెకు ప్రమాదం మరింత పెరుగుతుంది. దేశంలో ప్రతి నలుగురు వయోజనుల్లో ఒకరు అంటే దాదాపు 31.5 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, వీరిలో సుమారు 60 నుంచి 70 శాతం మందికి అసలు తమకు బీపీ ఉందన్న విషయమే తెలియదు. ఇది కేవలం వృద్ధులకే పరిమితం కాలేదు, 30 ఏళ్లలోపు యువతలోనూ ఈ ముప్పు వేగంగా పెరుగుతోంది.

కొలెస్ట్రాల్ సమస్యలు..

రక్తంలో వివిధ రకాల కొవ్వుల అసమతుల్యత కారణంగా భారతీయుల గుండెకు తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. ప్రధానంగా శరీరానికి మేలు చేసే హెచ్‌డీఎల్ (good cholesterol) స్థాయిలు మన దేశంలో అత్యంత తక్కువగా నమోదవుతున్నాయి. సగటున ప్రతి ముగ్గురు వయోజనుల్లో ఇద్దరికి ఈ మంచి కొలెస్ట్రాల్ లోపం ఉన్నట్లు తేలింది. దీనివల్ల రక్తనాళాలను శుభ్రపరిచి, గుండెను ముప్పు నుంచి రక్షించే సహజ సామర్థ్యం శరీరంలో బాగా సన్నగిల్లుతోంది.

మరోవైపు, గుండెకు హాని చేసే ఎల్‌డీఎల్ (bad cholesterol) స్థాయిలు మాత్రం భారతీయుల్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ చెడు కొవ్వు నిరంతరం పేరుకుపోవడం వల్ల రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి, అవి క్రమంగా ఇరుకుగా మారి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తున్నాయి.

వీటికి తోడు రక్తంలో ఉండే మరో రకమైన కొవ్వు పదార్థాలైన ట్రైగ్లిజరైడ్స్ కూడా చాలా మందిలో సాధారణం కంటే అధిక మోతాదులో ఉంటున్నాయి. ఒకవైపు మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోవడం, మరోవైపు చెడు కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ అసాధారణంగా పెరిగిపోతుండటం వల్ల భారతీయుల్లో ఆకస్మిక గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఏకంగా రెట్టింపు అవుతోంది.

ప్రధాన కారణాలివే..

ఈ రెండు మహమ్మారులు పెరగడానికి ఆధునిక జీవనశైలే ప్రధాన కారణం. ముఖ్యంగా గంటల తరబడి ఒకేచోట కదలకుండా కూర్చోవడం ,శారీరక శ్రమ లేకపోవడం. జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు. తగినంత నిద్ర లేకపోవడం, నిరంతర మానసిక ఒత్తిడి.

దాగి ఉన్న అధిక రక్తపోటుకు తోడు రక్తంలో లిపిడ్ ప్రొఫైల్ దెబ్బతినడం గుండె ఆరోగ్యానికి తీవ్ర ముప్పు తెస్తుంది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణం. చిన్న వయసు నుంచే వీటిని గుర్తించి నియంత్రించుకోకపోతే భవిష్యత్తులో భారత జనాభాపై గుండె జబ్బుల భారం ఊహించని స్థాయిలో పెరుగుతుందని ప్రముఖ హృద్రోగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు.. 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.