Muskmelon Seeds : కర్బూజా గింజలు మహిళల ఆరోగ్యానికి 'అమృతం'వంటివి..!
సాక్షి లైఫ్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో మనకు విరివిగా లభించే పండ్లలో కర్బూజా (Cantaloupe) ఒకటి. శరీరానికి చలవ చేయడంతో పాటు డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడే ఈ పండును చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే, పండును తిని లోపల ఉండే గింజలను మాత్రం పనికిరానివిగా భావించి పారేస్తుంటారు. కానీ, ఆ చిన్న గింజల్లో దాగున్న పోషకాల నిధి గురించి తెలిస్తే మాత్రం వాటిని అస్సలు వదిలిపెట్టరు..! ముఖ్యంగా మహిళల్లో తలెత్తే అనేక ఆరోగ్య సమస్యలకు కర్బూజా గింజలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి ఈ గింజలు ఎలా మేలు చేస్తాయో ఓసారి పరిశీలిద్దాం..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
చర్మ సౌందర్యానికి రక్షణ కవచం..
ఈ గింజలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి లోపలి నుండి పోషణను అందిస్తాయి. ఎండల వల్ల చర్మం పొడిబారకుండా నివారించి, తేమను (Moisture) కాపాడతాయి. వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా, చర్మం ఎక్కువ కాలం కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
జుట్టు కుదుళ్లకు బలంమహిళల్లో జుట్టు రాలడం అనేది పెద్ద సమస్య. కర్బూజా గింజల్లో ఉండే ప్రొటీన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు జుట్టు కుదుళ్లను లోపలి నుండి బలంగా మారుస్తాయి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గి, కేశాలు మృదువుగా, మెరుస్తూ ఆరోగ్యంగా ఎదుగుతాయి.
రక్తహీనత, నీరసానికి చెక్..!
భారతీయ మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. కర్బూజా గింజలు ఐరన్‌కు మంచి మూలం. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగవుతాయి. ఫలితంగా తరచూ వేధించే అలసట, నీరసం, తల తిరగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎముకల పుష్టికి ఖనిజాల గనివయసు పెరిగే కొద్దీ మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల ఎముకలు బలహీనపడటం (Osteoporosis) సహజం. ఈ గింజల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం,ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకల సాంద్రతను పెంచుతాయి. కీళ్ల నొప్పులను నివారించి ఎముకలను దృఢంగా ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
బరువు నియంత్రణ..
హార్మోన్ల సమతుల్యతబరువు అదుపులో..ఈ గింజలలో పీచుపదార్థం (Fiber) ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది అతిగా తినడాన్ని (Overeating) నియంత్రించి, జీవక్రియను (Metabolism) మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి హెల్తీ స్నాక్.హార్మోన్ల సమతుల్యత: గింజల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు మహిళల్లో హార్మోన్లను క్రమబద్ధీకరిస్తాయి. ముఖ్యంగా నెలసరి సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్, కడుపునొప్పి, నీరసాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
కర్బూజా గింజలను ఉపయోగించే విధానం..
పండులోని గింజలను సేకరించి, శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఎండిన గింజలను లైట్‌గా వేయించుకుని (Roast), సాయంత్రం పూట స్నాక్ గా తినవచ్చు. వీటిని పొడి చేసి లేదా అలాగే స్మూతీలు, సలాడ్‌లు, సూప్‌లు, డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తీసుకోవచ్చు. ఏదైనా సరే అమితంగా కాకుండా, పరిమిత పరిమాణంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
