Medical Breakthrough : వైద్య రంగంలో సరికొత్త రికార్డ్.. ఒకేసారి మనిషికి పంది కాలేయం, మూత్రపిండాల మార్పిడి..!
సాక్షి లైఫ్ : అవయవ మార్పిడి (Organ Transplantation) రంగంలో శాస్త్రవేత్తలు చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు. వైద్య చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ చైనాకు చెందిన నిపుణుల బృందం జన్యుమార్పిడి చేసిన పంది కాలేయంతో పాటు, రెండు మూత్రపిండాలను ఒకేసారి విజయవంతంగా మానవ శరీరంలోకి అమర్చింది.
ఇది కూడా చదవండి.. చర్మ సమస్యలు రాకుండా ఎలాంటి కేర్ అవసరం..?
ఇది కూడా చదవండి.. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కు ఇవి చాలా అవసరం..
ఇది కూడా చదవండి.. మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది రోగులు కాలేయం, కిడ్నీలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో.. ఈ ప్రయోగం వైద్య లోకంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. జంతువుల అవయవాలను మానవులకు అమర్చే ‘జెనోట్రాన్స్ప్లాంటేషన్’ ప్రక్రియలో ఇదొక అద్భుత పురోగతిగా అంతర్జాతీయ ‘నేచర్’ జర్నల్ అభివర్ణించింది.
ఒకేసారి బహుళ అవయవాల మార్పిడి..
ఇంతకుముందు పంది గుండె లేదా కిడ్నీని వేర్వేరుగా మానవులకు అమర్చే ప్రయోగాలు జరిగాయి. కానీ, ఒకేసారి రెండు వేర్వేరు అవయవాలను మార్పిడి చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి.
బ్రెయిన్ డెడ్ అయిన 53 ఏళ్ల వ్యక్తిపై ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు. ఇందుకు ఆయన కుటుంబ సభ్యులు ముందే అంగీకారం తెలిపారు.
జన్యుపరంగా మార్పులు చేసిన పంది అవయవాలు మానవ శరీరంలో దాదాపు ఐదు రోజుల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా అద్భుతంగా పనిచేశాయి. వైద్యులు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించారు.
వేగంగా స్పందించిన అవయవాలు..
సాధారణంగా పరాయి అవయవాలను మానవ శరీరం అంత త్వరగా అంగీకరించదు. కానీ, ఈ ప్రయోగంలో శస్త్రచికిత్స జరిగిన మొదటి 24 గంటల్లో ఎలాంటి ప్రతికూల సంకేతాలు కనిపించలేదు.
కాలేయం అమర్చిన 19 గంటల్లోనే పంది కాలేయం మానవ శరీరంలో పైత్యరసాన్ని (Bile) ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఇది కాలేయం సాధారణ స్థితికి చేరిందనడానికి నిదర్శనం.
మూత్రపిండాలు సదరు రోగి శరీరంలో అంతకుముందు ప్రమాదకర స్థాయిలో ఉన్న క్రియేటినిన్, యూరియా శాతాలు.. ఈ కొత్త కిడ్నీలను అమర్చిన తర్వాత సాధారణ స్థాయికి చేరుకున్నాయి. పంది కిడ్నీలు రక్తాన్ని సమర్థవంతంగా శుద్ధి చేయడం ప్రారంభించాయని వైద్యులు ధృవీకరించారు.
సవాళ్లు.. భవిష్యత్తుపై ఆశలు..
రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల వల్ల అవయవాలు దెబ్బతిని, దాతలు దొరక్క నిరీక్షణ జాబితాలోనే కన్నుమూస్తున్న వేలాది మంది రోగులకు ఈ సాంకేతికత కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
మరిన్ని పరిశోధనలు అవసరం..
ఈ ప్రయోగం విజయవంతమైనప్పటికీ, దీనిని నేరుగా జీవించి ఉన్న రోగులపై ప్రయోగించడానికి ముందు మరిన్ని దశల పరిశీలనలు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పంది అవయవాల ద్వారా జంతువులకు సంబంధించిన వైరస్లు, బ్యాక్టీరియాలు మానవులకు సోకకుండా చూసుకోవడం ఇందులో అతిపెద్ద సవాలు. ఇందుకోసం కోతులు, ఇతర జీవులపై మరికొంత కాలం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. ఈ సవాళ్లను అధిగమిస్తే.. భవిష్యత్తులో అవయవాల కొరత అనే మాటే వినిపించదని వైద్య నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
