Zebrafish : A Boon for Kidney Patients : కిడ్నీ రోగులకు 'జీబ్రా ఫిష్' ఓ వరం..! : దెబ్బతిన్న మూత్రపిండాలను పునరుద్ధరించే మిరకిల్ పవర్..
సాక్షి లైఫ్ : కిడ్నీ వ్యాధులతో బాధపడే కోట్లాది మంది రోగుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా శాస్త్రవేత్తలు ఒక కీలక అడుగు వేశారు. మనుషుల్లో ఒకసారి దెబ్బతిన్న కిడ్నీ కణాలు తిరిగి పుట్టవు. కానీ, 'జీబ్రా ఫిష్' (Zebrafish) అనే చిన్న చేపకు ఉన్న అద్భుత పునరుత్పత్తి శక్తిని అర్థం చేసుకుంటే, భవిష్యత్తులో మానవ కిడ్నీలను కూడా బాగు చేయవచ్చని అమెరికాలోని ఎండీఐ బయో ల్యాబ్ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఆసక్తికర కథనం 'డెవలప్‌మెంట్' అనే అంతర్జాతీయ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఏమిటీ వింత..?
సాధారణంగా మనుషుల్లో అధిక రక్తపోటు లేదా మధుమేహం వల్ల కిడ్నీలోని 'నెఫ్రాన్లు' అంటే..? వ్యర్థాలను వడపోసే చిన్న యూనిట్లు దెబ్బతింటే, అవి శాశ్వతంగా పోయినట్లే. దీనివల్ల కిడ్నీ వైఫల్యం చెంది రక్తశుద్ధి ఆగిపోతుంది. అయితే, జీబ్రా ఫిష్‌లో మాత్రం కిడ్నీ దెబ్బతిన్నప్పుడు కొత్త నెఫ్రాన్లు పుట్టడమే కాకుండా, అవి పాత నాళాలతో (Tubules) అత్యంత చాకచక్యంగా అనుసంధానమవుతున్నాయి.
'ఫ్లంబింగ్' చిక్కుముడి వీడింది..!
పరిశోధనలో తేలిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కొత్తగా పుట్టిన కిడ్నీ కణాలు పాతనాళాలతో ఎలా కలుస్తున్నాయనేది. దీనిని శాస్త్రవేత్తలు ఒక 'ప్లంబింగ్' సమస్యగా అభివర్ణించారు. కొత్త నెఫ్రాన్ పాత నాళాన్ని కలిసే చోట, కొన్ని కణాలు ప్రత్యేకమైన ఆకారాన్ని సంతరించుకుని వంతెనలా మారుతున్నాయి.
సిగ్నలింగ్ వ్యవస్థ: 'Wnt' అనే ప్రత్యేక ప్రోటీన్ సంకేతాల ద్వారా ఏ కణం ఎక్కడ అతుక్కోవాలో, ఏ దిశలో పెరగాలో ఈ చేప శరీరం నిర్దేశిస్తోంది. దీనివల్ల ఎక్కడా లీకేజీలు లేకుండా, వ్యర్థాలు సరిగ్గా బయటకు వెళ్లేలా కొత్త వ్యవస్థ పాతదానితో కలిసిపోతోంది.
మనుషులకు ఎలా ఉపయోగం అంటే..?
ప్రస్తుతం శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో కృత్రిమ కిడ్నీ కణాలను (Organoids) తయారు చేయగలుగుతున్నారు కానీ, వాటిని మనిషి శరీరంలోని పాత నాళాలతో అనుసంధానించడం పెద్ద సవాలుగా మారింది. "ల్యాబ్‌లో కిడ్నీ కణాలను పెంచడం ఒక ఎత్తు అయితే, వాటిని శరీరంలోని పైపులకు అనుసంధానించి పనిచేయించడం మరో ఎత్తు. జీబ్రా ఫిష్ ఈ పనిని ఎలా చేస్తోందో తెలిస్తే, మనం కూడా ల్యాబ్‌లో తయారు చేసిన కణాలను రోగి శరీరంలో విజయవంతంగా అమర్చవచ్చు," అని పరిశోధక బృందం డైరెక్టర్ డాక్టర్ అయిన్ డ్రమ్మండ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 'కనెక్టింగ్' టెక్నిక్ గనుక విజయవంతమైతే, భవిష్యత్తులో డయాలసిస్ అవసరం లేకుండానే దెబ్బతిన్న కిడ్నీలను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
