Smoking for Fashion : ఫ్యాషన్ కోసం సిగరెట్ కాలుస్తున్నారా..? గుండె, ఊపిరితిత్తులకు పెను ముప్పు తప్పదు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.. నేటి యువతలో చాలామంది ఫ్యాషన్ కోసం, స్టైల్ కోసం లేదా ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం అంటూ సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటు క్రమంగా ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

చిన్న వయసులోనే వ్యసనంగా..

'గ్లోబల్ యూత్ టొబాకో సర్వే' (GYTS-4, 2019) నివేదిక ప్రకారం, మన దేశంలో 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థుల్లో దాదాపు 8.5 శాతం మంది ఏదో ఒక రూపంలో పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతున్నారు. సిగరెట్‌లో ఉండే 'నికోటిన్' మెదడుపై తీవ్ర ప్రభావం చూపి, దానిని మానుకోలేని వ్యసనంగా మారుస్తుంది. సమయానికి సిగరెట్ దొరకకపోతే చికాకు రావడం, ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. ఇది యువత చదువు, కెరీర్, రోజువారీ జీవనశైలిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

గుండె, శ్వాసకోశ వ్యవస్థల కుంగుబాటు..

ప్రపంచవ్యాప్తంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల ముప్పు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ధూమపానం ఆ ప్రమాదాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. చిన్న వయసులో స్మోకింగ్ ప్రారంభించడం వల్ల ఊపిరితిత్తుల ఎదుగుదల, పనితీరు దెబ్బతింటుంది. నిరంతరం పొగతాగడం వల్ల క్రానిక్ బ్రాంకైటిస్, సీవోపీడీ (COPD) వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 


సిగరెట్ పొగ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. రక్తంలో గడ్డలు ఏర్పడే ప్రమాదాన్ని పెంచి, చిన్న వయసులోనే గుండెపోటు (heart attacks), పక్షవాతం (stroke) వంటి ముప్పును తీసుకువస్తుంది. పొగాకు పొగలో క్యాన్సర్ కారక రసాయనాలు అనేకం ఉంటాయి. దీర్ఘకాలం పాటు ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తులు, నోరు, గొంతు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

అప్పుడప్పుడు తాగినా అనర్థమే..!

స్నేహితుల బలవంతం వల్లనో, ఆఫీసులో వర్క్ బ్రేక్ సమయంలోనో అప్పుడప్పుడు ఒకటి, రెండు సిగరెట్లు తాగితే ఏమీ కాదులే అనుకోవడం పెద్ద పొరపాటు. ఆ అప్పుడప్పుడు తాగే అలవాటే నిదానంగా రోజువారీ వ్యసనంగా మారుతుంది. అయితే, ఈ వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఎప్పుడూ మించిపోలేదు. ఏ వయసులో సిగరెట్ మానేసినా, భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య ముప్పులను సగానికి పైగా తగ్గించుకోవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని మానుకోవడానికి అవసరమైతే వైద్యుల కౌన్సెలింగ్, చికిత్స తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.