Ebola Outbreak : ఎబోలా విజృంభణ: 'కోవిడ్' రోజులను గుర్తుచేస్తున్న తాజా పరిస్థితులు.. 

షేర్ చేయండి:
Ebola Outbreak : ఎబోలా విజృంభణ: 'కోవిడ్' రోజులను గుర్తుచేస్తున్న తాజా పరిస్థితులు.. 

సాక్షి లైఫ్ : ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కొత్త ఆందోళనగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాలను మించి ఈ మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో మొదలైన ఈ ఉపద్రవం.. ఇప్పుడు నెమ్మదిగా ఇతర ఖండాలకు కూడా విస్తరిస్తున్నట్లు వస్తున్న నివేదికలు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు కోవిడ్-19 ప్రారంభ రోజుల్లోని భయాందోళనలను గుర్తుచేస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

పెను సవాల్‌గా మారిన 'బుండిబుగ్యో' స్ట్రెయిన్..!

ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న ఎబోలా రకం ‘బుండిబుగ్యో స్ట్రెయిన్’ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ స్ట్రెయిన్‌ను నివారించడానికి ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి అధీకృత వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం శాస్త్రవేత్తలను, అంతర్జాతీయ ఆరోగ్య విభాగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో కోవిడ్-19 వ్యాప్తి చెందిన తొలినాళ్లలో టీకా లేకపోవడం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయో, ఇప్పుడు ఎబోలా విషయంలోనూ అదే పునరావృతమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనికి విరుగుడుగా ఒక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నప్పటికీ, మానవులపై పరీక్షలు పూర్తి కావడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీనివల్ల రాబోయే ఆరు నెలల వరకు బాధితులకు సమర్థవంతమైన ఔషధం అందడం కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు రష్యా సైతం ఒక టీకాను సిద్ధం చేసినట్లు ప్రకటించినా, దానికి అంతర్జాతీయ గుర్తింపు, ధృవీకరణ రావాల్సి ఉంది.

కోవిడ్ తరహాలోనే భయాందోళనలు..

ప్రస్తుత ఎబోలా వ్యాప్తి నియంత్రణ పరిధిని దాటిపోతోందని, తక్షణమే ప్రపంచ దేశాలు అప్రమత్తం కాకపోతే మరో అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం తప్పదని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ హెచ్చరించారు. ఆఫ్రికన్ యూనియన్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యల కంటే, దాని వ్యాప్తి వేగం చాలా ఎక్కువగా ఉందన్నారు.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఉగాండా, కాంగో దేశాల్లో దాదాపు 1,198 కేసులు (128 నిర్ధారిత, 1,077 అనుమానిత కేసులు) వెలుగుచూశాయి. అలాగే ఈ వ్యాధి కారణంగా సుమారు 228 మంది మరణించినట్లు యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC) వెల్లడించింది.

అంత్యక్రియల సమయంలోనే అధిక సంక్రమణ..!

ఎబోలా సోకి మరణించిన వారి మృతదేహాల ద్వారా ఈ వైరస్ ఇతరులకు వేగంగా విస్తరిస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు గుర్తించారు. కాంగోలో సాంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహిస్తూ, మృతదేహాలను తాకడం వల్లే ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. 

ఇటీవల మరణించిన వారిలో ముగ్గురు రెడ్ క్రాస్ వాలంటీర్లు కూడా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికాకు చెందిన ఒక వైద్యుడు సైతం ఎబోలా ప్రభావిత ప్రాంతంలో సేవలందించి స్వదేశం తిరిగొచ్చిన తర్వాత ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే భారత్, అమెరికాతో సహా పలు దేశాలు అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రయాణీకుల స్క్రీనింగ్‌ను, నిఘాను ముమ్మరం చేశాయి.

యూరప్ దేశాలైన ఇటలీ, ఆస్ట్రియాల్లోనూ అనుమానిత కేసులు నమోదవ్వడం, భారతదేశంలోనూ గతంలో ఒక అనుమానిత కేసు వెలుగుచూసి తర్వాత కోలుకోవడం వంటి పరిణామాలు గ్లోబల్ అలర్ట్‌కు కారణమవుతున్నాయి.

అప్రమత్తత అవసరం..

సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ డెరెక్ స్లోన్ అభిప్రాయం ప్రకారం.. ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక దేశంలోని ఆరోగ్య సమస్యను మిగిలిన దేశాలు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు.

ప్రారంభ లక్షణాలు..సాధారణ ఫ్లూ తరహాలోనే జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో ఈ బుండిబుగ్యో స్ట్రెయిన్ ప్రారంభమవుతుంది.
 వ్యాధి ముదిరితే అంతర్గత రక్తస్రావం జరిగి, శరీర అవయవాలు వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉంది.

ఇంక్యుబేషన్ టైమ్..

 వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత లక్షణాలు బయటపడటానికి 21 రోజుల సమయం పడుతుంది. ఈ సుదీర్ఘ కాలంలో బాధితుల ద్వారా ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గత 2014 నాటి పశ్చిమ ఆఫ్రికా ఎబోలా ఉధృతి (28వేల కేసులు, 11వేల మరణాలు) తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రమాదకరమైన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తుండటంతో, అంతర్జాతీయ సమాజం సమష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.