Visual Agnosia and Achromatopsia : కళ్లు చూస్తాయి.. కానీ, మెదడు అంధకారంలో ఉంటుంది.. ‘విజువల్ ఆగ్నోసియా’, ‘అక్రోమాటోప్సియా’ గురించి తెలుసా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం లేవగానే ఆఫీసుకు వెళ్లే తొందరలో ఉన్న రవి.. టేబుల్ మీద ఉన్న తన కాఫీ కప్పును అందుకుందామని చేయిచాచాడు. కళ్ల ముందే కప్పు స్పష్టంగా కనిపిస్తున్నా, దాని ఆకారం ఏమిటో క్షణకాలం పాటు గుర్తుపట్టలేక అయోమయంలో పడిపోయాడు..! అంతేకాదు, కిటికీలోంచి బయటికి చూస్తే ఎంతో అందంగా కనిపించాల్సిన పచ్చని చెట్లు, నీలిరంగు ఆకాశం అన్నీ ఒక్కసారిగా బూడిద రంగులోకి మారిపోయినట్లు కనిపించాయి. కంటిచూపు సవ్యంగానే ఉన్నా, మెదడులో జరిగే చిన్న లోపం వల్ల రవి ఈ ఈ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. అదేంటో తెలిస్తే.. ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టకమానదు. అసలు కళ్లు చక్కగా పనిచేస్తున్నా, ప్రపంచాన్ని రంగులను ఆస్వాదించకుండా మెదడు ఎందుకు చేతులెత్తేస్తుంది..? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలపై ‘సాక్షి లైఫ్’ స్పెషల్ స్టోరీ..!

 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

మెదడే కారణం..

మనిషి కంటి చూపునకు, మెదడులోని సంక్లిష్ట నాడీ వ్యవస్థకు మధ్య జరిగే అద్భుతమైన ప్రయాణంలో లోపాలు తలెత్తితే ఏర్పడే వింతైన నాడీ సంబంధిత రుగ్మతలే ‘విజువల్ ఆగ్నోసియా’ (Visual Agnosia), ‘అక్రోమాటోప్సియా’ (Achromatopsia). మన మెదడు వెనుక భాగంలో ఉండే ఆక్సిపిటల్ లోబ్ (Occipital Lobe), దాని పరిసరాలు కంటి ద్వారా అందిన కాంతి సంకేతాలను రూపాలుగా, రంగులుగా విడమర్చి విశ్లేషిస్తాయి. అయితే మెదడులోని ఈ భాగాలకు గాయాలు కావడం, స్ట్రోక్స్ రావడం లేదా నాడీ కణాల్లో లోపాలు తలెత్తడం వల్ల పైన పేర్కొన్న రుగ్మతలు వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కంటిలో సమస్య లేకున్నా..

 ‘విజువల్ ఆగ్నోసియా’ బారిన పడిన వ్యక్తులు తమ కళ్లతో వస్తువులను స్పష్టంగా చూడగలరు. కానీ, వాటి ఆకారం లేదా అది ఏ వస్తువు అనే విషయాన్ని గుర్తించలేరు. దీనికి కారణం.. మెదడు ఆ వస్తువులను గుర్తించకపోవడమే..! ఉదాహరణకు ఎదురుగా పెన్ను ఉన్నప్పటికీ దాన్ని గుర్తించి, 'ఇది పెన్ను' అని చెప్పలేకపోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణం. ఇక ‘అక్రోమాటోప్సియా’ అనేది దీనికి పూర్తి భిన్నమైనది. ఇది రంగులను గుర్తించే మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

ఈ సమస్య ఉన్నవారికి లోకం మొత్తం కేవలం నలుపు, తెలుపు లేదా బూడిద రంగు ఛాయల్లో మాత్రమే దృశ్యాలు కనిపిస్తాయి. సాధారణ కలర్ బ్లైండ్‌నెస్ కంటే ఇది పూర్తిగా భిన్నమైనదని, కంటిలోని రిసెప్టర్లు బాగున్నప్పటికీ రంగులను ప్రాసెస్ చేసే మెదడు కేంద్రాలు దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

చికిత్స ఉంటుందా..?

ఆధునిక న్యూరో సైన్స్, మానసిక ఆరోగ్య నిపుణులు ఈ రుగ్మతలపై విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. కేవలం వైద్యపరమైన పరీక్షలతోనే కాకుండా, రోగుల ప్రవర్తనా సరళిని అధ్యయనం చేయడం ద్వారా మెదడు పనితీరును అంచనా వేస్తున్నారు. ఇలాంటి విజువల్ డిజార్డర్స్ బారిన పడిన వారికి సరైన మానసిక కౌన్సెలింగ్, పునరావాస శిక్షణ అందించడం ద్వారా వారు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులను కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మెదడులోని ఈ అద్భుతమైన కోణాలను అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని మెరుగైన చికిత్స విధానాలను కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.- సాక్షి లైఫ్ డెస్క్.

 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.