Stress Eating : బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా తినేస్తున్నారా..? అది 'స్ట్రెస్ ఈటింగ్' కావొచ్చు..!
సాక్షి లైఫ్ : ఒంటరిగా ఉన్నప్పుడో, కోపంలో ఉన్నప్పుడో, లేదా ఏదైనా బాధలో ఉన్నప్పుడో మీకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తున్నారా? పదే పదే ఏదైనా తినాలనిపిస్తోందా? అయితే అది కేవలం ఆకలి మాత్రమే కాకపోవచ్చు. మానసిక ఒత్తిడి వల్ల కలిగే 'స్ట్రెస్ ఈటింగ్' (Stress Eating) కావచ్చు..! ఉరుకులు పరుగుల జీవితం, ఆఫీసులో పని ఒత్తిడి, ఆందోళన వంటివి మన ఆహారపు అలవాట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ అలవాటును ఇలాగే వదిలేస్తే దీర్ఘకాలంలో ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే. అసలు ఈ 'స్ట్రెస్ ఈటింగ్' ఎందుకు వస్తుంది..? దీన్ని ఎలా అరికట్టాలో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
అసలేంటి 'స్ట్రెస్ ఈటింగ్'..?
నిజంగా కడుపులో ఆకలిగా లేకపోయినా.. ఒత్తిడి, ఆందోళన, కోపం లేదా విచారం వంటి భావోద్వేగాల కారణంగా ఆహారం తీసుకోవడాన్నే 'స్ట్రెస్ ఈటింగ్' అంటారు. ఇలాంటి సమయంలో ఎక్కువగా తీపి పదార్థాలు, జంక్ ఫుడ్, నూనె పదార్థాలు తినాలనే కోరిక పుడుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో 'కార్టిసాల్' (Cortisol) అనే హార్మోన్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ఇది ఆకలిని ప్రేరేపించి, ఎక్కువగా తినేలా చేస్తుంది.
ఎందుకిలా జరుగుతుంది..?
ఒత్తిడి, ఆందోళన..మనసు ఒత్తిడికి గురైనప్పుడు, దానికి తక్షణ ఉపశమనం లేదా సంతోషం కావాలి. తీపి లేదా ఇష్టమైన పదార్థాలు తిన్నప్పుడు తాత్కాలికంగా మానసిక స్థితి మెరుగుపడుతుంది. అందుకే ఆ సమయంలో తినడానికి మొగ్గుచూపుతారు. భావోద్వేగ ఆకలి.. కడుపు నిండి ఉన్నప్పటికీ ఏదో తినాలనిపిస్తుంది. ఇది శారీరక ఆకలి కాదు, కేవలం భావోద్వేగాల వల్ల కలిగే ఆకలి.
నిద్రలేమి..సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శరీరంలో ఆకలిని ప్రేరేపించే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలనిపిస్తుంది.బోర్ కొట్టడం, ఒంటరితనం.. చాలామంది ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు కాలక్షేపం కోసం ఏదో ఒకటి తింటుంటారు. అదే క్రమంగా వ్యసనంగా మారుతుంది.
లక్షణాలు ఎలా ఉంటాయి..?
అసలు ఆకలి లేకపోయినా పదే పదే ఏదో ఒకటి తినడం.
చిరుతిళ్లు, స్వీట్లు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినాలనిపించడం.
ఒత్తిడిలో ఉన్నప్పుడు పరిమితికి మించి ఆహారం తీసుకోవడం.
తిన్న తర్వాత అపరాధ భావన (Guilt) కలగడం.
తినేటప్పుడు నోటిని, చేతిని అదుపు చేసుకోలేకపోవడం.
నష్టాలు ఎక్కువే..!
ఈ అలవాటును ఇలాగే కొనసాగిస్తే బరువు పెరగడం, ఊబకాయం బారిన పడటం ఖాయం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం వంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎలా అదుపు చేసుకోవాలి..?
ప్రత్యామ్నాయ మార్గాలు..ఒత్తిడి అనిపించినప్పుడు వెంటనే ఫ్రిజ్ తీయడం కాకుండా.. యోగా, ధ్యానం, వాకింగ్ లేదా దీర్ఘంగా శ్వాస తీసుకోవడం (Deep breathing) వంటివి అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన స్నాక్స్.. ఒకవేళ మధ్యలో ఏదైనా తినాలనిపిస్తే.. జంక్ ఫుడ్‌కు బదులుగా తాజా పండ్లు, నట్స్, మొలకలు వంటివి ఎంచుకోవాలి. నిద్ర ముఖ్యం..ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇది హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది.
డైరీ రాయడం..రోజంతా ఏ సమయంలో ఏం తింటున్నారో ఒక డైరీలో రాసుకోవడం వల్ల మీ ఆహారపు అలవాట్లపై మీకే ఒక స్పష్టత వస్తుంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ఇష్టమైన సంగీతం వినడం, వ్యాయామం చేయడం లేదా మీకు ఇష్టమైన పనుల్లో నిమగ్నమవడం ద్వారా అనవసరంగా తినడాన్ని అడ్డుకోవచ్చు. మీ ఆహారపు అలవాట్లు పూర్తిగా అదుపు తప్పుతు న్నాయని భావించినా, అసాధారణంగా బరువు పెరుగుతున్నా లేదా ఒత్తిడి మరీ శృతి మించుతున్నా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
