Testosterone : టెస్టోస్టిరాన్ లోపానికి మీరు రోజూ తినే ఆహారమే కారణమా..? ఫిన్లాండ్ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
సాక్షి లైఫ్ : మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోతే బాడీ ఫిట్నెస్ తగ్గడమేకాకుండా పలురకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడంలో హార్మోన్ల పాత్ర అత్యంత కీలకం. ఇవి శరీరంలోని అవయవాలకు, కణాలకు ఎప్పుడు ఏం చేయాలో సూచించే 'కెమికల్ మెసెంజర్లు'గా పనిచేస్తాయి. పురుషుల ఆరోగ్యం అనగానే ప్రధానంగా వినిపించే హార్మోన్ 'టెస్టోస్టిరాన్' (Testosterone). వయసు పెరిగే కొద్దీ ఈ హార్మోన్ స్థాయిలు తగ్గడం సహజమే అయినప్పటికీ, మనం ఆరోగ్యకరం అనుకుని రోజూ తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా దీనిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఫిన్లాండ్ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ పరిశోధకులు 42 నుంచి 60 ఏళ్ల వయసున్న 2,546 మంది పురుషులపై ఒక సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. వారు తీసుకునే ప్రొటీన్ మూలాలు అంటే జంతు సంబంధిత, మొక్కల ఆధారంగా వారిని నాలుగు గ్రూపులుగా విభజించి విశ్లేషించారు. పరిశోధనలో తేలిన ప్రధాన అంశం ఏమిటంటే.. మాంసం, డెయిరీ ఉత్పత్తుల ద్వారా అత్యధికంగా ప్రొటీన్ పొందే పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ముఖ్యంగా ఫెర్మెంటెడ్ డెయిరీ ఉత్పత్తులైన పెరుగు, చీజ్ లాంటివి ఎక్కువగా తీసుకునే వారిలో ఈ హార్మోన్ స్థాయిలు మరింత తక్కువగా ఉన్నట్లు తేలింది. వీటికి భిన్నంగా.. పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, నట్స్, సీడ్స్ లాంటి మొక్కల ఆధారిత ప్రొటీన్ (plant-based proteins)ఎక్కువగా తీసుకునే వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు మెరుగ్గా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
టెస్టోస్టిరాన్ ఎందుకు అంత కీలకం..?
ఇది కేవలం లైంగిక సామర్థ్యానికే పరిమితమైన హార్మోన్ కాదు. శరీరంలోని అనేక ముఖ్యమైన విధులను ఇది నియంత్రిస్తుంది. కండరాల పుష్టికి, ఎముకల దృఢత్వానికి ఇది ఎంతో అవసరం. శరీరంలో శక్తి (energy) స్థాయిలను స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేసే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఈ హార్మోన్ తోడ్పడుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతు లైన వయోజనుల్లో దీని స్థాయి లీటరుకు 10 నుంచి 30 నానోమోల్స్ (nmol/L) మధ్య ఉంటుంది.
30 ఏళ్లు దాటిన తర్వాత పురుషుల్లో ప్రతి ఏడాదీ సగటున 1 శాతం చొప్పున దీని ఉత్పత్తి పడిపోతుంటుంది. ఊబకాయం, టైప్-2 మధుమేహం లాంటివి ఈ లోపాన్ని మరింత వేగవంతం చేస్తాయి.
ప్రొటీన్ మూలాల ప్రభావం ఎందుకిలా..?
శాకాహారం, మాంసాహార ప్రొటీన్ల మధ్య ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందనే దానిపై పరిశోధకులు కొన్ని కారణాలను అంచనా వేశారు. మొక్కల ఆధారిత ప్రొటీన్ తీసుకునే వారి ఆహారంలో ఫైబర్ (fiber), ఆరోగ్యకరమైన అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్(unsaturated fats) ఎక్కువగా ఉంటాయి. అదే జంతు సంబంధిత ప్రొటీన్ తీసుకునే వారిలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ (saturated fats), కొలెస్ట్రాల్ మోతాదులు అధికంగా ఉంటాయి.
ఈ కొవ్వుల కారణంగా శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడం, ఇన్సులిన్ పనితీరు మందగించడం లాంటివి టెస్టోస్టిరాన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి, పురుషులు తమ దైనందిన ఆహారంలో జంతు సంబంధిత ప్రొటీన్ల కన్నా.. పప్పులు, గింజలు, కూరగాయల ద్వారా వచ్చే ప్రొటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ అధ్యయనం సూచిస్తోంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
