Latest Research : వీడిన కీటకాలను బంధించే వీనస్ ఫ్లైట్రాప్ రహస్యం..శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ..!
సాక్షి లైఫ్ : ప్రకృతి సృష్టిలో కొన్ని మొక్కలు చాలా వింతగా, ఆశ్చర్యకరంగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి వాటిలో 'వీనస్ ఫ్లైట్రాప్' (Venus flytrap) అనే మాంసాహార మొక్క ఒకటి. తన మధురమైన సువాసనలతో కీటకాలను ఆకర్షించి, అవి వచ్చి రాగానే రెప్పపాటులో తన ఆకులను నోటిలా మూసివేసి బంధించడంలో ఇది దిట్ట. అసలు కండరాలు, నరాలు లేని ఈ మొక్క.. ఇంత మెరుపు వేగంతో ఆకులను ఎలా మూయగలుగుతోంది..? అనే ప్రశ్న శతాబ్ద కాలంగా పరిశోధకులను తొలిచేస్తోంది. చివరకు జీవశాస్త్ర పితామహుడు చార్లెస్ డార్విన్‌ను సైతం అయోమయంలో పడేసిన ఈ రహస్యాన్ని శాస్త్రవేత్తలు తాజాగా ఛేదించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాలు 'సైన్స్' (the journal Science) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..
ఆకు వెలుపలి కణాలు మెత్తబడటమే అసలు కారణం..!
ఫ్రాన్స్‌కు చెందిన 'నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్' (CNRS), ఏక్స్-మార్సెయ్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ మొక్కపై సుదీర్ఘంగా ప్రయోగాలు చేశారు. సాధారణంగా ఈ మొక్క ఆకులపై సూక్ష్మమైన మూడు స్పర్శ కేశాలు (trigger hairs) ఉంటాయి. ఏదైనా కీటకం వచ్చి వాటిని తాకిన వెంటనే, కేవలం సెకనులో పదో వంతు కాలంలోనే ఒక విద్యుత్ సంకేతం ఆకంతా వ్యాపిస్తుంది.
ఈ సంకేతం అందిన తక్షణమే, ఆకు వెలుపలి భాగంలో ఉండే కణాలు (cell walls) తమ దృఢత్వాన్ని కోల్పోయి ఒక్కసారిగా మెత్తగా, సున్నితంగా మారిపోతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ఆకు లోపలి వైపునకు వంగిపోయి, క్షణాల్లో కీటకాన్ని లోపల వేసి బంధించేస్తుంది.
బెలూన్ ప్రయోగం.. నీటి సిద్ధాంతానికి చెక్..!
ఇంతకాలం ఆకుల్లోని నీటి ఒత్తిడి మారడం వల్లే ఇది జరుగుతుందని భావించేవారు. కానీ, ఈ పరిశోధనలో 'నానోఇండెంటర్' అనే అత్యాధునిక పరికరం సాయంతో ఆకులపై ఒత్తిడిని కొలిచారు."మనం గాలితో నిండిన బెలూన్‌ను వేలితో నొక్కినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో, ఈ ఆకులపై ఒత్తిడిని కూడా అలాగే పరీక్షించాం" అని సీనియర్ ఫిజిసిస్ట్ డాక్టర్ యోయెల్ ఫోర్టెర్ తెలిపారు.
యాంత్రిక గుణాలు..
కణాలు నీటిని కోల్పోవడం వల్ల కాకుండా, వాటి యాంత్రిక గుణాలు మారి అత్యంత వేగంగా ఫ్లెక్సిబుల్‌గా మారడం వల్లే ఈ అద్భుతం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. చిన్న పిల్లలు ఆడుకునే రబ్బరు గిన్నె బొమ్మను నేలకు కొట్టినప్పుడు అది ఒక్కసారిగా పైకి ఎగిరి తిరిగి వచ్చినట్లే... ఈ మొక్క ఆకులు కూడా క్షణంలో తమ రూపాన్ని మార్చుకుంటాయి. మొక్కలు కూడా తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గ్రహించి, సమాచారాన్ని చేరవేస్తూ, అంత వేగంగా స్పందించగలవని నిరూపించడానికి ఈ వీనస్ ఫ్లైట్రాప్ ఒక అద్భుత నిదర్శనమని శాస్త్రవేత్తలు కొనియాడుతున్నారు. ఒకసారి కీటకం చిక్కిన తర్వాత, దాని అస్థిపంజరాన్ని కరిగించి జీర్ణం చేసుకోవడానికి ఈ మొక్కకు కొన్ని వారాల సమయం పడుతుందట.!
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
