Viruses Using Digital Data : డిజిటల్ డేటాతో వైరస్ తయారీ..! కృత్రిమ వైరస్‌ల సృష్టిలో శాస్త్రవేత్తల విజయం..
సాక్షి లైఫ్ : ఈ మధ్య కాలంలో 'యాంటీబయోటిక్ రెసిస్టెన్స్' అనేది ఎక్కువగా వినబడుతోంది. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటే మందులకు లొంగని బ్యాక్టీరియా అని అర్థం. ఇప్పుడీ సమస్య వైద్య రంగానికి పెను సవాలుగా మారింది. చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా శక్తివంతమైన మందులు కూడా పనిచేయని పరిస్థితి. ఈ నేపథ్యంలో, ప్రాణాంతక బ్యాక్టీరియాను వేటాడి చంపే 'బ్యాక్టీరియోఫేజ్' (Bacteriophage) వైరస్‌లను ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించడంలో శాస్త్రవేత్తలు అద్భుత విజయం సాధించారు.
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
యేల్ యూనివర్సిటీ, న్యూ ఇంగ్లాండ్ బయోల్యాబ్స్ పరిశోధకులు సంయుక్తంగా 'సూడోమోనాస్ ఎరుగినోసా' అనే మొండి బ్యాక్టీరియాను అంతం చేసేలా ఈ సింథటిక్ వైరస్‌లను రూపొందించారు.
ఏమిటీ బ్యాక్టీరియోఫేజ్..?
సాధారణంగా వైరస్‌లు అంటే మనకు జబ్బులు కలిగిస్తాయని తెలుసు. కానీ బ్యాక్టీరియోఫేజ్‌లు కేవలం బ్యాక్టీరియాను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వాటిని నాశనం చేస్తాయి. ఇవి మానవ కణాలకు ఎటువంటి హాని చేయవు. వందేళ్ల క్రితమే వీటిని గుర్తించినప్పటికీ, ప్రకృతిలో లభించే వైరస్‌లను సేకరించి చికిత్సకు వాడటం చాలా కష్టంతో కూడుకున్న పని.
డిజిటల్ డేటాతోనే వైరస్ తయారీ..!
గతంలో ఒక వైరస్‌ను మార్చాలంటే ఏళ్ల తరబడి శ్రమించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 'గోల్డెన్ గేట్ అసెంబ్లీ' అనే సరికొత్త సాంకేతికత ద్వారా డిజిటల్ సీక్వెన్స్ డేటాను ఉపయోగించి కేవలం కొన్ని రోజుల్లోనే వైరస్ జన్యువును శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు. క్లిష్టమైన డిఎన్ఏ ముక్కలను కలిపి పూర్తిస్థాయి వైరస్‌ను సృష్టించవచ్చు. వైరస్ తోక భాగంలోని జన్యువులను మార్చడం ద్వారా, అది ఏ బ్యాక్టీరియాను చంపాలో శాస్త్రవేత్తలు నిర్ణయించగలరు. సహజ సిద్ధమైన ప్రమాదకర వైరస్‌లను ల్యాబ్‌లో పెంచాల్సిన అవసరం లేకుండానే, కంప్యూటర్ డేటా ఆధారంగా వీటిని తయారు చేయవచ్చు.
భవిష్యత్తు ఆశాజనకం..
ఈ పరిశోధన విజయవంతం కావడంతో, భవిష్యత్తులో రోగి శరీరంలోని బ్యాక్టీరియా రకాన్ని బట్టి, దానికి తగినట్లుగా 'పర్సనలైజ్డ్' వైరస్ మందులను తయారు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, రక్తంలో ఇన్ఫెక్షన్లు కలిగించే సూపర్ బగ్స్ నియంత్రణలో ఇది కీలక మైలురాయి కానుంది. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఈ సింథటిక్ విధానం చాలా సులభం, సురక్షితం. ఇది ఔషధ తయారీ రంగంలో కొత్త విప్లవానికి దారితీస్తుందని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
